Women’s Day 2022: మహిళా దినోత్సవం రోజు మీ శ్రీమతికి మరుపురాని బహుమతి ఇవ్వాలని ఉందా...అయితే ఆమె భవిష్యత్ కోసం ఏదైనా పెట్టుబడి స్కీంలో డబ్బు పెడితే, భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అయితే ఇలాంటి బహుమతులపై పన్నులు వేసే చాన్స్ ఉంది. మరి టాక్స్ రూల్స్ ఏంటో తెలుసుకుందాం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈసారి మహిళా దినోత్సవం సందర్భంగా మీ భార్యకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆమె పేరు మీద ఏదైనా మంచి స్కీంలో పెట్టుబడి పెట్టడం బెటర్ ఆప్షన్. అయితే, అటువంటి పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయానికి ఎలా పన్ను విధిస్తారో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.
భార్య పేరు మీద భర్త చేసే ఏదైనా పెట్టుబడిని బహుమతిగా పరిగణిస్తామని పన్ను నిబంధనలు పేర్కొంటున్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫారమ్‌లోని షెడ్యూల్ EIలో భార్యకు అందించిన పెట్టుబడి మొత్తాన్ని మినహాయించబడిన ఆదాయంగా వెల్లడించాలి. ఉదాహరణకు, భర్త సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో (SCSS) భార్య పేరు మీద పెట్టుబడి పెట్టినట్లయితే, వడ్డీ ఆదాయం ITR యొక్క షెడ్యూల్ SPI ( Schedule SPI)లో అతని మొత్తం ఆదాయంలో చూపిస్తుంది. అయితే భార్య తన ఆదాయాన్ని వెల్లడించాల్సిన అవసరం లేదు.
బంధువుల నుండి అందుకున్న నగదు బహుమతులపై పన్ను
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం బంధువుల నుంచి వచ్చే నగదు బహుమతులపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. బంధువుల సర్కిల్ కింద ఎవరు వస్తారో కూడా నిర్వచించారు. ఇది భర్త లేదా భార్య, సోదరుడు లేదా సోదరి, భర్త లేదా భార్య యొక్క సోదరుడు లేదా సోదరి అని పేర్కొంది. ఒక వ్యక్తి వంశపారంపర్య బంధువు, జీవిత భాగస్వామి యొక్క ఏదైనా వంశపారంపర్య బంధువు, ఈ బంధువుల పరిధిలోకి వస్తారు.
ఇతరుల నగదు బహుమతులపై పన్ను
ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 56(2)(x) ప్రకారం, ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి పరిగణన లేకుండా పొందే మొత్తం సంపద రూ.50,000 దాటితే, దానిపై పన్ను విధించబడుతుంది. అటువంటి మొత్తానికి "ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం"గా (Income from other sources) పన్ను విధిస్తారు.
ఆర్‌ఎస్‌ఎమ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ సురేశ్ సురానా ప్రకారం, ఆర్థిక సంవత్సరంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల నుండి అందుకున్న మొత్తం నగదు రూ. 50,000 దాటితే, అటువంటి మొత్తానికి వర్తించే స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. అందువల్ల, పన్ను నుంచి బయటపడేందుకు ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న మొత్తం బహుమతుల మొత్తం రూ.50,000 మించకూడదు.
