న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ కేకేఆర్‌ పెట్టుబడులు పెట్టనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జియోలో కేకేఆర్ 2.32 శాతం వాటాలు కొనుగోలు చేసింది.

ఈ ఒప్పందం విలువ రూ. 11,367 కోట్లు. ఆసియాలో కేకేఆర్‌ చేసిన అత్యంత భారీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇదే. ఆసియా ప్రైవేట్‌ ఈక్విటీ, గ్రోత్‌ టెక్నాలజీ ఫండ్స్‌ ద్వారా కేకేఆర్‌ ఈ మొత్తం ఇన్వెస్ట్‌ చేస్తోంది. ‘ఈ డీల్‌ ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్‌ సంస్థ విలువ రూ. 5.16 లక్షల కోట్లుగా ఉంటుంది‘ అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.  

జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడుల విషయమై గడిచిన నాలుగు వారాల్లో ఇది అయిదో ఒప్పందం. తొలుత సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఏప్రిల్‌ 22న రూ. 43,574 కోట్లతో 9.99 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే దిగ్గజ టెక్‌ ఇన్వెస్టర్ సిల్వర్‌ లేక్‌ సుమారు రూ. 5,655 కోట్లతో 1.15 శాతం వాటాలు దక్కించుకుంది. 

ఇక ఈ నెల 8వ తేదీన అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 11,367 కోట్లు వెచ్చించింది. అటుపై ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ జనరల్‌ అట్లాంటిక్‌ దాదాపు రూ. 6,598.38 కోట్లతో 1.34 శాతం వాటా దక్కించుకుంది. వీటి మొత్తం పెట్టుబడులు రూ. 78,562 కోట్లు అని రిలయన్స్‌ తెలిపింది.

also read ఆర్‌బిఐ కీలక నిర్ణయం: రుణాలపై మార‌టోరియం మరో మూడు నెలలు పొడిగింపు ...

ఈ సందర్భంగా రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ ‘అంతర్జాతీయం ఇన్వెస్టింగ్‌ దిగ్గజాల్లో ఒకటైన కేకేఆర్‌.. జియోలో పెట్టుబడులు పెట్టడాన్ని స్వాగతిస్తున్నాను. జియోతో ప్రపంచంలోకెల్లా ఆర్థిక పరమైన సంస్థల్లో ఒక్కటైన కేకేఆర్ మా వ్యాపార భాగస్వామిగా రావడం ఆనందదాయకం. దేశ ప్రజలందరికీ లబ్ధి చేకూర్చేలా భారతీయ డిజిటల్‌ వ్యవస్థను తీర్చిదిద్దుతాం. ఈ క్రమంలో కేకేఆర్‌ అనుభవం ఉపయోగపడగలదు’ అని వ్యాఖ్యానించారు. 

కేకేఆర్‌ 1976లో ప్రారంభమైన సంస్థ. అంతర్జాతీయ ఎంటర్ ప్రైజెస్ లను నెలకొల్పడం, టెక్నాలజీ రంగంలో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంలో కేకేఆర్ సంస్థకు మంచి అనుభవం ఉంది. ఇప్పటికే వివిధ సంస్థల్లో దాదాపు 30 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.

బైట్‌డ్యాన్స్, గోజెక్, బీఎంసీ సాఫ్ట్‌వేర్‌ తదితర సంస్థలు కేకేఆర్ పెట్టుబడులు పెట్టిన సంస్థల జాబితాలో ఉన్నాయి. కేకేఆర్‌ టెక్నాలజీ పోర్ట్‌ఫోలియోలో మీడియా, టెలికం, టెక్నాలజీ రంగాలకు చెందిన 20 పైగా కంపెనీలు ఉన్నాయి. 2006 నుంచి భారత్‌లో కూడా కేకేఆర్‌ ఇన్వెస్ట్‌ చేస్తోంది.

కేకేఆర్‌ సహ వ్యవస్థాపకుడు హెన్రీ క్రావిస్‌ స్పందిస్తూ.. ‘దేశ డిజిటల్‌ వ్యవస్థ రూపురేఖల్ని జియో ప్లాట్‌ఫామ్స్‌ మారుస్తున్న తీరు కేవలం కొద్ది కంపెనీలకు మాత్రమే సాధ్యపడుతుంది. భారత్, ఆసియా పసిఫిక్‌ దేశ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలకు తోడ్పాటు అందిస్తాం అనేందుకు జియోలో పెట్టుబడులే నిదర్శనం‘ అని వ్యాఖ్యానించారు.