Asianet News TeluguAsianet News Telugu

డ్రాగన్ వర్సెస్ అమెరికా: స్వదేశానికొచ్చే సంస్థలకు పన్ను రిలీఫ్.. వైట్ హౌస్ సుముఖం

కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఇబ్బందుల నేపత్యంలో చైనా నుంచి స్వదేశానికి తరలివచ్చే అమెరికన్‌ కంపెనీలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు అందించేందుకు వైట్‌హౌజ్‌ అధికారులు సుముఖంగా ఉన్నారు. 

WH official favours giving tax incentives to companies to move to US from China
Author
New Delhi, First Published May 17, 2020, 2:57 PM IST


వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఇబ్బందుల నేపత్యంలో చైనా నుంచి స్వదేశానికి తరలివచ్చే అమెరికన్‌ కంపెనీలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు అందించేందుకు వైట్‌హౌజ్‌ అధికారులు సుముఖంగా ఉన్నారు. ఇంకా విధానం రూపుదిద్దుకోకున్నా, అలా చేస్తే అమెరికా ఆకర్షణీయంగా మారుతుందని భావిస్తున్నారు. 

కరోనా వైరస్‌ మహమ్మారి వ్యవహారం విషయమై చైనాపై అమెరికా గుర్రుగా ఉంది. ఇప్పటికే చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటోంది. తమ పరిశోధన, మేధోపరమైన అంశాలను డ్రాగన్‌దేశం దొంగచాటుగా కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. రెండు దేశాల మధ్య రెండేళ్ల పాటు వాణిజ్య యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే.

‘ఇంకా విధానం రూపుదిద్దుకోలేదు. మేం అమెరికాను ఆకర్షణీయంగా మార్చాలనుకుంటున్నాం’ అని వైట్‌హౌజ్‌ జాతీయ ఆర్థిక మండలి సంచాలకుడు లారీ కుడ్‌లో అన్నారు. 

‘శిక్షలు కాదు ప్రోత్సాహకాలపై నాకు విశ్వాసం. అమెరికాకు తరలించే కంపెనీల మూలధనం ఖర్చులపై 100% కార్పొరేట్‌ పన్నురేటు విధించకుండా 50 శాతానికి ఎందుకు తగ్గించకూడదు. రెండు మూడేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం కార్పొరేట్‌ రేట్‌ పన్నును 10.5 శాతానికి ఎందుకు పరిమితం చేయకూడదు’ అని వైట్‌హౌజ్‌ జాతీయ ఆర్థిక మండలి సంచాలకుడు లారీ కుడ్‌లో అన్నారు. ప్రస్తుతం అమెరికాలో కార్పొరేట్‌ పన్ను 21%గా ఉంది.

also read:కరోనా కష్టాలు: మెట్రోపాలిటన్స్‌లో రెంటల్ కార్స్‌తో తడిసిమోపెడు

‘పన్నులు రద్దు చేయడమే కాకుండా ఇంకా సహాయం చేస్తే బాగుంటుంది. కంపెనీలు తరలివచ్చేందుకు ఇవి ఉపకరిస్తాయి. శిక్షించడం కాదు ప్రోత్సహించాలి. దీనికి సంబంధించిన విధానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంతర్గతంగా పరిశీలన జరుగుతోంది’ అని లారీకుడ్‌లో తెలిపారు.

అమెరికాలోని ఓ సెనెటర్‌ గురువారం 18 అంశాల ప్రణాళికలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్‌తో అమెరికా సైనిక సంబంధాలు మెరుగు పర్చుకోవాలని, కరోనా వైరస్‌పై అవాస్తవాలు, కప్పిపుచ్చుకోవడం వంటి అంశాల్లో చైనాను జవాబుదారీ చేయాలని ఆ ప్రణాళికల్లో పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios