న్యూఢిల్లీ:చమురు మార్కెటింగ్ సంస్థలు మంగళవారం మళ్ళీ ఇంధన ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్ పై 54 పైసలు పెంచగా, డీజిల్ పై 58 పైసలు పెంచింది. గత మూడు రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.1.74, డీజిల్ లీటరుకు రూ .1.78 పెంచింది. 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో ప్రజలు తీరిగి వారి వ్యాపారాలు, ఉద్యోగాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. దీంతో పెట్రోల్ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతున్నది. వరుసగా మూడోరోజూ కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ పెట్రో కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.73కు, డీజిల్‌ ధర రూ.71.17కి పెరిగాయి. అంతకుముందు పెట్రోల్ ధర రూ.72.46 ఉండగా, డీజిల్ ధర రూ.70.59గా ఉంది.   

also read బ్యాడ్ బ్యాంక్ ఆలోచన చాలా ‘బ్యాడ్‌’ ఐడియా..!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత 82 రోజులుగా పెట్రో ధరల్లో  కంపెనీలు మార్పులు చేయలేదు. కానీ ఆదివారం (జూన్‌ 7న) నుంచి ఇంధన ధరలు పెంచుతూ వస్తున్నాయి. దేశంలోని ఆయిల్‌ కంపెనీలు ప్రతి నెలాఖరులో ఇంధన ధరలపై సమీక్ష జరిపి అంతర్జాతీయ ముడిచమురు ధరల మేరకు సవరించేవి.

ఈ విధానానికి స్వస్తి పలికిన కంపెనీలు ప్రస్తుతం రోజువారీగా సమీక్షించి పెట్రో, డీజిల్‌ ధరలను నిర్ణయిస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు సవరించిన ధరలను ప్రకటించిస్తున్నాయి. మే 6న ప్రభుత్వం మళ్లీ ఎక్సైజ్ సుంకాలను పెట్రోల్‌ పై రూ.10, డీజిల్‌పై రూ.13 పెంచిన సంగతి తెలిసిందే.