Asianet News TeluguAsianet News Telugu

చెక్ పోస్టులు దాటాలంటే రూ.48 వేల కోట్ల లంచం

జాతీయ రహదారిపై చెక్‌పోస్ట్‌లు, టోల్ గేట్ల దగ్గర లారీ డ్రైవర్లు, ఓనర్లు ‘కచ్చితంగా’ ఎంతో కొంత సమర్పించుకోవడం చూస్తూనే ఉంటాం. ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీవో అధికారుల బాదుడు దీనికి అదనం. 

Truckers, owners pay Rs 48,000 crore annually in bribes
Author
New Delhi, First Published Mar 1, 2020, 3:37 PM IST


న్యూఢిల్లీ: జాతీయ రహదారిపై చెక్‌పోస్ట్‌లు, టోల్ గేట్ల దగ్గర లారీ డ్రైవర్లు, ఓనర్లు ‘కచ్చితంగా’ ఎంతో కొంత సమర్పించుకోవడం చూస్తూనే ఉంటాం. ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీవో అధికారుల బాదుడు దీనికి అదనం. ఇలా ఒక్కో ట్రిప్పుకు సగటున రూ.1,257 వసూలు చేస్తున్నారని తేలింది. 

డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌, బండి రిజిస్ట్రేషన్‌ సమయంలోనూ రూ.1500 వరకు మోత తప్పడం లేదు. దేశం మొత్తం ఉన్న లారీల డ్రైవర్లు, ఓనర్లు కలిసి ట్రాఫిక్‌, హైవే పోలీసులు, ఆర్టీవో అధికారులు తదితరులకు ప్రతి ఏటా సమర్పించుకుంటున్న ఆమ్యామ్యాల మొత్తం అక్షరాలా 48వేల కోట్ల రూపాయలని ‘సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌' అనే స్వచ్ఛంద సంస్థ సర్వే చేసి లెక్క తేల్చింది.

దేశవ్యాప్తంగా ఉన్న పది భారీ రవాణా కేంద్రాలు (ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ ట్రాన్సిస్ట్‌ హబ్‌) పరిధిలో అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. సర్వేలో భాగంగా 1,217 మంది డ్రైవర్లు, 110 మంది యజమానులను సమగ్రంగా ప్రశ్నలు అడిగారు. ఈ నివేదికను కేంద్ర రవాణాశాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ ఇటీవలే విడుదల చేశారు. 

ప్రతి ట్రిప్పునకు లంచం ఇస్తున్నామని సగటున 82% శాతం మంది డ్రైవర్లు చెప్తున్నారు. ఈ జాబితాలో గువాహటి, చెన్నై, ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నాయి. ఒక ట్రిప్పునకు సగటున చెల్లిస్తున్న మొత్తం రూ.1,257. నిబంధనల ప్రకారమే వెళ్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఆర్టీవో అధికారులు వాహన రకాన్ని బట్టి ‘నిర్ణీత’ మొత్తం వసూలు చేస్తున్నారట. 

ఇలా ధరల పట్టిక అమలు చేస్తున్న హబ్‌లలో బెంగళూరు, గువాహటి టాప్‌లో ఉన్నాయి. ఒక డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ సమయంలో ఆర్టీవో అధికారులకు లంచం ఇవ్వాల్సి వస్తున్నదని సగటున 47 శాతం మంది డ్రైవర్లు చెప్పారు. 

ముంబైలో ఏకంగా 93 శాతం మంది నుంచి, ఢిల్లీలో 78శాతం మంది నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని నిర్దారించారు. ఇలా లైసెన్స్‌ రెన్యువల్‌కు ఒక్కో డ్రైవర్‌ సగటున రూ.1,789 ముట్ట జెప్తున్నారని తేలింది. 

అత్యధికంగా ఢిల్లీలో రూ. 2,025 ముట్టజెప్పాల్సి వస్తున్నదని వాపోతున్నారు. అదేవిధంగా ట్రక్కుల రిజిస్ట్రేషన్‌ సమయంలో  ఒక్కో వాహనానికి సగటున రూ.1,360 ముట్టజెప్పాల్సి వస్తున్నదని వాపోతున్నారు. 

కానీ సరుకు రవాణాలో వచ్చే అవరోధాలు అధిగమించేందుకు, నిబంధనలను అతిక్రమిస్తున్నా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించేందుకు గాను డైవర్లు, ట్రక్కు సంస్థల యజమానులు ఏడాదికి దాదాపు రూ.48,000 కోట్ల మేర లంచాలు చెల్లిస్తున్నట్టుగా తెలిపింది. ఈ మొత్తంలో సింహభాగం ట్రిఫిక్‌ సిబ్బంది, హైవే పోలీసుల జేబుల్లోకి చేరుకుంటున్నట్టుగా ఈ అధ్యయనం తెలిపింది. 

ఆ తరువాత అత్యధికంగా చెన్నై (89%), ఢిల్లీలో (84.4%) రవాణా అధికారుల దోపిడి అత్యధికంగా ఉంటున్నట్టుగా అధ్యయనం పేర్కొంది.
'పూజాసమిత్‌'ల వారు, అనధికారిక చెక్‌పోస్టులను దాటే విషయంలో డ్రైవర్లు తప్పక లంచాలు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Also read:క్రూడ్ ధర తగ్గినా.. దేశీయంగా తగ్గని పెట్రోల్ ప్రైస్

ఒక్కో ట్రిప్‌లోకనీసం సగటున రూ.1,257 మేర లంచాలు చెల్లించాల్సి పరిస్థితులు ఉంటున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిప్పుకు బయలుదేరే ముందు ఆర్టీఏ అధికారుల చేతులుతడపడమనేది అనధికారిక అంశంగా మారిందని ట్రక్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

అసలే ఆర్థిక మందగమనంతో ఇబ్బంది పడుతున్న తమకు ఇప్పుడు లంచాల రూపంలో అధిక భారాన్ని మోయడం మరింత కష్టంగా మారుతోందని ఆయన వివరించారు. స్వచ్ఛంద సంస్థ స్వయంగా కేంద్ర రవాణా శాఖ మంత్రికే ఈ నివేదికను అందజేసినందున రానున్న రోజుల్లో అధికారులు దీనిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతారో వేచి చూడాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios