రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదురుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్  ఉక్రెయిన్‌పై యుద్ధం  ప్రకటించడంతో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలగా, మరోవైపు ముడిచమురు ధరలు కూడా ఒక్కసారిగా ఎగిశాయి.

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదురుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడంతో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలగా, మరోవైపు ముడిచమురు ధరలు కూడా ఒక్కసారిగా ఎగిశాయి. గురువారం బ్రెంట్ క్రూడ్ ధర తొలిసారిగా బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. 8 ఏళ్లలో బ్రెంట్ క్రూడ్ ధర తొలిసారిగా ఈ రికార్డు స్థాయికి చేరుకుంది. 
ఆసియా ట్రేడ్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 101.34 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ పెరుగుదల సెప్టెంబర్ 2014 నుండి అత్యధికం. యూ‌ఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 4.22 డాలర్లు లేదా 4.6 శాతం పెరిగి బ్యారెల్ 96.51 డాలర్లకి చేరుకుంది. ఒక నివేదిక ప్రకారం ఈ పెంపు ఆగస్టు 2014 తర్వాత ఇదే అత్యధికం.

భారతదేశం ప్ర‌ధానంగా చమురు దిగుమతులపై ఆధారపడి ఉంది. 2021లో 197 మెట్రిక్ టన్నుల (MT) చ‌మురును దిగుమ‌తి చేసుకోగా.. 2018లో 220 మెట్రిక్ టన్నుల చ‌మురును దిగుమ‌తి చేసుకుంది. ఇక‌పోతే చ‌మురు దిగుమ‌తులు భార‌త్‌లో 2021లో 84.4 శాతం, 2020లో 85 శాతం, 2019లో 83.8 శాతం, 2018లో 82.9 శాతం, 2017లో 81.7 శాతంగా ఉన్నట్లు రాయిట‌ర్ ఓ నివేదిక‌లో పేర్కొంది. భారతదేశంలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించదు. దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలను సవరిస్తాయని రాయిట‌ర్ పేర్కొంది.

ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. ఉక్రెయిన్ వెనక్కి తగ్గకుంటే యుద్ధం తప్పదని హెచ్చరించారు. మధ్యలో మరేదైనా దేశం వస్తే దానిపై కూడా ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ అన్నారు.పుతిన్ యుద్ధ ప్రకటన ఇంధన ఎగుమతులకు అంతరాయం కలిగిస్తుందనే భయాలను పెంచింది. రష్యా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారి కావడం గమనార్హం. ఇది ప్రధానంగా యూరోపియన్ రిఫైనరీలకు ముడి చమురును విక్రయిస్తుంది. ఐరోపా దేశాలు చమురులో 20 శాతానికిపైగా రష్యా నుంచి తీసుకుంటున్నాయి.

దేశీయ మార్కెట్‌లో క్ర‌మంగా మూడు నెలలకుపైగా పెట్రోలు, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. 2017 జూన్‌లో రోజువారీ ధరల సవరణ ప్రారంభమైనప్పటి నుండి ఇంధన ధరలు మారకుండా ఉన్న సుదీర్ఘ కాలం ఇదే. 2021 న‌వంబ‌ర్‌లో కేంద్ర ప్రభుత్వం ఇంధనాలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపును ప్ర‌క‌టించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు బాగా తగ్గాయి. ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించింది.

రష్యా-ఉక్రెయిన్ ప్రభావం భారతీయ కుటుంబాలకు, అలాగే పాలకులకు పెద్ద తలనొప్పిగా పరిమణించవచ్చు. వాణిజ్యంపైన ప్రభావం పడితే, ఇక్కడి ధరలు పెరుగుతాయి. 2022 ప్రారంభం నుండి చమురు ధరలు బ్యారెల్‌కు $20 కంటే ఎక్కువ పెరిగాయి. యునైటెడ్ స్టేట్స్, యూరప్, రష్యా ఇంధన రంగంపై ఆంక్షలు విధించి సరఫరాలకు అంతరాయం కలిగించాయి. రష్యా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది. ప్రధానంగా దాని ముడి చమురును యూరోపియన్ రిఫైనరీలకు విక్రయిస్తుంది, ఐరోపాకు సహజ వాయువు అతిపెద్ద సరఫరాదారుగా ఉంది. ఇది సరఫరాలో 35 శాతం అందిస్తుంది.

ర‌ష్యా, ఉక్రెయిన్‌ల శత్రుత్వం కారణంగా ప్రపంచ చ‌మురు సరఫరాలు దెబ్బతిన్నట్లయితే, ఇతర అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) సభ్య దేశాలతో కలిసి తమ చమురు నిల్వలను ట్యాప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని జపాన్, ఆస్ట్రేలియా దేశాల ప్ర‌తినిధులు గురువారం తెలిపారు. భారత్‌కు అవసరమైన గ్యాస్ దిగుమతులు ఉక్రెయిన్ నుండి కూడా ఉన్నాయి. రష్యా నుండి కూడా కొంత దిగుమతులు ఉన్నాయి. ఈ ప్రభావం మనపై ఉంటుంది. మరోవైపు, భారత్ నుండి ఉక్రెయిన్‌కు ఫార్మా ఎగుమతులు ఉన్నాయి. జర్మనీ, ఫ్రాన్స్ తర్వాత ఉక్రెయిన్‌కు ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాల్లో భారత్‌ది మూడో స్థానం. రాన్‌బాక్సీ, సన్ గ్రూప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఎగుమతి చేస్తాయి. ఉక్రెయిన్‌లో ఇండియన్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కూడా ఉంది.

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదిరితే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల నుండి 120 డాలర్ల వరకు చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. న్యాచురల్ గ్యాస్ సరఫరాపై కూడా చెడు ప్రభావం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ అంతరాయం కారణంగా దేశాలు విద్యుత్ ఉత్పత్తిని భారీగా తగ్గించవలసి ఉంటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు ధరలు ఆకాశాన్నంటాయని, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం భారత్‌లోనూ కనిపించనుంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం వల్ల చమురు ధరలు మరింత పెరగవచ్చని వారు భావిస్తున్నారు.