Plane crash: ఫ్లైట్ లో ప్రయాణించే వారికి పారాచూట్లు ఇవ్వొచ్చు కదా.. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాని ఎందుకు ఇవ్వరు? అని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి చాలా కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, విమానాల్లో ప్రయాణికులకు పారాచూట్లు ఎందుకు ఇవ్వరని చాలామంది ఆలోచిస్తారు. యుద్ధ విమానాల్లో, సైనిక విమానాల్లో పారాచూట్లు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో వాటిని ఉపయోగించి ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ.. ప్రయాణికుల విమానాల్లో పారాచూట్లు ఎందుకు ఉండవో ఇప్పుడు తెలుసుకుందాం.

శిక్షణ లేకుండా పారాచూట్ వాడకూడదు
పారాచూట్లు వాడాలంటే సరైన శిక్షణ అవసరం. శిక్షణ లేకుండా వాడితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాసింజర్ విమానాల్లో ఎవరికీ శిక్షణ ఉండదు కాబట్టి వారికి పారాచూట్లు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా ప్రమాదం జరిగినప్పుడు వాటిని సరిగ్గా వాడలేకపోతే ప్రాణాలు దక్కడం చాలా కష్టం.
విమానాలు చాలా ఎత్తులో ప్రయాణిస్తాయి
స్కైడైవింగ్ విమానాలు, ప్రయాణికుల విమానాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. స్కైడైవింగ్ విమానాలు తయారీ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆకాశంలోని దూకడానికి వీలుగా దాన్ని తయారు చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే.. అవి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. తక్కువ వేగంతో ఎగురుతాయి.

కాని ప్రయాణికుల విమానాల విషయానికొస్తే చాలా ఎత్తులో, చాలా వేగంతో ఎగురుతాయి. అందుకే వాటి నుండి దూకితే ప్రమాదం. స్కైడైవింగ్ తక్కువ ఎత్తులోనే చేస్తారు. ప్రయాణికుల విమానాలు చాలా ఎత్తులో ప్రయాణిస్తాయి. అక్కడ గాలి కూడా సరిగ్గా ఉండదు. అందుకే పాసింజర్ విమానాల్లో పారాచూట్లు వాడటం కష్టం.
పారాచూట్ తో దూకితే రెక్కలను ఢీకొడతాం..
పాసింజర్ విమానాలు స్కైడైవింగ్ కోసం తయారు చేసినవి కావు. అవి చాలా పెద్దవిగా ఉంటాయి. వాటి తయారీ కూడా వేరేలా ఉంటుంది. వాటి నుండి దూకితే ముందుగా విమాన రెక్కలకి ఢీకొట్టే ప్రమాదం ఉంది. ఆ సమయంలో పారాచూట్ ఉన్నా ప్రాణం కాపాడలేదు.
పారాచూట్లు ఖరీదైనవి..
అందరికీ పారాచూట్లు ఇస్తే ఖర్చు ఎక్కువ. పారాచూట్లు బరువుగా ఉంటాయి. అవి విమానం బరువుని పెంచుతాయి. అంతేకాకుండా అవి పెద్దవి కూడా. వాటిని విమానంలో పెట్టడం కష్టం. అందువల్ల ప్రయాణికుల విమానాల్లో పారాచూట్లు ఇవ్వడం వీలుకాదు. వీటి ధర కూడా ఎక్కువ కాబట్టి విమాన సంస్థలు ఈ సౌకర్యాన్ని కల్పించవు.

టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ప్రమాదాలు
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన విమాన ప్రమాదాల్లో ఎక్కువ ప్రమాదాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లోనే జరిగాయి. ఆ సమయంలో పారాచూట్లు ఉన్నా ఉపయోగించడానికి పనికిరావు. అందువల్ల ఖరీదైన పారాచూట్లు విమానంలో ఉంటే బరువు ఎక్కువ అవడం తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు.
