భారత్‌ వచ్చేందుకు మాల్యా రెడీ?: ‘ఆభరణాల’ రుణాలకు బ్యాంకర్లు నో

Vijay Mallya Willing To Come Back To India: Reports
Highlights

బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యను తమకు అప్పగించాలని కోరుతూ భారత దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ ఈ నెలలో లండన్ కోర్టులో విచారణకు రానున్నది. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రతినిధి బ్రుందాలు కూడా విచారణకు హాజరు కానున్నాయి.

న్యూఢిల్లీ: రుణాల ఎగవేత ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా, స్వదేశంలో కోర్టుల విచారణను ఎదుర్కొనేందుకు భారత్‌కు తిరిగి రావాలని భావిస్తున్నారు. తన సంసిద్ధతకు సంబంధించి విచారణాధికారులకు సంకేతాలు పంపినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. పలాయనం వాదంతో పరారీలో ఉన్న ఎగవేతదారులకు దేశంలో, విదేశాల్లో ఉండే ఆస్తులను చట్టపరంగా జప్తు చేసుకునేందుకు వీలుగా కేంద్రం ఇటీవలే ఆర్డినెన్స్‌ను జారీ చేసిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ప్రకారం విజయ్ మాల్యపై పరారీలో ఉన్న ఆర్ధిక నేరగాడని ముద్ర పడనున్నది.

ఇలా ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న విజయ్ మాల్య


మూత బడిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు సుమారు రూ. 9,000 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో మాల్యా సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ల విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఆయన తల దాచుకున్నారు. ఈ ఆర్డినెన్స్‌కు అనుగుణంగా భారతదేశంతోపాటు విదేశాల్లో ఉన్న మాల్య ఆస్తులను జప్తు చేసుకునేందుకు అనుమతించాలని దర్యాప్తు సంస్థలు పిటిషన్లు దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కోర్టులో ఈ మేరకు విజయ్ మాల్యకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 27వ తేదీన ఈ కేసు విచారణకు రానున్నది. 

విజయ్ మాల్య ఆస్తుల జప్తునకు అప్పీల్ చేసిన దర్యాప్తు సంస్థలు


తక్షణం విజయ్ మాల్యకు చెందిన రూ.12,500 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు అధికారం కల్పించాలని కోరింది. విజయ్ మాల్య ఆధ్వర్యంలో ప్రారంభించిన కింగ్ ఫిషర్స్ ఎయిర్ లైన్స్ కోసం వివిధ బ్యాంకుల నుంచి తొలి యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణాల మొత్తం వడ్డీతో కలిసి రూ.9,990.07 కోట్లకు చేరుకున్నది. రుణాల ఎగవేతదారుల్లో మొదటి వరుసలో నిలిచిన విజయ్ మాల్యపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. విజయ్ మాల్య కూడా తన ఈతిబాధలు తెలియజేస్తూ 2016 ఏప్రిల్ 15వ తేదీన లేఖలు రాశారు. 

నీరవ్ దెబ్బతో జ్యూయలరీ రంగానికి ‘రుణాలు’ బంద్! 


నీరవ్‌ మోదీ స్కామ్‌.. వజ్రాభరణాల రంగంపై గణనీయంగానే ప్రభావం చూపుతోంది. దీని దెబ్బతో ఈ రంగం రుణాలపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది. బ్యాంకుల నుంచి లభించే రుణాలు దాదాపు పది శాతం మేర తగ్గిపోయాయి. దీంతో ఎగుమతులపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆభరణాల సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. వజ్రాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) నివేదించింది. 

జ్యుయెలరీ రంగానికి బ్యాంకింగ్ రుణాలే ఆధారం


‘ఈ పరిశ్రమకు బ్యాంకు రుణాలే ప్రధాన ఆధారం. ఇవి తగ్గిపోతే వజ్రాభరణాల ఎగుమతులు కూడా తగ్గే అవకాశం ఉంది‘ అని జీజేఈపీసీ వైస్‌ చైర్మన్‌ కొలిన్‌ షా తెలిపారు. నికార్సయిన సంస్థలు కూడా ఎంతో కష్టపడితే గానీ రుణాలు రావడం లేదని .. ఒకవేళ వచ్చినా ఇన్‌వాయిస్‌లన్నీ తమ దగ్గరే డిస్కౌంటింగ్‌ చేయాలంటూ బ్యాంకులు షరతులు పెడుతుండటంతో క్లయింట్లతో సంబంధాలు దెబ్బతింటున్నాయన్నారు. బ్యాంకులు ఇప్పటిదాకా అందిస్తూ వచ్చిన పలు ప్రయోజనాలనూ ఉపసంహరించడంతో వడ్డీ వ్యయాలు కూడా పెరిగి పోయాయని అన్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ దాదాపు రూ.13,500 కోట్ల మేర మోసగించిన సంగతి తెలిసిందే. దీని మీద వారిపై ప్రస్తుతం ఈడీ తదితర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి.  

స్వయం నియంత్రణపై దృష్టి సారించాలన్న జీజేఈపీసీ


పరిశ్రమలో వివిధ సంస్కరణల ద్వారా స్వయం నియంత్రణను అమలు చేసేందుకు, వ్యాపార సంబంధ వర్గాల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు జీజేఈపీసీ చైర్మన్‌ ప్రమోద్‌ అగర్వాల్‌ తెలిపారు. బ్యాంకులు రుణాలను తగ్గించేయడం, మరింతగా హామీలు అడుగుతుండటం, డాక్యుమెంటేషన్‌ను పెంచేయడం వంటి అంశాలు ట్రేడర్లకు సమస్యాత్మకంగా ఉంటున్నాయని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో 41 బిలియన్‌ డాలర్ల వజ్రాభరణాల రంగం గణనీయంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయని అగర్వాల్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని కొంత తోడ్పాటు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జీజేఈపీసీ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో 11.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వజ్రాభరణాల ఎగుమతులు ఈసారి జూన్‌ త్రైమాసికంలో 8.8 శాతం క్షీణించి 10.1 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.

loader