బెంగళూరు: తమ ఉద్యోగుల ఖాతాలు హ్యాక్ అయ్యాయంటూ దేశీయ ఐటీ సేవల సంస్థ విప్రో లిమిటెడ్ మంగళవారం వెల్లడించింది. అడ్వాన్స్‌డ్ ఫిషింగ్ క్యాంపెయిన్ కారణంగా ఇది జరిగివుండవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది.

హ్యాక్ కారణంగా ఏదైనా తీవ్ర ప్రభావం ఉందా? అనే విషయంపై ఇప్పటికే విచారణ చేపట్టినట్లు పేర్కొంది. విప్రో సిస్టమ్స్ హ్యాక్‌కు గురయ్యాయని, కంపెనీకి చెందిన పలువురు క్లైంట్లపై దాడి చేసే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ బ్లాగ్ క్రెమ్స్‌ఆన్‌సెక్యూరిటీ తెలిపింది.

కనీసం డజన్ కస్టమర్ సిస్టమ్స్‌ లక్ష్యంగా ఈ హ్యాక్ జరిగిందని వెల్లడించింది. అడ్వాన్స్‌డ్ ఫిషింగ్ క్యాంపెయిన్ కారణంగా తమ నెట్‌వర్క్‌లోని పలువురు ఉద్యోగుల ఖాతాల్లో అసాధారణ అక్టివిటీని గుర్తించామని విప్రో తన ఈమెయిల్ స్టేట్‌మెంట్‌లో తెలిపింది. 

విచారణలో సహాయపడేందుకు ఇండిపెండెంట్ ఫొరెన్సిక్ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అయితే, ఏ క్లైంట్ల సమాచారానికి ఏ విధమైన సమస్య కలిగిందనేది మాత్రం వెల్లడించలేదు. 

కాగా, విప్రో ఈరోజు తన నాలుగవ త్రైమాసిక ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ సంస్థలు క్యూ4 ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే.