ప్రధాని మోదీ ప్యాకేజీ భేష్ : ఐరాస ప్రశంసల వర్షం

భారత ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఆ దేశ ప్రధాని మోదీ ప్రకటించిన ప్యాకేజీ భేష్‌ అని ఐరాస పేర్కొంది. రూ.20 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీ ఆకర్షణీయంగా ఉందని తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 5.5 శాతం నమోదవుతుందని అంచనా వేసింది. 
 

UN economic experts hail India's 'impressive' stimulus package to revive economy hit by coronavirus

న్యూయార్క్: దేశీయ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసం భారత ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన పథకంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రశంసల జల్లు కురిపించింది. లాక్‌డౌన్‌ వల్ల చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకొనేందుకు ఇది ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేసింది. భారీ ఆర్థిక విపణులు, ఉద్దీపనను అమలు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని వ్యాఖ్యానించింది.

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు కుదేలయ్యాయి. తిరిగి వీటిని పట్టాలెక్కించేందుకు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రూ.20 లక్షల కోట్లతో స్వావలంబన పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి (వెస్ప్‌) నివేదికను ఆవిష్కరిస్తూ ఐరాస అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ శాఖ చీఫ్‌ హమీద్‌ రషీద్‌ భారత్‌పై ప్రశంసలు కురిపించారు.


భారత ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పథకం ఉత్తమంగా ఉందని ఐరాస అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ శాఖ చీఫ్‌ హమీద్‌ రషీద్‌ అన్నారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌, భారత జీడీపీలో 20 శాతం, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పటి వరకు అతిపెద్దదని అన్నారు.

పలు దేశాలు జీడీపీలో 0.5 శాతం లేదా 1 శాతానికే పరిమితం అవుతున్నాయని ఐరాస అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ శాఖ చీఫ్‌ హమీద్‌ రషీద్‌ వెల్లడించారు. భారత్‌కు అతిపెద్ద ఆర్థిక విపణి, ఉద్దీపనను అమలు చేయగలిగే సాధనాలు ఉన్నాయని తెలిపారు.

ప్యాకేజీని ఎలా రూపొందించారన్న దాన్నిబట్టి ప్రభావం ఉంటుందని ఐరాస  అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ శాఖ చీఫ్‌ హమీద్‌ రషీద్‌ పేర్కొన్నారు. అమెరికా తన జీడీపీలో 13%, జపాన్‌ తనజీడీపీలో 21%తో కూడిన ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించిన తర్వాత భారీ ఉద్దీపన పథకం భారత్‌దే కావడం విశేషం.

also read భారత్‌కు బ్రిక్స్ బ్యాంక్ చేయూత.. 100 కోట్ల డాలర్ల లోన్‌కు ఓకే

మోదీ ప్రకటించిన ప్యాకేజీ అత్యంత ఆకర్షణీయంగా ఉందని ఐరాస డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ సోషల్ అఫైర్స్, ఎకనమిక్ అనాలసిస్ అండ్ పాలసీ డివిజన్ సహాయ ఆర్థిక వ్యవహారాల అధికారి జులియన్‌ స్లాట్‌మన్‌ అన్నారు. ఇది మార్కెట్లకు ఊతమిస్తుందని, ప్రజలు కొనుగోళ్లు చేయకపోతే మాత్రం ఇంద్రజాలం తరహాలో వెంటనే ఫలితాలు కనిపించవని తెలిపారు. 

‘అదృష్టవశాత్తు భారత ప్రభుత్వం నిర్ణయాత్మకంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. దేశంలో వైరస్‌ వ్యాప్తి మందగించింది. అధిక జనాభా, సంక్లిష్టమైన భారత్‌లో కఠిన లాక్‌డౌన్‌ అవసరం. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. పేదలపైనా దీని ప్రభావం ఉంది’ అని జులియన్‌ స్లాట్‌మన్‌ అన్నారు.

భారత జీడీపీ వృద్ధిరేటు 2020-21లో 1.2శాతంగా నమోదవుతుందని జులియన్‌ స్లాట్‌మన్‌ అంచనా వేసింది. ఇక ప్రపంచ జీడీపీ 3.2 శాతమే ఉంటుందని వెల్లడించింది. 

మొత్తంగా 2020, 21 ఉత్పత్తిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 8.5 ట్రిలియన్‌ డాలర్లు నష్టపోతుందని జులియన్‌ స్లాట్‌మన్‌ పేర్కొంది. నాలుగేళ్ల లాభాలను తుడిచిపెట్టనుందని తెలిపింది. 2019లో 4.1 శాతంగా ఉన్న భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక ఏడాదికి 1.2గా ఉంటుందని 2021కి 5.5 శాతానికి పుంజుకోగలదని అంచనా వేసింది.

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ల వల్ల వృద్ధిరేటు మందగించినా ప్రపంచంలో భారత్‌ (1.2%), చైనా (1.7%) మాత్రమే సానుకూలంగా ఉన్నాయని ఆర్థిక నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. అమెరికా (-4.8), జపాన్‌ (-4.2), ఐరోపా కూటమి (-5.5), బ్రిటన్‌ (-5.4) ఆర్థిక వ్యవస్థలు పతనం అవుతాయని అంచనా వేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios