ఇలా కూడా అమెరికా కలలు నెరవేర్చుకోవచ్చు.. ఈబీ5 వీసాలపై ఇండియన్ల మొగ్గు
అమెరికాలో శాశ్వత నివాసం అంటే ఎవరైనా ఎగిరి పడతారు. అందునా భారతీయులు అమెరికాలో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. ఐటీ సంస్థల్లో పని చేయడానికి హెచ్-1 తదితర వీసాలు జారీ చేసేవారు. కరోనా సాకుగా ట్రంప్ ఈ వీసాలన్నీ రద్దు చేశారు. కానీ భారతీయుల ఆశలు, కలలు మాత్రం నిలిచిపోవడం లేదు. గ్రీన్‌కార్డు కోసం ‘ఈబీ-5’ వీసా కోసం భారతీయులు మొగ్గు చూపుతున్నారు.
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత పౌరసత్వం సంపాదించాలని చాలా మంది భారతీయులు కలలు కంటారు. ఇందుకు వీలు కల్పించే గ్రీన్‌కార్డుల కోసం పలు రకాలుగా ప్రయత్నాలు సాగిస్తారు. ఇందుకోసం గ్రీన్ కార్డు సాధించడానికి రాచమార్గంగా భావించే ‘హెచ్ 1బీ’ వీసాల జారీని ఈ ఏడాది చివరివరకూ రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడి ప్రకటనతో భారతీయులు ఆశలు అడియాసలు అయ్యాయి. అయినా, భారతీయులు తమ కలలను వదులుకోలేక ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. అమెరికాలో పెట్టుబడులను పెట్టే వలసదారులకు ఇచ్చే ‘ఈబీ-5’ వీసాకు డిమాండ్ పెరుగుతున్నదని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో గ్రీన్‌కార్డుల కోసం ప్రయత్నిస్తున్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు ప్రధానంగా ‘ఈబీ-5’ వీసాల వైపునకు దృష్టి సారిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ‘దశాబ్దాలపాటు అమెరికాలో ఉద్యోగం చేస్తూ, ఇప్పటికీ గ్రీన్‌కార్డును సంపాదించలేని హెచ్-1బీ, హెచ్ 4 వీసాదారులు ‘ఈబీ-5’ వీసాల వైపునకు మొగ్గు చూపుతున్నారు’ అని ఇమ్మిగ్రేషన్ సంస్థ ‘క్యాన్‌యామ్' డైరెక్టర్ అభినవ్ లోహియా తెలిపారు.
also read ఎయిర్‌పోర్ట్ కుంభకోణంలో జివికే గ్రూప్ చైర్మన్, అతని కుమారుడిపై సీబీఐ కేసు ...
2019 నవంబర్‌లో ‘ఈబీ-5’ వీసా కోసం పెట్టే పెట్టుబడులను 5 లక్షల డాలర్ల నుంచి 9 లక్షల డాలర్లకు పెంచడంతో వీటికి డిమాండ్ తగ్గింది. అయితే, ‘హెచ్ 1బీ’ వీసాలను జారీని రద్దు చేస్తూ ఇటీవల ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మళ్లీ ‘ఈబీ-5’వీసాల వైపు చూస్తున్నారని చెప్పారు.
‘ఈబీ-5’ వీసా అంటే పెట్టుబడిదారుల వీసా అని ప్రతీతి. ఇది కావాలంటే, అమెరికాలోని ఏదైనా సంస్థలో 9 లక్షల డాలర్లను కనీస పెట్టుబడిగా పెట్టాలి. ఆ సంస్థ కనీసం పది మంది అమెరికన్లకు ఉపాధిని కల్పించాలి. ఒక్కో దేశానికి ఏడాదికి గరిష్ఠంగా 700 వరకు ‘ఈబీ-5’ వీసా కోటాను అనుమతిస్తారు.
నిర్ణీత అర్హతలు, నిబంధనలు పాటించిన ‘ఈబీ-5’ వీసాలు కలిగిన వారికి గ్రీన్‌కార్డులను మంజూరు చేస్తారు. దీనికి మూడు నుంచి ఐదేండ్ల సమయం పట్టొచ్చు. మరోవైపు, గ్రీన్‌కార్డుల కోసం ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది ‘హెచ్ 1బీ’ వీసాదారులు పడిగాపులు పడుతున్నారు. వీరి అందరికీ అమెరికాలో శాశ్వత పౌరసత్వం దక్కాలంటే కనీసం 150 ఏళ్లు పడుతుందని నివేదికల అంచనా. ఈ నేపథ్యంలోనే కొందరు ‘ఈబీ-5’ వీసా వైపునకు మళ్లుతున్నారు.