న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణకు విధించిన లా‌క్‌డౌన్ ఎత్తేసిన తర్వాత జూన్ 7 నుంచి దాదాపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రతిరోజూ పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధానంగా అధిక ఎక్సైజ్‌ డ్యూటీలు, కేంద్ర చమురు సంస్థలకు (ఓఎంసీ) మార్జిన్లు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు విదేశీ మార్కెట్లో ఇటీవల ముడిచమురు ధరలు బలపడుతుండటం మరో కారణం. 

దేశీయ అవసరాల కోసం దాదాపు 80% చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సంగతి తెలిసిందే. దీంతో డాలర్‌తో మారకంలో రూపాయి కదలికలు సైతం ధరలను ప్రభావితం చేస్తుంటాయని ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండటంతో సాధారణంగా విదేశాల్లో పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరలే అధికం. దేశీయంగా డీజిల్‌ కంటే పెట్రోల్‌ ధరలే ఎక్కువ ప్రీమియంలో కదులుతుంటాయి. ఇందుకు ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్ ప్రభావం చూపుతుంటాయి. కానీ ప్రస్తుతం దేశంలోనూ పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్‌ ధరలు సమానంగా మారాయి. 

ఇందుకు అధిక ఎక్సైజ్‌ డ్యూటీలు, పెరిగిన పెట్రో కంపెనీల మార్కెటింగ్‌ మార్జిన్లు కారణమని పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కొద్ది రోజులుగా ఎక్సైజ్‌ డ్యూటీలతోపాటు వ్యాట్‌ పెరుగుతుండటంతో పెట్రోల్‌ ధరలకు డీజిల్‌ సమానమైనట్లు వివరించాయి. ఫలితంగా ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒకే స్థాయికి చేరినట్లు తెలియజేశాయి.

also read  పెరిగిన బంగారం, వెండి ధరలు... 10గ్రాములకు ఎంతంటే..?

కోవిడ్‌-19 నేపథ్యంలో గత రెండు నెలల్లో ముడిచమురు ధరలు డీలా పడినా, తిరిగి పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 42 డాలర్ల స్థాయిలో కదులుతోంది. ఇదే సమయంలో డాలర్‌తో మారకంలో రూపాయి విలువ 75 ఎగువనే కదలాడుతోంది. 

మరోవైపు ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం డ్యూటీలను పెంచుతూ వచ్చింది. రిటైల్‌ ధరలపై ప్రభావం పడకుండా వీటిని హెచ్చించింది. ఫలితంగా ఫిబ్రవరిలో లీటర్‌ పెట్రోల్‌కు రూ.20గా ఉన్న ఎక్సైజ్‌ డ్యూటీ ప్రస్తుతం రూ.33లకు, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ లీటర్‌కు రూ.16 నుంచి రూ.32కు పెరిగింది.

2014లో పెట్రోల్‌పై పన్నులు లీటర్‌కు రూ.9.5గా నమోదుకాగా.. డీజిల్‌పై ఇవి రూ.3.5గా అమలైనట్లు నిపుణులు గుర్తు చేశారు. పెట్రోల్‌పై వ్యాట్‌ రూ. 15.3 నుంచి 17.7కు  పెరిగితే, డీజిల్‌పై మరింత అధికంగా రూ.9.5 నుంచి రూ.17.6కు ఎగసింది. విదేశాలలో చమురు ధరలు పతనమై తిరిగి కోలుకున్నా, గత 3 నెలల్లో అంటే మే చివరి వరకూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దాదాపు యథాతథంగా కొనసాగాయి.

ఇదే సమయంలో పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల మార్జిన్లు లీటర్‌ ధరపై రూ. 2-3 నుంచి రూ.13-19 వరకూ ఎగిశాయని, తిరిగి ప్రస్తుతం 5 స్థాయికి చేరాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కాగా.. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో 70 శాతంవరకూ ఎక్సయిజ్‌, వ్యాట్‌ ఆక్రమిస్తుంటాయని విశ్లేషకులు పేర్కొన్నారు.