Compact SUV: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? కొంత కాలం వెయిట్ చేస్తే హైబ్రిడ్ వెర్షన్ కార్లు మార్కెట్ లోకి వస్తాయి. ఇందులో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ మోడల్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన కారు సెలెక్ట్ చేసుకోవచ్చు.
భారతదేశంలో SUV మార్కెట్ ఎక్కువ. వీటిలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్ కు డిమాండ్ కూడా ఎక్కువ. మొత్తం SUV అమ్మకాల్లో దాదాపు సగం అవే అమ్ముడవుతాయి. అందుకే ఇప్పుడు అన్ని ప్రధాన కంపెనీలు కొత్త కార్లను తీసుకొస్తున్నాయి. వీటిలో కొన్ని అప్డేట్ చేసిన మోడల్స్ ని తీసుకురాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్
2023 లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ని లాంచ్ చేసింది. అయితే అప్పట్లో ఈ కారుపై చాలా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. వాటన్నింటినీ దాటుకొని 2025 నాటికి ఫ్రాంక్స్ మార్కెట్ లో బెస్ట్ SUV లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్ వెర్షన్ ని తీసుకొస్తోంది. ఇది ఇండియాలో అతి తక్కువ ధరకే దొరికే హైబ్రిడ్ కారు అవుతుందని కంపెనీ తెలిపింది.
గ్రాండ్ విటారాలో ఉన్న టయోటా హైబ్రిడ్ టెక్నాలజీ కాకుండా.. ఫ్రాంక్స్ లో మారుతి సొంత పవర్ ట్రెయిన్ ఉంటుంది. దీనివల్ల ధర తక్కువగా ఉంటుంది. ఫ్రాంక్స్ హైబ్రిడ్ లో స్విఫ్ట్, డిజైర్ లలో ఉన్న 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది.
2. టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్
టాటా మోటార్స్ తన పంచ్ మోడల్ కి ఫేస్ లిఫ్ట్ ను తీసుకొస్తోంది. ఇది డిజైన్ పరంగా దాని EV వెర్షన్ లాగానే ఉంటుంది. స్పై ఫోటోల ప్రకారం 2025 పంచ్ లో ఎలక్ట్రిక్ SUV లాగా స్ప్లిట్ హెడ్ లైట్ డిజైన్ ఉంటుంది. ముందు భాగంలో కనెక్టెడ్ LED DRL, కొత్త అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో కొత్త టెయిల్ లైట్స్ ఉంటాయి.
10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో ఇంటీరియర్ మారుతుంది. 2025 పంచ్ లో 87 bhp, 115 Nm టార్క్ ఇచ్చే 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది.
3. కొత్త హ్యుండై వెన్యూ
నెక్స్ట్ జనరేషన్ హ్యుండై వెన్యూ డిజైన్ ప్రస్తుత క్రెటా లాగా ఉంటుంది. స్ప్లిట్ హెడ్ లైట్ డిజైన్, క్యూబ్ షేప్ LED హెడ్ లైట్స్, పారామెట్రిక్ గ్రిల్ ఉంటాయి. కొత్త అల్లాయ్ వీల్స్ ఉంటాయి.
వెనుక భాగంలో హారిజాంటల్ LED టెయిల్ లైట్స్, టాప్ వేరియంట్ లో కనెక్టెడ్ LED లైట్ బార్ ఉండొచ్చు. పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త కలర్ ఆప్షన్స్, కొత్త స్టీరింగ్ వీల్, లెవెల్ 2 ADAS వంటి ఫీచర్స్ ఉంటాయి.
4. మహీంద్రా XUV 3XO EV
3X0 మహీంద్రా నాలుగో బెస్ట్ సెల్లింగ్ SUVగా నిలిచింది. XUV400 EV లో ఉన్న రెండు బ్యాటరీ ప్యాక్స్ ఇందులో కూడా ఉంటాయి. బేస్ వేరియంట్ లో 34.5 kWh బ్యాటరీ, టాప్ మోడల్ లో 39.4 kWh బ్యాటరీ ఉంటుంది.
5. రెనాల్ట్ కైగర్ ఫేస్ లిఫ్ట్
రెనాల్ట్ ఇండియాలో క్విడ్, ట్రైబర్, కైగర్ అనే మూడు కార్లను అమ్ముతోంది. కైగర్ కి ఈ ఏడాది ఫేస్ లిఫ్ట్ వస్తోంది. స్పై ఫోటోల ప్రకారం, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ముందు భాగం, స్ప్లిట్ హెడ్ లాంప్స్ కొత్త డిజైన్ లో ఉంటాయి. వెనుక భాగంలో కూడా మార్పులు ఉంటాయని సమాచారం. కానీ C షేప్ టెయిల్ లైట్స్ అలాగే ఉంటాయి.
ఈ కార్ల ఫీచర్లు తెలుసుకున్నారు కాబట్టి.. మీకు నచ్చిన మోడల్ ని సెలెక్ట్ చేసుకుని అవి రిలీజ్ అయిన వెంటనే కొనుక్కోండి.