న్యూఢిల్లీ/ ముంబై: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్‌వేస్‌’ మూసివేత దశకు చేరుకుంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకున్న ఆ సంస్థకు మధ్యంతరంగా మరింత రుణం అందించడానకి భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) ఆధ్వర్యంలోని బ్యాంకర్ల కన్సార్టియం మరోమారు విముఖత వ్యక్తం చేసింది. 

మధ్యంతర సాయం విషయమై సోమవారం జెట్ ఎయిర్‌వేస్‌ బోర్డు ప్రతినిధులు.. బ్యాంకర్ల బృందంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు మరింత ఆర్థిక సాయం అందించలేమని కొందరు బ్యాంకర్లు తేల్చి చెప్పడంతో సంస్థ కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి.  

జెట్ ఎయిర్‌వేస్‌ను తిరగి నిలబెట్టేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకర్ల కన్సార్టియం గత మార్చి 25వ తేదీని రుణపరిష్కార ప్రణాళికను రూపొందించింది. దీని ప్రకారం సంస్థలో ప్రధాన వాటా కొనుగోలు జరిగే వరకు రుణదాతల బృందం దాదాపు రూ.1500 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు హామీ ఇచ్చింది. 

రూ.1500 కోట్ల ఆర్థిక సాయం అందించడానికి జెట్ ఎయిర్‌వేస్ సంస్థ చైర్మెన్‌ నరేశ్‌ గోయల్‌, ఆయన బార్య అనిత సంస్థలో తమ వాటాను 25 శాతం కంటే తగ్గించుకోవాలని కోరింది. ఈ ప్రణాళిక ప్రకారం గోయల్‌ తన పదవి నుంచి తప్పుకోవడంతోపాటు తన వాటాను తగ్గించుకొనే ప్రతిపాదనకు కూడా సమ్మతించారు.

జెట్ ఎయిర్‌వేస్ నిర్వహణ బాధ్యతలను చేతుల్లోకి తీసుకున్న బ్యాంకర్ల కన్సార్టియం ఆ తరువాత మధ్యంతర సాయం అందించే విషయంలో వెనుక అడుగు వేస్తూ వస్తున్నది. ఇప్పటికే రెండుసార్లు ఈ విషయమై బ్యాంకర్లతో జెట్‌ యాజమాన్యం చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. 

తాజాగా బ్యాంకర్లు, జెట్ ఎయిర్‌వేస్ బోర్డు సభ్యుల మధ్య సోమవారం చర్చలు కూడా విఫలం కావడంతో పరిస్థితి మరింత విషమంగా తయారైంది. ఈ నేపథ్యంలో సంస్థలోని దాదాపు 20,000 మంది ఉద్యోగుల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 

ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు జెట్ ఎయిర్‌వేస్ బోర్డు మంగళవారం అత్యవసరంగా సమావేశం కానుందని సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వినయ్ దూబే తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సర్వీసుల రద్దును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. 

నిధుల కొరత వల్ల తాత్కాలికంగా జెట్ ఎయిర్‌వేస్ మూత పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మంగళవారం జరిగే జెట్ ఎయిర్‌వేస్ బోర్డు అత్యవసర సమావేశంలో తాత్కాలికంగా సంస్థను మూసివేయడంతోపాటు అన్ని ఆప్షన్లపై చర్చించనున్నారు.

బ్యాంకర్ల వైఖరి, సిబ్బందితోపాటు సంస్థ భవితవ్యంపై నెలకొన్న పరిస్థితులను బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలని బోర్డు సభ్యుల నుంచి జెట్ ఎయిర్‌వేస్ కోరనున్నది. 

జెట్ ఎయిర్‌వేస్ టేకోవర్ కోసం దాఖలు చేసిన బిడ్డర్ల నుంచి ఆకర్షణీయ ప్రతిపాదనలు వస్తే తప్ప రూ.1500 కోట్ల నిధులు సమకూర్చేందుకు బ్యాంకర్లు సిద్ధంగా లేరని ఎస్బీఐ వర్గాల కథనం. తిరిగి సంస్థను తమ ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తున్న జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్, వాటాదారు ఎతిహాద్ సంస్థలకు గట్టి ఎదురుదెబ్బేనని భావిస్తున్నారు. ఈ రెండు సంస్థలు వేర్వేరుగా బిడ్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

ఇటు నరేశ్ గోయల్, అటు ఎతిహాద్ కూడా ఈ నెలాఖరు నాటికి ఆర్థిక బిడ్లతో కూడిన ప్రతిపాదనలను బ్యాంకర్ల కన్సార్టియంకు సమర్పించాల్సి ఉంటుంది. ఎతిహాద్, నరేశ్ గోయల్ నిధుల సమీకరణ ద్వారా సంస్థ నిర్వహణకు నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే ఈ దుస్థితి నెలకొన్నదని బ్యాంకర్లు భావిస్తున్నారు. 

అయితే ప్రస్తుతం జెట్ ఎయిర్‌వేస్ బోర్డు చేస్తున్న డిమాండ్ మేరకు రూ.1500 కోట్లు సమకూర్చినా సంస్థ నిర్వహణకు సరిపోదని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ స్పష్టతనిచ్చారు. సంస్థ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన మద్దతు కొనసాగించేందుకు బ్యాంకులకు సత్తా ఉన్నదని పేర్కొన్నారు. 

అయితే తమ బ్యాంకు ఇతర బ్యాంకర్లకు లీడ్ బ్యాంక్‌గా మాత్రమే వ్యవహరిస్తుందని సోమవారం పొద్దు పోయిన తర్వాత జారీ చేసిన ప్రకటనలో ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తేల్చేశారు. తమ రుణాలను ఈక్విటీలుగా మార్చుకునేందుకే జెట్ ఎయిర్‌వేస్ నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకున్నాయని అధికార వర్గాల కథనం. 

జెట్ ఎయిర్‌వేస్ ఈక్విటీలుగా రుణాల మార్పిడి ప్రక్రియ చేపట్టిన తర్వాత దానిని మరో సంస్థకు బిడ్డింగ్ కమ్ సేల్ ప్రాసెస్ ద్వారా అప్పగించడానికే ప్రాధాన్యం ఇస్తామని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. అవసరమైన మద్దతు, సహాయ సహకారాలు అందజేస్తామని, అందుకు వాటాదారులందరి సహకారం అవసరమని ఒక ప్రకటనలో తెలిపారు.