న్యూఢిల్లీ: రిలయన్స్ జియో దాటికి భారత టెలికం సంస్థలు విలవిలలాడుతున్నాయి. అందులో వొడాఫోన్ తన కస్టమర్లను కాపాడుకునే పనిలో పడింది. వొడాఫోన్ తన ఖాతాదారులకు నూతన ప్రీ పెయిడ్ రీచార్జీ ప్యాక్ ఆఫర్ ప్రకటించింది. రోజుకు 4జీ /3జీ మొబైల్ ఫోన్లపై ఒక జీబీతోపాటు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా పంపొచ్చు. ఈ క్రమంలో నెలవారీగా రూ.159లకు వొడాఫోన్ నూతన ప్రీ ఫెయిడ్ రీచార్జి ప్యాక్ అందుబాటులోకి తెచ్చింది. 

దీంతో వొడాఫోన్ వినియోగదారులు అపరిమితమైన కాల్స్, డేటా బెనిఫిట్లు పొందొచ్చు. ఇక ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో కూడా రూ.149లకే ప్రీ పెయిడ్ ప్యాక్ ఆఫర్ ముందుకు తీసుకువచ్చి మొబైల్ ఫోన్ వినియోగదారులను తన అక్కున చేర్చుకునేందుకు తహతహలాడుతూ ముందుకు సాగుతుంది. రిలయన్స్ రంగ ప్రవేశానికి ముందు భారతీయ టెలికం రంగంలో రారాజుగా నిలబడిన భారతీ ఎయిర్ టెల్ ఇదే తరహా ఆఫర్ అందుబాటులో ఉంచింది. 

2016 సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో భారత టెలికం రంగంలో అత్యున్నత స్థాయిలో పోటీ సాగుతున్నది. ఈ క్రమంలో టెలికం సంస్థలన్నీ సంఘటితం దిశగా అడుగులేస్తున్నాయి. ఐడియా సెల్యూలార్, వొడాఫోన్ ఇండియా సంస్థల విలీనానికి భారత టెలికం శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ముందుకు వచ్చిన వొడాఫోన్ ప్రీ పెయిడ్ రూ.159 ఆఫర్ ప్రకారం లభించే ప్రయోజనాలిలా..

ఈ ప్లాన్ ప్రకారం వొడాఫోన్ స్థానిక, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. రోజూ 4జీ, 3జీ మొబైల్ ఫోన్లలో ఒక జీబీ డేటాతోపాటు రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా పంపొచ్చు. ఈ ఆఫర్ 28 రోజులు అమలులో ఉంటుంది. అయితే వొడాఫోన్ అపరిమిత కాల్ ఆఫర్‍పై పరిమితులు ఉన్నాయి. రోజుకు 250 నిమిషాలు, వారానికి వెయ్యి నిమిషాల సేపు మాట్లాడుకోవచ్చు. 

రిలయన్స్ జియో ప్రీ పెయిడ్ ఆఫర్ ప్రకారం రూ.149లకు ప్రతి రోజూ 1.5 జీబీ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 28 రోజుల వరకు అపరిమిత కాల్స్ చేయొచ్చు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పంపడంతోపాటు జియో యాప్స్ సబ్ స్ర్కిప్షన్ పొందిన వారికి అదనపు వసతులు కల్పిస్తోంది. 

ప్రైవేట్ టెలికం సంస్థలతోపాటు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కూడా ఆఫర్లు ప్రకటించడంలో ముందు నిలిచింది. రక్షాబంధన్ సందర్భంగా నూతన ప్రీ పెయిడ్ రీచార్జీ ఆఫర్ ఇచ్చింది. దీని ప్రకారం రోజుకు 100 ఎస్సెమ్మెస్ లతోపాటు పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ ఉచితం.