Asianet News TeluguAsianet News Telugu

కరోనా కష్టాలు: మెట్రోపాలిటన్స్‌లో రెంటల్ కార్స్‌తో తడిసిమోపెడు

లాక్‌డౌన్‌తో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. దీంతో సొంత వాహనాలు లేనివారు ఎక్కడికైనా వెళ్లాలంటే అద్దె కార్లే వాడాల్సి వస్తోంది. 

Rental Cars hits in Lockdown at metropolitan cities.
Author
New Delhi, First Published May 17, 2020, 2:34 PM IST

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. దీంతో సొంత వాహనాలు లేనివారు ఎక్కడికైనా వెళ్లాలంటే అద్దె కార్లే వాడాల్సి వస్తోంది. శ్రామిక్‌ రైళ్లు నడుస్తున్నా.. అవి కేవలం వలస కార్మికుల కోసం మాత్రమే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బంధువుల వద్దకు వెళ్లి చిక్కుకుపోయిన వారు, విద్యార్థులు, పర్యాటకులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అద్దె కార్లే దిక్కవుతున్నాయి.

సడలింపులతో ఇతర రాష్ట్రాలకు కార్లలో వెళ్లేందుకు పోలీసులు అనుమతిని ఇస్తుండడంతో అద్దె కార్లు రోడ్లపైకి వస్తున్నాయి. కానీ, చార్జీలు గతానికంటే రెట్టింపుగా ఉంటున్నాయి. కారు, అందులోని సీట్ల సంఖ్యను బట్టి ట్రావెల్స్‌ నిర్వాహకులు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ సమస్య మెట్రోపాలిటన్ నగరాల పరిధిలోనే ఎక్కువగా ఉంది.

ఉదాహరణకు మారుతి స్విప్ట్‌ డిజైర్‌లో కిలోమీటర్‌పై రూ.10-12 వసూలు చేస్తుండగా, ఇన్నోవా కారు అయితే రూ.16-18 వసూలు చేస్తున్నారు. ఒకవైపు ప్రయాణం చేసినా.. రౌండ్‌ ట్రిప్ చార్జీ చెల్లించాలని చెబుతున్నారు. 

డ్రైవర్లు అందుబాటులో లేరని, తమకు ఇబ్బందులు ఉన్నాయని, కారు కావాలంటే అడిగినంత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ చార్జీ అయినా చెల్లించి ప్రయాణం చేస్తున్నారు.

మరోవైపు కార్ల యజమానులు సైతం.. పోలీసుల నుంచి అనుమతులు, మార్గమధ్యంలో తనిఖీలు, కరోనా జాగ్రత్తలు వంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలలుగా అద్దె కార్లు నడవడం లేదు. దీంతో త్రైమాసిక పన్ను, నెల వారీ రుణ వాయిదా చెల్లింపులు, నిర్వహణ ఖర్చులు పెరిగి భారంగా మారిందని వాపోతున్నారు.

ఉదాహరణకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో లక్షకు పైనే అద్దెకార్లు ఉన్నాయి. యాప్‌ ఆధారిత కంపెనీలతో నడిచే క్యాబ్‌లతోపాటు ట్రావెల్స్‌ నిర్వాహకులు నడిపే కార్లు వేలల్లోనే ఉన్నాయి. లాక్‌డౌన్‌తో 40 రోజులుగా ఇవన్నీ గ్యారేజీలకే పరిమితమయ్యాయి.

సడలింపులతో కారు నడిపేందుకు అవకాశం వచ్చినా.. పోలీసుల అనుమతి దగ్గర నుంచి పలు రకాల ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ నగరానికి, చెన్నై నుంచి తిరుపతికి, హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లి వస్తే డ్రైవర్లకు క్వారంటైన్‌ ముద్ర వేస్తున్నారు. 

దీంతో కారు డ్రైవర్ 14 రోజులు ఇంటికే పరిమితమవుతూ.. ఒక్క ట్రిప్పుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. డ్రైవర్లు అందుబాటులో లేకుండా పోతున్నారు. ముఖ్యంగా సుదూర ప్రయాణం చేయాల్సి వస్తే డ్రైవర్లు, కార్ల యజమానుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కాదు.

వందలాది కిలోమీటర్లు కార్లను నడుపుతుండటం, ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లి తిరిగి వచ్చేవారు పాసు టైం అయిపోతుందన్న తొందరలో వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రావెల్స్‌ నిర్వాహకులు కార్ల నిర్వహణ భారంగా మారి.. సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు.

లాక్ డౌన్ ముందు వరకు కారు ప్రయాణం అంటే ఓలా, ఉబెర్‌లే. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా అత్యవసరానికి, అది కూడా వైద్యసేవల కోసమైతేనే ఓలా, ఉబర్‌ వంటి సంస్థలు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ తీసుకుంటున్నాయి. దీని కోసం అవసరమైన ఆధారాలు సమర్పించాలని స్పష్టం చేస్తున్నాయి. బుకింగ్‌ సమయంలో కార్లను శానిటైజ్‌ చేస్తున్నామని, శిక్షణ పొందిన డ్రైవర్లు ఉన్నారనే సమాచారాన్ని ఇస్తున్నారు. 

కారు నడపాలంటే పోలీసు శాఖ నుంచి పాసులు ఉండాలి. అవుట్‌ స్టేషన్‌ వెళ్లి వస్తే క్వారంటైన్‌ ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే 50 రోజులుగా ఖాళీగా ఉన్నాం. కరోనా ఎప్పటివరకు ఉంటుందో తెలియడంలేదు.  భవిష్యత్ ఊహించుకుంటేనే భయంగా ఉంటోందని కార్ల డ్రైవర్లు అభిప్రాయ పడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios