బెంగళూరు: బెంగళూరు విమానాశ్రయం(కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం)లో మంగళవారం(ఏప్రిల్ 16) నుంచి యూజర్ ఛార్జీలను 120శాతం పెంచారు. కాగా, కొత్తగా విధించే అదనపు ఫీజును విమానాశ్రయ విస్తరణకు ఉపయోగించనున్నారు.

ఎయిర్‌పోర్టు ట్రాఫిక్ రెగ్యూలేటర్ ఏఈఆర్ఏ ఆదేశాలు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తాయని బెంగళూరు ఎయిర్‌పోర్టు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త ఛార్జీల పెంపు ప్రకారం.. దేశీయంగా ప్రయాణాలను ప్రారంభించే వారు రూ. 306 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో వీరి వద్ద నుంచి రూ. 139 మాత్రమే వసూలు చేసేవారు.

ఇక అంతర్జాతీయ ప్రయాణికులు రూ. 1,226 చెల్లించాల్సి ఉంది. గతంలో వీరి వద్ద నుంచి రూ. 558 తీసుకునేవారు. ఈ ఛార్జీల పెంపు విమానాశ్రయ విస్తరణకు అవసరమైన రూ. 13వేల కోట్లను సమకూర్చుకోవడంలో సాయం చేస్తుందని ఆ ప్రకటనలో బెంగళూరు ఎయిర్‌పోర్టు పేర్కొంది.

దేశీయ ప్రయాణాలకు ఛార్జీలు 120శాతం, విదేశీ ప్రయాణాలకు ఛార్జీలు 119శాతం పెరిగాయి. కాగా, దేశంలోనే అత్యంత రద్దీ అయిన మూడో విమానాశ్రయం బెంగళూరు.