Asianet News TeluguAsianet News Telugu

నిర్మల ‘సంచలనం’: ఎకానమీపై ఫైనాన్స్ మినిస్టర్ నర్మగర్భ వ్యాఖ్యలు

దేశ ఆర్థిక వ్యవస్థకు చుక్కాని వంటి విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం దేశం ఏ పరిస్థితిల్లో ఉందో తేల్చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంతృప్తికరంగానూ లేదు.. ఆందోళనకరంగానూ లేదని ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

Why is the Modi government ignoring all the alarm bells from the economy?
Author
New Delhi, First Published Aug 4, 2019, 10:57 AM IST

'భారత ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూసి నేను ఆందోళన చెందుతున్నానని చెప్పలేను. అలా అని ఆత్మ సంతృప్తిని కూడా వ్యక్తం చేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎదురు గాలులు వీస్తున్నా మునిగిపోకుండా నీటికి ఉపరితలంపైనే భారత తన తలను ఉంచగలుగుతోంది' అని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

స్వయంగా దేశ ఆర్థిక మంత్రే ఆర్థిక వ్యవస్థ పని తీరును గురించి తాను ఎటూ చెప్పలేనని వ్యాఖ్యానించడం ఆర్థిక వ్యవస్థపై కొత్త ఆందోళనలను రేకత్తిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై సర్కార్ ఎంత అనిశ్చితిలో ఉందో మరోమారు నిర్మలా సీతారామన్ వ్యాఖ్యతో నిరూపితమైంది.

దేశంలోని ఎనిమిది కోట్ల పరిశ్రమల వృద్ధి 50 నెలల కనిష్టానికి పడిపోవడం, ఆటోమొబైల్‌లోని ప్రధాన సంస్థల అమ్మకాలు తాజాగా రెండంకెల శాతం మేర పడిపోవడం, కంపెనీలు మూత పడుతూ ఉద్యోగాలు కొండెక్కుతున్న తరుణంలోనూ కేంద్ర సర్కార్ వాస్తవాన్ని ఒప్పుకొనే సాహసం చేయడం లేదని ఆర్థిక మంత్రి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.

ఎన్నికల వరకు మభ్యపెడుతూ వచ్చిన మోడీ సర్కార్.. మరోమారు అధికారంలోకి వచ్చాక కూడా తన తీరును మార్చుకోలేకపోతోంది. ఆర్థిక వ్యవస్థలో లోటుపాట్లు వాస్తవాలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను కనుగొనే విషయం పక్కనబెట్టి ఇంకా ప్రజలను తప్పుదోవ పట్టించడంపైనే దృష్టి పెడుతుండడం శోచనీయం.

విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఎంత నర్మగర్భంగా  మాట్లాడినా.. దేశ ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదనే విషయం మాత్రం ఆమె మాటల్లోనే అర్థం అవుతోంది. ఆర్థిక పరిస్థితి మందగించిందని 'నీతి ఆయోగ్‌' సీఈవో అమితాబ్‌ కాంత్‌ శుక్రవారం తన ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

'ఒక పక్క డిమాండ్‌ లేదు, మరోపక్క ప్రయివేటు పెట్టుబడులు లేవు. ఇక అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి ఊడి పడుతుందా?' అని బజాజ్‌ ఆటో కంపెనీ చైర్మెన్‌ రాహుల్‌ బజాజ్‌ వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి.

దేశీయంగా వివిధ రంగాల్లో అమ్మకాలు దిగజారాయి. దేశంలోని ఎనిమిది కోట్ల పరిశ్రమల వృద్ధి 50 నెలల కనిష్టానికి పడిపోయింది. స్టాక్‌ మార్కెట్లు అంతకంతకు కుంగిపోతూ మదుపరులను కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లి పోతోందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో పాటు.. ఆ తర్వాత వర్షాలు విస్తరించకపోవడం దేశీయంగా గిరాకీపై ప్రభావాన్ని చూపింది. నిన్నమొన్నటి వరకూ స్టీలు, సిమెంటుకు అనూహ్య గిరాకీ ఉంది. కానీ ఇప్పుడు అది ఒకేసారి పతనం అయింది. స్టీలు, సిమెంట్ కంపెనీలదీ అదే పరిస్థితి.

మూలధన సామగ్రి, టెక్స్‌టైల్స్‌, రియల్‌ ఎస్టేట్‌- నిర్మాణ రంగాల్లో కార్యకలాపాలు మందగిస్తున్నాయి. అనుకున్నట్టుగా అమ్మకాలు సాగటం లేదని సంబంధిత రంగాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. 

వాహన విక్రయాలు భారీగా తగ్గాయి. గత మూడేండ్లలోనే అత్యంత కనిష్ట స్థాయికి వాహన విక్రయాల సూచీ దిగజారింది. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో అమ్మకాలు క్షీణించాయి. వాహన విక్రయాలు రెండేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయంటే... ఈ రంగం ఎంతగా కుంగిపోయిందీ స్పష్టమవుతుంది. 

విక్రయాలు తగ్గడంతో హీరో మోటోకార్ప్‌, మారుతీ, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటోలు ఉత్పత్తుల్లో కోత విధించాయి.ఉన్న నిల్వలు పూర్తయ్యాక ఆ తర్వాత ఉత్పత్తిపై ఆలోచన చేయాలని భావిస్తున్నాయి. ఈ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. అయినా సర్కారు నష్ట నివారణ దిశగా నిర్మాణాత్మక చర్యలను ప్రారంభించకపోవడం శోచనీయం. 

సరకుల అమ్మకాల్లో ఎప్పుడూ ముందుండే (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలైన హిందుస్థాన్‌ యూనిలివర్‌, ఐటీసీ, గోద్రెజ్‌ లాంటి కంపెనీలు జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. ఆయా కంపెనీ ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలానికి కేవలం సింగిల్ డిజిట్ వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి.

ఈ తిరోగమన పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యే అవకాశాలు లేవని '16 కీలక ఆర్థిక సూచికలు' సూచిస్తున్నాయి. పొదుపు ఖాతాల సొమ్ము గత ఐదేండ్ల కాలంలో భారీగా పడిపోవడం కూడా ఆర్థిక ప్రమాద ఘంటికే. ఈ సొమ్ము 2013-14లో జీడీపీలో 22 శాతం ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీలో 17 శాతానికి పడిపోయింది.

ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళతామన్న ప్రధాని నరేంద్ర మోడీ కొత్త లక్ష్యం నెరవేరడం ఏమోగానీ ప్రపంచంలోనే ఐదవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవిస్తుందన్న ఆశ నెరవేరడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. 

వ్యవస్థలో మందగమన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాల కంటే తక్కువగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సైతం అంచనాలు అందుకోవటం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఇంతకు ముందు అనుకున్నట్లు 7.1 శాతం ఉండదని, 6.9 శాతం వృద్ధితోనే సరిపెట్టుకోవాల్సి రావొచ్చని తాజాగా 'క్రిసిల్‌' స్పష్టం చేసింది. 

వృద్ధి రేటు 7 శాతం కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని మరోపక్క అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అభిప్రాయపడుతోంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అభిప్రాయం కూడా ఇదే. ఇంతకు ముందు అనుకున్నట్లుగా 7.2 శాతానికి బదులు భారత వృద్ధిరేటు 7 శాతానికి పరిమితం అవుతుందని ఈ సంస్థ స్పష్టం చేస్తోంది. 

దేశ ఆర్థిక వ్యవస్థను 2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయిలో నిలపాలంటే రాబోయే అయిదేండ్లలో 8 శాతంపైన వృద్ధి సాధించాలి. అది ఇప్పుడు అసాధ్యంగా కనిపిస్తోందనేది ఆర్థిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు. మోడీ సర్కారు ఇలాంటి మభ్యపెట్టే మాటలను పక్కనబెట్టి.. నిర్మాణాత్మక చర్యలకు దిగాలని వారు సూచిస్తున్నారు. 

దేశంలో నిరుద్యోగ సమస్య క్రమంగా పెరుగుతుండడం వల్ల ఉద్యోగాలు చేసే యువత సంఖ్య తగ్గుతూ వారిపై ఆధారపడి బతికే వారి సంఖ్య పెరుగుతూ వస్తోందది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ అంచనాలు భారీగా పడిపోతుండడం కూడా ఆందోళనకరమే.

ఈ ఏడాది పన్ను వసూళ్ల వృద్ధి 18.3 శాతం ఉంటాయని నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అంచనా వేయగా, తొలి ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.4 శాతం వృద్ధి మాత్రమే సాధ్యమైంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే మిగతా కాలంలో 22.3 శాతం వృద్ధి రేటును సాధించాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios