యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూ.5 లక్షల రుణం అందిస్తోంది. ఈ లోన్ పొందినవాళ్లు పైసా కూడా వడ్డీ కట్టక్కర్లేదు. ఎటువంటి ష్యూరిటీ కూడా పెట్టాల్సిన పని లేదు. ఈ లోన్ పొందడానికి ఎలాంటి అర్హతలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు "ముఖ్యమంత్రి యువ ఉద్యమి అభియాన్ యోజన" అనే పథకం ప్రారంభమైంది. దీని ద్వారా 21 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన యువతకు వడ్డీ లేని, భరోసా అవసరం లేని రూ.5 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకం ప్రధాన లక్ష్యం యువతను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించడం.
రూ.1,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు..
యువతకు చేయూతనిస్తున్న ఈ పథకం ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో అమలువుతోంది. ఈ పథకం కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. రుణం నాలుగు సంవత్సరాల కాలపరిమితితో వడ్డీ లేకుండా అందిస్తారు. మొదటి దశలో రూ.5 లక్షల వరకు రుణం ఇస్తారు. రెండో దశలో రూ.10 లక్షల వరకు రుణం ఇస్తారు. ఇందులో 50% వడ్డీ సబ్సిడీ కూడా ఉంటుంది.
ఈ స్కీమ్ లో చేరాలనుకున్న వారి వయస్సు 21 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. కనీస విద్యార్హత 8వ తరగతి పాసైతే చాలు. ప్రభుత్వ ప్రాయోజిత శిక్షణా కార్యక్రమాల్లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల వద్ద డిఫాల్టర్ కాకుండా ఉండాలి. ఇతర స్వయం ఉపాధి పథకాల ప్రయోజనం పొందకూడదని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేయాలి..
ఈ పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పెరిగి, ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పొందుతారని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. ఇలాంటి స్వయం ఉపాధి ఉపాధి అవకాశాలను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని యువత కోరుతున్నారు.
ఇప్పటికే కార్పొరేషన్ లోన్ల ద్వారా రుణాలు ఇస్తున్నప్పటికీ అవి అందరికీ అందడం లేదని, ఎంఎస్ఎంఈ స్కీమ్ ను మరింత పటిష్ఠంగా అమలు చేయాలని కోరుతున్నారు.