వాషింగ్టన్‌: కరోనాతో దేశీయంగా పెరిగిపోతున్న నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే హెచ్‌1బీ వంటి ఉద్యోగ వీసాలపై నిషేధం విధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. 

అమెరికాలో విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులకు భారీ షాక్‌ ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ మాధ్యమంలోకి మారితే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. లేదా నేరుగా తరగతులు బోధించే యూనివర్సిటీలకు మారాల్సి ఉంటుందని సూచించింది. 

ఈ మేరకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాలు ఎఫ్‌1, ఎం1పై అమెరికాలో ఉంటూ పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నవారు దేశం విడిచి వెళ్లాలి లేదా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి’ అని ఐసీఈ స్పష్టం చేసింది.

‘చట్టబద్ధంగా అమెరికాలో ఉండాలనుకుంటే, భౌతికంగా తరగతులను నిర్వహించే విద్యాసంస్థలకు బదిలీ కావాలి. లేని పక్షంలో ఇమ్మిగ్రేషన్‌ విభాగం తీసుకునే చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అలాగే ఫాల్‌ సెమిస్టర్‌ (సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు) కోసం పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించే విద్యాసంస్థల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నవారికి వీసాలు జారీ చేయబోం’ అని ఐసీఈ స్పష్టంచేసింది. 

ట్రంప్‌ సర్కార్ తాజా నిర్ణయంపై అమెరికాలోని విద్యావేత్తలు, చట్టసభల సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. విశ్వవిద్యాలయాల ప్రెసిడెంట్లు ప్రాతినిధ్యం వహించే ‘ది అమెరికన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌' (ఏసీఈ) కూడా ప్రభుత్వ నిర్ణయం భయానకమని విమర్శించింది. 

also read కస్టమర్లకు ఎస్‌బి‌ఐ షాకింగ్ న్యూస్: పరిమితి మించితే చార్జీల మోతే! ...

ట్రంప్‌ మూర్ఖపు నిర్ణయం వల్ల.. లక్షల మంది విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ప్రతిపక్ష డెమోక్రటిక్‌ నేతలు మండిపడుతున్నారు. ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయం క్రూరమైనదని అమెరికా సెనేటర్‌ ఎలిజబెత్‌ వారెన్‌ విమర్శించారు.

మరోవైపు, అమెరికాలో విద్యాలయాలను వెంటనే, ఖచ్చితంగా తెరువాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఇంకోవైపు, అమెరికా తాజా నిర్ణయంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 

ట్రంప్‌ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల వేల మంది భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా చైనా, భారత్‌, దక్షిణకొరియా, సౌదీ అరేబియా, కెనడా దేశాల వారే. 

స్టూడెంట్‌& ఎక్సేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఈవీపీ) గణాంకాల ప్రకారం.. 2017, 2018ల్ో చైనా నుంచి అత్యధికంగా 4,78,732 మంది, భారత్‌ నుంచి 2,51,290 మంది విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. 2017తో పోలిస్తే 2018లో భారతీయ విద్యార్థుల సంఖ్య 4,157 పెరిగింది. 

2019-20 ఆర్థిక సంవత్సరంలో అమెరికా విదేశాంగ శాఖ 3,88,839 ఎఫ్‌-1 వీసాలు, 9,518 ఎం-1 వీసాలను జారీచేసింది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషన్‌ స్కూల్‌ గణాంకాల ప్రకారం 2018-19 విద్యాసంవత్సరానికి అమెరికాలో దాదాపు 10 లక్షల మందికిపైగా విదేశీ విద్యార్థులున్నారు. 

విద్యా కోర్సుల్లో చేరడానికి వచ్చే విదేశీ విద్యార్థుల ద్వారా 2018లో అమెరికా అర్థిక వ్యవస్థకు దాదాపు 45 బిలియన్‌ డాలర్ల (రూ.3.3 లక్షల కోట్లు) ఆదాయం సమకూరింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ నిర్ణయం లక్షల మంది విద్యార్థులను అనిశ్చితిలోకి నెట్టింది. 

కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా దేశాలు అంతర్జాతీయ విమాన రాకపోకలపై నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు స్వదేశాలకు తిరిగి వెళ్లడంపై అయోమయం నెలకొంది.