జూన్ 11 నాటికి ఇండియాకు విజయ్ మాల్య..? కానీ..
దేశీయ బ్యాంకుల వద్ద తీసుకున్న భారీ రుణాలు ఎగవేసి.. బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యను అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. భారతదేశానికి అప్పగించేందుకు అనుమతినిస్తూ బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆదేశాలు జారీ చేసినా.. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో విజయ్ మాల్యను మన దేశానికి తీసుకు రావడం ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది.
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల బాకీలను ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు గురువారం బ్రిటన్‌లో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు అప్పగింత కేసులో తనకు ఉన్న చివరి అవకాశాన్నీ గురువారం మాల్యా కోల్పోయారు. బ్రిటన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి అనుమతి లభించలేదు.
దీంతో లండన్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం త్వరలో భారత్‌కు మాల్యాను తీసుకువచ్చేందుకు లైన్ క్లియరైంది. బ్రిటన్ హోం మంత్రి ప్రీతీ పటేల్ ఈ తీర్పును అధికారికంగా ధ్రువీకరిస్తే.. భారత్‌కు మాల్యా అప్పగింత ప్రక్రియ మొదలు కానున్నది. బ్రిటన్ చట్టాల ప్రకారం 28 రోజుల్లోగా అంటే జూన్ 11వ తేదీ నాటికి మాల్యాను భారత్‌కు అప్పగించాల్సి ఉంటుంది.
విజయ్ మాల్యా ప్రమోటర్‌గా వ్యవహరించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా బకాయిపడిన విషయం తెలిసిందే. వీటిని చెల్లించకుండా మాల్యా 2016, మార్చి రెండో తేదీన లండన్‌కు పారిపోయారు. భారతీయ దర్యాప్తు సంస్థల అభ్యర్థనలతో 2017, ఏప్రిల్ 20వ తేదీన బ్రిటన్ అధికారులు అరెస్టు చేశారు.
అప్పట్నుంచి సీబీఐ, ఈడీ మాల్యా అప్పగింత కోసం న్యాయపోరాటం చేస్తుండగా, లండన్ వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు.. భారత్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది. దీనిపై బ్రిటన్ హైకోర్టుకు మాల్యా వెళ్లగా.. కింది కోర్టు తీర్పునే గత నెల ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి 14 రోజుల గడువిచ్చింది.
also read ప్రధాని మోదీ ప్యాకేజీ భేష్ : ఐరాస ప్రశంసల వర్షం
కానీ అందుకు అనుమతి లభించక పోవడంతో మాల్యా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి అవకాశం లేకుండాపోయింది. కాగా, కరోనాతో మాల్యా అప్పగింత ఆలస్యమయ్యే వీలు ఉన్నది. ఇదిలావుంటే యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌కు వెళ్లడానికీ మాల్యాకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.
బాకీలన్నీ చెల్లిస్తానని తనపై ఉన్న కేసులన్నింటినీ కొట్టేయాలని మరోసారి మాల్యా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తానిచ్చే నగదును బ్యాంకులకు అందజేయాలని ట్విట్టర్ వేదికగా సర్కారును కోరారు.
‘దయచేసి బేషరతుగా నా సొమ్మును తీసుకోండి. నాపై కేసుల్ని మూసేయండి’ అని విజయ్ మాల్య వేడుకున్నారు. ‘రూ.20 లక్షల కోట్ల కొవిడ్-19 రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించిన భారత ప్రభుత్వానికి నా అభినందనలు. అయితే ప్రభుత్వ బ్యాంకులకు బాకీలు తిరిగి చెల్లిస్తానన్నా ఎందుకు నిరాకరిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ట్వీట్ చేశారు. మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.