రిలయన్స్ జియో విసిరిన సవాల్ ను ఎదుర్కొనేందుకు వొడాఫోన్ - ఐడియా సెల్యూలార్ సిద్ధమైంది. వొడాఫోన్, ఐడియా విలీనానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా, అంతర్జాతీయంగా రెండో సంస్థగా వొడాఫోన్ ఐడియా నిలువనున్నది.
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజాలు వొడాఫోన్, ఐడియా విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు టెలీ కమ్యూనికేషన్ల శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఫలితంగా 43.6 కోట్ల మొబైల్ కనెక్షన్లతో, 35% శాతానికి పైగా మార్కెట్‌వాటాతో అతిపెద్ద టెలికాం సంస్థ ‘వొడాఫోన్ ఇండియా లిమిటెడ్’ ఆవిర్భవించనుంది. ఇప్పటివరకు 34.40 కోట్ల కనెక్షన్లతో అతిపెద్ద సంస్థగా ఉన్న భారతీ ఎయిర్‌టెల్ రెండోస్థానానికి పరిమితం కానున్నది. టెలికాం శాఖ తుది అనుమతులు ఇచ్చినందున, ఐడియా, వొడాఫోన్ ఇండియా కార్యకలాపాలు విలీనం సాకారం కానుంది.
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అనుమతి లభించడమే తరువాయి
విలీన సంస్థ ‘వొడాఫోన్ ఇండియా లిమిటెడ్’ విలువ 23 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.50 లక్షల కోట్లు)కు పైగా ఉండనున్నది. ‘ఈ రెండు టెలికాం సంస్థల విలీనానికి తుది అనుమతులు లభించాయి. తదుపరి పూర్తి చేయాల్సిన లాంఛనాల కోసం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ)ను అవి సంప్రదిస్తాయి. అవి లభించగానే విలీనం పూర్తవుతుంది’ అని టెలికాం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
న్యాయస్థానాల తీర్పులకు కట్టుబడి ఉండాలిలా
టెలికాం ట్రైబ్యునల్‌తోపాటు వివిధ కోర్టుల తీర్పులకు విలీన సంస్థ కట్టుబడి ఉండాలన్న షరతుపై ప్రభుత్వం తుది అనుమతులను జారీ చేసింది. ఈ కంపెనీలు టెలికం శాఖకు ఏకకాల స్పెక్ట్రం ఛార్జిల కింద రూ.3,900 కోట్ల నగదు, రూ.3,300 కోట్లకు బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించాయని టెలికం శాఖ పేర్కొంది. కొత్త సంస్థలను ‘వొడాఫోన్ ఐడియా లిమిటెడ్’గా పిలుస్తారు. ప్రభుత్వ ఆమోదం లభించడంతో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకొంది.
వొడాఫోన్ స్పెక్ట్రం ఐడియాకు బదిలీ కోసం..
వొడాఫోన్ నుంచి ఐడియాకు 4.4 మెగాహెర్జ్‌ల స్పెక్ట్రంను బదిలీ చేయడానికి రూ.3,900 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. ఇక ఐడియా సెల్యూలర్ సంబంధించిన 4.4 మెగాహెర్జ్‌స్ వాయుతరంగాలకు కోసం రూ.3,300 కోట్లు బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చారు. ఇందులో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26 శాతం వాటా, ఐడియా వాటాదార్లకు 28.9 శాతం వాటాలు ఉంటాయి.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థగా ఇలా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికం సంస్థగా వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ నిలవనున్నది. ఇక మనదేశంలో ఇదే అతిపెద్ద సంస్థ. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న భారతీ టెలికంను వొడాఫోన్ ఐడియా దాటి ఈ స్థానానికి చేరింది. ఇప్పటికే వొడాఫోన్ ఐడియాకు అవసరమైన కీలక నిర్వాహక బృందాన్ని కూడా ఎంపికైంది. ఈ సంస్థకు కుమారమంగళ బిర్లా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, వొడాఫోన్ ప్రస్తుత సీఈవో బాలేష్ శర్మ సీఈవోగా వ్యవహరించనున్నారు. తద్వారా రిలయన్స్ జియోతో పోటీపడేందుకు ఈ సంస్థ సిద్ధమవుతోంది.
ఎయిర్‌టెల్‌పై ‘జియో’ ఎఫెక్ట్!: లాభాలు రూ.97 వేల కోట్లకు పరిమితం
భారతీ ఎయిర్‌టెల్ ఫలితాలు వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ నిరుత్సాహపరచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 73.51 శాతం క్షీణించి రూ.97.30 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో లాభం రూ.367.30 కోట్లుగా ఉండడం గమనార్హం. విశ్లేషకులు కంపెనీ రూ.479 కోట్ల నికర నష్టం నమోదు చేయవచ్చని అంచనా వేశారు. ఈ అంచనాతో పోలిస్తే ఫలితాలు కొంత మెరుగైనట్లే. ఏకీకృత ఆదాయం సైతం రూ.20,080 కోట్లకు తగ్గింది. గతేడాది ఆదాయం రూ.21,958.10 కోట్లుగా నమోదైంది.
స్టాండ్ లోన్ పద్దతిలో నికర నష్టం రూ.362 కోట్లు
గతేడాది ఏప్రిల్-జూన్‌లో స్టాండలోన్ పద్ధతిలోరూ.280.60 కోట్ల లాభాన్ని నమోదు చేసిన ఎయిర్‌టెల్ ఈ సారి మాత్రం రూ.1457.20 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. దీంతో రూ.362 కోట్ల అసాధారణ నష్టం నమోదనట్లు తెలుస్తోంది. కాగా, ఏకీకృత మార్జిన్లు అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 35.8 శాతం నుంచి 33.5 శాతానికి తగ్గాయి. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఏప్రిల్-జూన్ 2018లో కంపెనీ మొబైల్ డేటా ట్రాఫిక్ 2,236 బిలియన్ ఎమ్‌బీలుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే మూడు నెలల సమయంతో పోలిస్తే ఇది 328 శాతం ఎక్కువ కావడం విశేషం.
తగ్గుతున్న వినియోగదారులు
జూన్ నెలాఖరు నాటికి వినియోగదార్ల సంఖ్య 45.7 కోట్లకు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఇది 21.2 శాతం తక్కువ. ఇక సగటున ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) 8.8 శాతం తగ్గి రూ.105కు పరిమితమైంది. బీఎస్‌ఈలో గురువారం భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 1.63% లాభంతో రూ.357.60 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలోనూ 1.52% పెరిగి రూ.357.65 వద్ద స్థిరపడ్డాయి. రెండు ఎక్స్ఛేంజీల్లోనూ కలిపి 35 లక్షలకు పైగా షేర్లు చేతులు మారాయి.
