తాజా వివాదంలో ఇన్ఫోసిస్ సీఈఓ...
విజిల్ బ్లోవర్ల ఆరోపణలపై సరైన ఆధారాల్లేకున్నా పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నిలేకని ప్రకటించారు. ఇందుకోసం 21వ తేదీన స్వతంత్ర దర్యాప్తు కోసం శార్దుల్ అమర్ చంద్ మంగళ్ దాస్ అండ్ కో న్యాయ సంస్థను నియమిస్తామన్నారు.
న్యూఢిల్లీ: సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నిలంజన్ రాయ్‌లపై వచ్చిన అనైతిక చర్యలపై స్వతంత్ర విచారణ చేస్తున్నామని దేశీయ ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నిలేకని మంగళవారం తెలిపారు. అక్రమ విధానాలతో సంస్థ ఆదాయం, లాభాలను పెంచే ప్రయత్నం చేశారని కంపెనీ ప్రజా వేగులు ఇన్ఫీ బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఆలస్యంగా వెలుగులోకి విజిల్ బ్లోవర్ల లేఖ
దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిలేకని ప్రకటించారు. గత నెల 20న ఎథికల్ ఎంప్లాయిస్ పేరిట గుర్తు తెలియని ఉద్యోగుల బ్రుందం చేసిన ఆరోపణలపై ఆడిట్ కమిటి స్వతంత్ర్య దర్యాప్తు జరుపుతుందన్నారు. ఎథిక్స్ ఉద్యోగులు పేరిట ఈ లేఖను ఇన్ఫీ బోర్డుకు విజిల్‌బ్లోవర్లు పంపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
also read ఇన్ఫోసిస్ లేఖలో "అనైతిక పద్ధతులతో " చూస్తున్నారు......
స్వతంత్ర ఆడిటర్లతో సంస్థ ఆడిట్ కమిటీ సంప్రదింపులు
ఈ క్రమంలో ఈ నెల 10న సదరు లేఖను ఆడిట్ కమిటీ ముందు పెట్టామని, మరునాడు బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ సభ్యుల ఎదుటకు తీసుకెళ్లామని నిలేకని చెప్పారు. ఈనెల 11న జరిగిన బోర్డు సమావేశం తర్వాత దీనిపై ఇన్ఫోసిస్ స్వతంత్ర అంతర్గత ఆడిటర్లతో ఆడిట్ కమిటీ సంప్రదింపులను ప్రారంభించింది.
21న శార్దుల్ అమర్ చంద్ సంస్థను నియమించినట్లు వెల్లడి
ఈ నెల 21న స్వతంత్ర దర్యాప్తు కోసం శార్దుల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో న్యాయ సంస్థనూ నియమించిందని నిలేకని స్పష్టం చేశారు. కాగా, బోర్డు సభ్యుల్లో ఒకరికి గత నెల 20న, 30న రెండు ఫిర్యాదులు అందాయని చెప్పారు. అమెరికాకు చెందిన విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కు కూడా ఉద్యోగుల టీం ఈ నెల మూడో తేదీన రాసిన లేఖ తమ ద్రుష్టికి వచ్చిందని నిలేకని చెప్పారు.
ఆధారాల్లేకున్నా పూర్తిస్థాయి విచారణ
ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించకున్నా, పూర్తిస్థాయి విచారణ జరిగేలా చూస్తామని నిలేకని తెలిపారు. ఆరోపణలను ఎదుర్కొంటున్న పరేఖ్, రాయ్‌లను ఈ దర్యాప్తునకు దూరంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
సాక్షాలుగా ఈమెయిల్స్, వాయిస్ రికార్డులు
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ సంస్థ బోర్డుతోపాటు అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థకు ఎథికల్ ఎంప్లాయీస్ టీం పేరిట లేఖ రాసింది. ఇటీవలి కొన్ని త్రైమాసికాలతోపాటు ప్రస్తుత త్రైమాసికంలోనూ ఇదే తరహా చర్యలు చేపట్టారని గత నెల 20న రాసిన ఆ లేఖలో ఆరోపించారు. సాక్ష్యాలుగా పలు ఈ-మెయిళ్లు, వాయిస్ రికార్డులను పేర్కొన్నారు.
ఇన్ఫీపై అమెరికా న్యాయ సంస్థ దావా
ఇన్ఫోసిస్‌పై అమెరికా న్యాయ సంస్థ దావా వేసేందుకు సిద్ధమవుతున్నది. సీఈవో, సీఎఫ్‌వోల అనైతిక చర్యలపై ఇన్ఫోసిస్ బోర్డుతోపాటు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్‌కు విజిల్‌బ్లోవర్లు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా న్యాయ సంస్థలు ఇన్ఫీపై చర్యలపట్ల దృష్టి సారించాయి.
లోపాలపై దర్యాప్తు చేపట్టాలని ఇన్ఫోసిస్ కు అమెరికా సంస్థ సూచన
సెక్యూరిటీస్ సంబంధిత చర్యల్లో విశేష గుర్తింపున్న రోజెన్ న్యాయ సంస్థ.. వాటాదారుల తరఫున అన్నిరకాల లోపాలపై దర్యాప్తును కొనసాగించాలని ఇన్ఫోసిస్‌కు సూచిస్తున్నది. ఇన్ఫోసిస్ మదుపరుల నష్టాలను భర్తీ చేసేందుకు ఓ క్లాస్ యాక్షన్ లాసూట్‌ను రోజెన్ లా సంస్థ సిద్ధం చేస్తున్నది. అవకతవకల ఆరోపణలు వచ్చినప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ అవుతున్న షేర్ల కంపెనీలకు ఈ తరహా నోటీసులు సాధారణంగానే వస్తూంటాయి.
బోర్డు సభ్యులంటే సీఈఓకు చులకన
ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులనుద్దేశించి సీఈవో సలీల్ పరేఖ్ చాలా చులకనగా మాట్లాడేవారని, జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని విజిల్‌బ్లోవర్లు తమ లేఖలో పేర్కొన్నారు. భారీ ఒప్పందాల గురించి వారికి చెప్పినా అర్థం కాదని, వారికి షేర్ విలువ పెరిగితే చాలంటూ బోర్డులోని డీఎన్ ప్రహ్లాద్, డీ సుందరం, కిరణ్ మజుందార్ షాలను పరేఖ్ తేలిగ్గా తీసిపారేశారని చెప్పారు.
బోర్డు సభ్యులపై సీఈఓ తీరిది
‘ప్రహ్లాద్, సుందరంలు మద్రాసీలు. ఇక మజుందార్ షా దివా. వెర్రి ప్రశ్నలు వేస్తారు. వారిని మీరు పట్టించుకోనక్కర్లేదు. వదిలేయండి’ అని పరేఖ్ అన్నట్లు లేఖలో ఉద్యోగుల బృందం తెలిపింది. ఇందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, లక్షద్వీప్ వాసులకు ప్రతిభ ఉండదన్నట్లు వ్యవహరించేవారని చెప్పారు.
బోర్డు సభ్యులు ఇలాజజ
కాగా, ప్రహ్లాద్.. సూర్య సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక సీఈవోగా ఉండగా, సుందరం.. టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీగా ఉన్నారు. కిరణ్ మజుందార్ షా.. బయోకాన్ సీఎండీగా ఉన్న సంగతి విదితమే.
ఇన్ఫీకి నష్టం చేకూర్చిన ఆరోపణలు
ఇన్ఫోసిస్‌లో వచ్చిన అనైతిక చర్యల ఆరోపణలు ఆ సంస్థ షేర్ విలువను భారీగా నష్టపరిచాయి. మంగళవారం ఒక్కనాడే ఇన్ఫీ షేర్ విలువ దాదాపు 17 శాతం పడిపోయింది. తీవ్ర ఆందోళనకు గురైన మదుపరులు పెద్ద ఎత్తున అమ్మకాలకు తెర తీశారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ)లో 16.21 శాతం క్షీణించి రూ.643.30 వద్ద స్థిరపడింది.
రూ.53 వేల కోట్ల ఇన్ఫీ ఎం క్యాప్ హరీ
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఇన్ఫీ షేర్ 16.86 శాతం పతనమై రూ.638.30 వద్ద నిలిచింది. గత ఆరేళ్లకుపైగా ఇన్ఫోసిస్ షేర్ విలువ ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. 2013 ఏప్రిల్ నాటి కనిష్ఠాన్ని తాకింది. ఒకానొక దశలో రూ.640 స్థాయికి చేరడం గమనార్హం. మరోవైపు మదుపరుల సంపద రూ.53, 450.92 కోట్లు హరించుకుపోయింది. బీఎస్‌ఈలో ప్రస్తుతం ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.2,76,300.08 కోట్లుగా ఉన్నది. అమెరికాలోనూ సోమవారం మార్కెట్లో ఇన్ఫీ షేర్ 14 శాతం కుంగింది.
రెండేళ్ల తర్వాత ఇన్ఫీలో సంఘర్షణ వాతావరణం
విజిల్ బ్లోవర్ల ఆరోపణల నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత ఇన్ఫోసిస్ సంస్థలో మళ్లీ సంఘర్షణ వాతావరణం కనిపిస్తున్నది. నాటి సహ వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య వివాదం సిక్కా రాజీనామాకు దారి తీసింది. ఈసారి వివాదం ఏ పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
రెండేళ్ల క్రితం మాజీ ఉన్నతాధికారుల ప్యాకేజీపై వివాదం
రెండేళ్ల క్రితం మాజీ ఉన్నతాధికారుల ప్యాకేజీపై సహ వ్యవస్థాపకుల మధ్య వివాదం సీఈఓగా విశాల్ సిక్కా నిష్క్రమణకు దారి తీసింది. అప్పుడే సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి చైర్మన్ గా నందన్ నిలేకని వచ్చారు. గతేడాది జనవరిలో సీఈఓగా సలీల్ పరేఖ్ వచ్చారు. గతంలో యాజమాన్యానికి, సహ వ్యవస్థాపకులకు మధ్య వివాదం నెలకొంటే.. ఈ సారి ఇన్ఫోసిస్ ఉద్యోగులకు, యాజమాన్యానికి మధ్య ఘర్షణ ప్రారంభమైంది.
also read ఇన్ఫోసిస్ ...పతనం కావడం ఇది 16వ సారి..
నిలేకనికి కత్తిమీద సామే
రెండేళ్ల క్రితం వచ్చిన సంక్షోభ నివారణకు పగ్గాలు చేపట్టిన నందన్ నిలేకనికి తాజా వివాదం కత్తిమీద సామేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నాటి సంక్షోభంలో సిక్కా రాజీనామా చేయడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ దఫా ఎంత త్వరగా సంక్షోభం ముగిస్తారన్న దానిపైనే దాని భవితవ్యం ఆధార పడి ఉంది.
ఇన్ఫీ ప్రతిష్ఠ మసకబారుతుందా?
రెండేళ్ల నుంచి నెమ్మదిగా ఇన్పోసిస్ పుంజుకుంటున్నది. గత సంక్షోభంతో పోలిస్తే సంస్థ విలువ 50 శాతం పెిరగింది. ఇప్పుడిప్పుడే ఇన్ఫోసిస్ భారతదేశంలోకెల్లా పారదర్శక సంస్థగా మదుపర్లలో నమ్మకం కలుగుతోంది. కానీ సీఈఓ, సీఎఫ్ఓలపైనే ఆరోపణలు వచ్చాయి. అవి నిజమని తేలితే ఇన్ఫోసిస్ సంస్థ మసక బారుతుందన్న అభిప్రాయం ఉంది.