సిలికాన్ వ్యాలీ: ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే తన తొలి పారితోషికాన్ని అందుకున్నారు. 2018లో $1.40 తీసుకోగా.. ఈ ఏడాది ఇంకా ఎక్కువ మొత్తం అందుకునే అవకాశం ఉందని అంచనా.

ఇంతకుముందు ట్విట్టర్ యూజర్లు 140 క్యారెక్టర్స్ మాత్రమే వన్ సెంట్‌కు ఉపయోగించే పరిమితి ఉండేది. అయితే, 2017లో ఈ పరిమితిని 280 క్యారెక్టర్స్‌కు పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో డోర్సే పారితోషికం కూడా డబుల్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.

2015లో ట్విట్టర్‌కు  తిరిగొచ్చిన డోర్సే.. అప్పట్నుంచి ఎలాంటి పారితోషికాన్ని తీసుకోకపోవడం గమనార్హం. తాజాగా ఆయన ఆ మొత్తాన్ని తొలిసారిగా పొందారు. అయితే, గత మూడేళ్లలో వచ్చే కంపెన్సేషన్స్, బెనిఫిట్స్ మాత్రం ఆయన తీసుకోలేదు. ఈ మేరకు ట్విట్టర్ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో సోమవారం వెల్లడించింది.

ట్విట్టర్ దీర్ఘ కాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొద్ది సంవత్సరాలుగా సహ వ్యవస్థాపకుడైన డోర్సే జీతం తీసుకోవడం లేదని పేర్కొంది. కాగా, 2018 ప్రారంభంలోనే డోర్సే షేర్లు 20శాతం విలువ పెరగడం గమనార్హం.

ఇది ఇలావుండగా, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బేస్ శాలరీ $1గానే చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. 2004 నుంచి అల్ఫాబెట్ సీఈఓ లారీ పేజ్ కూడా ఏడాదికి $1 మాత్రమే బేస్ శాలరీగా తీసుకుంటున్నారు. ఇతర కంపెన్సేషన్స్ వదులుకున్నారు.