బ్యాంకులకు రూ.9000 కోట్ల మేర బురిడీ కొట్టించి బ్రిటన్‌కు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలుపుతూ బ్రిటన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. మాల్య అప్పగింత ఉత్తర్వుల ఫైలుపై ఆ దేశ హోం శాఖ మంత్రి సాజిద్ జావీద్ సంతకాలు చేశారు. 

విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలని గతేడాది డిసెంబర్ 10వ తేదీన బ్రిటన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అప్పగింత ఒప్పంద ప్రక్రియలో భాగంగా చీఫ్ మెజిస్ట్రేట్ ఆదేశాలను హోంశాఖ మంత్రికి పంపారు. 
విజయ్ మాల్యా అప్పగింతపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. రెండు నెలల్లో ఆయన దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, సోమవారం ఆ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. 

బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయంపై బ్రిటన్‌లోని హైకోర్టులో అప్పీల్ చేస్తానని మాల్యా ట్వీట్ చేశారు. రెండు వారాల్లో విజయ్ మాల్య అప్పీల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్రిటన్ హైకోర్టులో ఓడిపోతే, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేందుకు వెసులుబాటు ఉన్నది.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నతర్వాతే మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి జావీద్ ఆమోదం తెలిపారని హోం శాఖ సోమవారం ధ్రువీకరించింది.

కాగా, సుమారు రూ.9 వేల కోట్ల మేర బ్యాంకులను మోసగించి విజయ్ మాల్యా బ్రిటన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. 

2017 ఏప్రిల్‌లో మాల్యాను అరెస్ట్ చేసిన స్కాట్లాండ్ పోలీసులు తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. తనను భారత్‌కు అప్పగిస్తూ వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తానని మాల్యా ఇప్పటికే వెల్లడించారు. 

గతేడాది డిసెంబర్ 10న వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జి ఆర్బుత్‌నాట్ తీర్పు వెలువరిస్తూ... తన ఆర్థిక లావాదేవీలపై మాల్యా భారత్ కోర్టుల్లో సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. విజయ్ మాల్యా తప్పుడు పత్రాల ద్వారా రుణాలు పొందినట్లు స్పష్టంగా తెలుస్తున్నదన్నారు.
 మనీ ల్యాండ్‌రింగ్‌కు మాల్యా కుట్ర పన్నినట్లు ప్రాథమికంగా తేలినట్లు జడ్జి అర్బుత్ నాట్ చెప్పారు. మాల్యాను భారత్‌కు అప్పగించిన తరువాత ఆయనను ఉంచబోయే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న బ్యారక్ 12లో వసతులు సరిగా లేవని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని మాల్యా తరఫు న్యాయవాది వాదనను ఆమె తోసిపుచ్చారు. అక్కడి వసతులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా, విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగిస్తూ బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. న్యాయ ప్రక్రియను త్వరగా ముగించాలని కోరింది. సాధ్యమైనంత తొందరగా బ్రిటన్‌లో న్యాయప్రక్రియ పూర్తయి భారత్‌ కోరిన విధంగా మాల్యాను అప్పగిస్తారన్న ఆశాభావాన్ని విదేశాంగ శాఖ వ్యక్తీకరించింది.

ఈ ప్రక్రియ ముగియడానికి మరో ఏడెనిమిది నెలలు పట్టవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. మాల్యా అప్పగింత వ్యవహారంలో మరో మెట్టును కేంద్రం అధిగమించగలిగిందని అమెరికాలో చికిత్స పొందుతున్న ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘మాల్యాను రప్పించేపనిలో మోదీ సర్కారు నిమగ్నమైంది. విపక్షాలు మాత్రం శారదా స్కాం నిందితులకు సంఘీభావం పలుకుతున్నాయి’అని హేళన చేశారు.