స్వదేశంలో రూ.9వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. భారత్‌కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు చేస్తుండగా.. ఇందుకు వ్యతిరేకంగా మాల్యా చేసిన అభ్యర్థనను అక్కడి హైకోర్టు కోర్టు తోసిపుచ్చింది. 

దీంతో త్వరలోనే మాల్యాను స్వదేశానికి రప్పించే అవకాశాలు మెరుగుపడ్డాయి. తనను భారత్‌కు అప్పగించే చర్యలను అడ్డుకోవాలని లండన్ కోర్టులో మాల్యా పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుథ్నాట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ.. విజయ్ మాల్యా భారత న్యాయస్థానాలకు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేసింది. అతను చేసిన ఆర్థిక అవకతవకలకు భారతీయ న్యాయస్థానాల పరిధిలోనే విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. 

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్యాను భారత్‌కు అప్పగించడానికి యూకే హోం సెక్రటరీ సాజిద్ జావిద్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే మాల్యా కోర్టును ఆశ్రయించాడు.

స్వదేశంలోని బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా.. 2016లో లండన్ పారిపోయాడు. దీంతో అతడ్ని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించారు. నాటి నుంచి భారత దర్యాప్తు సంస్థలు మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి.