ముంబై: డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)ను, కేంద్ర ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.68- 69 మధ్య ట్రేడవుతోంది. రూ.70 దాటితే ప్రమాదం తప్పదని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా - మెరిల్‌ లించ్‌ (బీఓఎఫ్ఎఎంఎల్‌) హెచ్చరించింది. అదే జరిగితే 2013లో మాదిరిగా మళ్లీ ప్రవాస భారతీయులను ఆశ్రయించి, ఎన్నారై బాండ్లు విక్రయించక తప్పకపోవచ్చని అంచనా వేసింది. 

ఎఫ్‌పిఐల పెట్టుబడులు అడుగంటి, డాలర్‌తో రూపాయి మారకం రేటు 70 స్థాయిని దాటితే ఆర్‌బిఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మళ్లీ ఎన్‌ఆర్‌ఐల నుంచి 3,000 కోట్ల నుంచి 3,500 కోట్ల డాలర్లు బాండ్ల రూపంలో సమీరించే అవకాశం ఉంది. డిసెంబరు 2018తో ముగిసే త్రైమాసికంలోనే ఈ బాండ్ల ఇష్యూ ఉండొచ్చని మా నమ్మకం’ అని బీఓఎఫ్ఎఎంఎల్ తన తాజా నివేదికలో పేర్కొంది.

2013లోనూ డాలర్‌తో రూపాయి మారకం తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంది. ఒక దశలో డాలర్‌తో రూపాయి మారకం రేటు68.85 స్థాయికి క్షీణించింది. అదే సమయంలో అమెరికా కేంద్ర బ్యాంక్‌ ‘ఫెడ్‌ రిజర్వ్‌’ అనుసరించిన పరపతి విధానంతో ఎఫ్‌ఐఐల అమ్మకాలు వెల్లువెత్తి విదేశీ మారక ద్రవ్య నిల్వలూ క్షీణించాయి. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు అప్పటి ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సలహాతో యూపీఏ ప్రభుత్వం మూడేళ్ల కాల పరిమితి ఉన్న ఎన్‌ఆర్‌ఐ బాండ్ల ద్వారా 3,000 కోట్ల డాలర్లు సమీకరించింది.
 
చమురు సెగతో డాలర్‌తో రూపాయి మారకం రేటు ఇప్పటికే తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. ఇటీవల ఒక దశలో 69 దాటి పోవడంతో ఆర్బీఐ రంగంలోకి దిగి ఫారెక్స్‌ నిల్వల నుంచి 2,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.37 లక్షల కోట్లు) ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి తోడు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర మళ్లీ మండుతోంది.

మున్ముందు బ్యారెల్‌ చమురు ధర 100 డాలర్లు దాటే ప్రమాదం ఉందనే హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. అదే జరిగితే ద్రవ్యలోటుతో పాటు కరెంట్‌ ఖాతా లోటూ అదుపు తప్పి డాలర్‌తో రూపాయి మారకం రేటు 72 స్థాయి వరకు నీరసించే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. క్రెడిట్‌ సూయిస్‌ అనే బ్రోకరేజ్‌ సంస్థ కూడా చమురు సెగతో వచ్చే మూడు నుంచి 12 నెలల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు 70కి చేరుతుందని ఒక నివేదికలో పేర్కొంది.
 
చమురు సెగతో ఈ ఆర్థిక సంవత్సరం కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్) జీడీపీలో 2.4 శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా. అదే జరిగితే రూపాయి మారకం రేటు మరింత బక్కచిక్కే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితిని అడ్డుకునేందుకు ఆర్బీఐకి మరో 2,000 కోట్ల డాలర్ల వరకు ఫారెక్స్‌ నిధుల అవసరం ఉంటుందని అంచనా. ప్రస్తుత ఫారెక్స్‌ నిల్వలు 9.3 నెలల దిగుమతుల అవసరాలకు సరిపోతాయి.

కరెంట్‌ ఖాతా లోటు పూడ్చడంతోపాటు, రూపాయి మారకం రేటు నిలబెట్టేందుకు ఆర్బీఐ 2,000 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే ఫారెక్స్‌ నిల్వలు 8.4 నెలల దిగుమతి అవసరాలకు మాత్రమే సరిపోతాయి. అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలించకపోతే ఫారెక్స్‌ నిల్వల మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే మళ్లీ ఎన్‌ఆర్‌ఐలకు బాండ్లు జారీ చేయడం ద్వారా 3,000 కోట్ల డాలర్ల నుంచి 3,500 కోట్ల డాలర్లు సమీకరించడం మినహా మరో మార్గం లేదని బీఓఎఎంఎల్ పేర్కొంది.