Asianet News TeluguAsianet News Telugu

హెచ్-1బీ వీసాల రద్దు..: తేల్చేసిన నాస్కామ్‌

హెచ్-1 బీ తదితర వీసాల రద్దుతో అమెరికాకే నష్టం వాటిల్లుతుందని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ స్పష్టం చేసింది. ప్రాజెక్టులు భారతదేశానికి తరలి వెళతాయని పేర్కొన్నది. 

u.s president h1 b visa suspension harmful for economy : nasscom
Author
Hyderabad, First Published Jun 24, 2020, 12:24 PM IST

న్యూఢిల్లీ: అమెరికాలో స్థానికుల‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించాల‌నే ఉద్దేశంతో ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వర్క్‌ వీసాల జారీని రద్దు చేయడం తప్పుడు నిర్ణయం అని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్‌ పేర్కొన్నది. వ‌ర్క్ వీసాల ర‌ద్దుపై అమెరికాలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించింది.  

తద్వారా ఆ దేశ ఆర్థికవ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ఓ ప్రకటనలో నాస్కామ్ స్పష్టం చేసింది. అమెరికన్లలో అవ‌స‌రానికి స‌రిప‌డా నిపుణులు లేక‌పోవ‌డంతో అక్కడి ఐటీ కంపెనీలు తమ ప్రాజెక్టులను చాలా మేరకు విదేశాలకు తరలించే అవకాశమున్నదని నాస్కామ్‌ అభిప్రాయ పడింది.

అమెరికాలో ప‌లు ఆస్ప‌త్రులు, ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ సంస్థలతోపాటు వేలాది వ్యాపార సంస్థలకు నాస్కామ్‌ సభ్యులు అత్యవసర సేవలను అందజేస్తున్న విషయాన్ని నాస్కామ్ గుర్తుచేసింది.

ఈ ఏడాది చివ‌రిక‌ల్లా అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొంద‌డం కోసం అధ్య‌క్షుడు ట్రంప్ అన్ని ర‌కాల వ‌ర్క్ వీసాలను ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు స‌స్పెండ్ చేశారు.

ట్రంప్‌ కొత్త ఉత్తర్వులపై అమెరికన్‌ కంపెనీల్లోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అమెరికా ఫస్ట్‌ రికవరీ పేరుతో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలని అధ్యక్షుడు భావిస్తున్నా, ఈ వీసాలపై నిషేధం పొడిగించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని అక్కడ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అమెరికా వలస విధానాలను వ్యతిరేకంగా ఉందని ఇమ్మిగ్రేషన్‌ నిపుణుల అభిప్రాయంగా ఉంది. న్యూయార్క్‌కి చెందిన ఇమ్మిగ్రేషన్‌ యాక్ట్‌ సంస్థ వ్యవస్థాపకుడు సైరస్‌ మెహతా ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై ఎవరైనా కోర్టుకెక్కే అవకాశం ఉందన్నారు.

‘ట్రంప్‌ ప్రకటన ఇమ్మిగ్రేషన్, నేషనాలటీ చట్టాలకు పూర్తిగా వ్యతిరేకం. ఎవరైనా కోర్టుకెళితే దీనిని నిలిపివేస్తారు. ఇలా నిషేధం పొడిగించడం వల్ల అమెరికాలో కొత్త ఉద్యోగాల కల్పన జరగదు. ఈ వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న వారంతా అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎంతో సాయంగా ఉన్నారు’అని వ్యాఖ్యానించారు. 

also read ముకేష్ అంబానీ సంపాదన నిమిషానికి ఎంతో తెలుసా...

ఇన్నాళ్లూ హెచ్‌1బీ వీసాలను లాటరీ విధానం ద్వారా ఇచ్చేవారని, ఇకపై ఉద్యోగాల్లో తీసుకునే విదేశీ పనివారి నైపుణ్యం, వారికిచ్చే వేతనం ఆధారంగా వీసాలు జారీ చేస్తారని వైట్‌హౌస్‌ అధికారులు వెల్లడించారు.

‘ప్రతీ ఏడాది హెచ్‌–1బీ వీసాలు 85 వేల వరకు జారీ చేస్తాం. కానీ దరఖాస్తులు 2 నుంచి 3 లక్షలు వస్తాయి. ఇకపై లాటరీ విధానాన్ని రద్దు చేసి ప్రతిభ ఆధారంగా మంజూరు చేయాలని అధ్యక్షుడు ఆదేశించారు. అంటే అత్యధిక వేతనాలు లభించే 85 వేల మందికి మంజూరు చేస్తాం. దీనివల్ల నైపుణ్యం కలిగిన వారికే పనిచేసే అవకాశం వస్తుంది’అని ఆ అధికారి వివరించారు. 

అమెరిక ప్రభుత్వ సంస్థలు, ఆసుపత్రులు, ఔషధ, బయోటెక్ సంస్థలకు భారత ఐటీ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. అత్యున్నత నైపుణ్యం గల వలసదారులు కానీ భారతీయులు అమెరికా కంపెనీలకు ఐటీ సేవలు, ఉత్పత్తులు అభివ్రుద్ధి చేయడం, అమలు చేయడంలో నిమగ్నం అవుతున్నారు.

హెచ్1 బీ వీసాలను ఈ ఏడాది చివరి వరకు కొత్తగా జారీ చేయకపోతే, అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుంది. పైగా భారతదేశానికి అమెరికా ఐటీ ప్రాజెక్టులు తరలి వెళతాయి. అక్కడ నిపుణుల లభ్యత కొరవడటమే ఇందుకు కారణం. 

అమెరికాలో పెట్టుబడులు నెమ్మదిస్తాయని అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్ సీఈఓ థామస్ దోనాహ్యూ పేర్కొన్నారు. వినూత్న ఆవిష్కరణలు తగ్గుతాయని చెప్పారు. వ్రుద్ధి నిదానిస్తుందని చెప్పారు. ఉద్యోగాల కల్పనపై ప్రభవం పడుతుందన్నారు. ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, ఐటీ నిపుణులు, వైద్యులు, నర్సుల రాక ఆగిపోతే అమెరికకు మంచిది కాదన్నారు. 

అమెరికా అగ్రశ్రేణి ఐటీ కంపెనీల సంఘం ‘ఎఫ్‪డబ్ల్యూడీ.యూఎస్’ స్పందిస్తూ.. ఆధునిక వైద్యం, సైన్స్‌తోపాటు పలు రంగాల్లో జరుగుతున్న పరిశోధనలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నిపుణులను ఆకర్షించే అవకాశాన్ని కోల్పోతామని తెలిపింది. 

కరోనా వ్యాధి నివారణకు అవసరమైన చికిత్సలతోపాటు ఆర్థిక వ్యవస్థలు కోలుకునేందుకు అవసరమైన వినూత్న విధానాల ఆవిష్కరణపైనా ప్రభావం పడుతుందని చెప్పింది. ఇది అమెరికాకు చేటు చేస్తుందన్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios