డాలర్ ఆధిపత్యంపై గండి కొట్టడంతో పాటు విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడకుండా, రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చేందుకు, ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఇంటర్-డిపార్ట్‌మెంటల్ గ్రూప్ (IDB)కమిటీ పలు సిఫార్సులను చేసింది. ఈ కమిటీ చేసిన సిఫార్సులేంటో చూద్దాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇంటర్-డిపార్ట్‌మెంటల్ గ్రూప్ (IDB) ఇతర దేశాల్లో రూపాయి లావాదేవీలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి అనేక చర్యలను సిఫార్సు చేసింది. రాధా శ్యామ్ రాథో నేతృత్వంలోని కమిటీ రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ప్రోత్సహించేందుకు దీర్ఘకాలిక చర్యలను సూచించింది. ఈ కమిటీ నివేదికలో, కరెన్సీ అంతర్జాతీయీకరణ అనేది ఆ దేశ ఆర్థిక పురోగతి, ప్రపంచ వాణిజ్యంలో దాని స్థితిపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రూపాయి అంతర్జాతీయ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కాపిటల్ మార్కెట్లను బలోపేతం చేయాలని పేర్కొంది. రూపాయి అంతర్జాతీయీకరణకు క్యాపిటల్ అకౌంట్ కన్వర్టిబిలిటీ (సిఎసి) షరతు కాదని కమిటీ పేర్కొంది. రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చడానికి ప్రస్తుత మార్పిడి స్థాయి సరిపోతుందని పేర్కొంది.
2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత విధించిన ఆంక్షల తర్వాత, చాలా దేశాలు అప్రమత్తంగా ఉన్నాయని, పాశ్చాత్య దేశాలు తమపై ఇలాంటి ఆంక్షలు విధిస్తే, ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో అని ఆలోచించడం ప్రారంభించాయని నివేదికలో పేర్కొన్నారు.
ఈ నివేదిక ప్రకారం, ప్రపంచ పరిణామాలు, వాణిజ్యం, క్యాపిటల్ మార్కెట్ ఫ్లోస్ పరంగా ప్రపంచంలోని ఇతర దేశాలతో భారత ఆర్థిక వ్యవస్థ , కనెక్టివిటీ పెరగడం రూపాయితో సహా ఇతర కరెన్సీల అంతర్జాతీయ వినియోగానికి పునాది వేసింది.
"భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి అని అనేక సవాళ్ల మధ్య తన ఆర్థిక బలాన్ని ప్రదర్శించింది. ఫలితంగా రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారే అవకాశం ఉందని ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కమిటీ భావిస్తోంది" అని నివేదిక పేర్కొంది.
క్యాపిటల్ అకౌంట్ కన్వర్టిబిలిటీ, గ్లోబల్ వాల్యూ చైన్‌ల ఏకీకరణ, గిఫ్ట్ సిటీల స్థాపన మొదలైన అంశాలలో భారతదేశం ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది. విదేశీ వాణిజ్యం, మూలధన ఖాతా లావాదేవీలలో ఇన్‌వాయిస్, సెటిల్‌మెంట్‌లో రూపాయిని ఎక్కువగా ఉపయోగించడంతో రూపాయి, అంతర్జాతీయ ఉనికి పెరుగుతుంది.ఇటీవల భారత్ డాలర్ బదులుగా రూపాయి ద్వారా చెల్లింపులు చేసేందుకు రష్యా ముందుకు వచ్చింది. గతంలో ఇరాన్ సైతం రూపాయి ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు ప్రత్యేకమైన స్విఫ్ట్ విధానం అమల్లోకి తెచ్చింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, భారతీయ కరెన్సీలో ద్వైపాక్షిక వాణిజ్యం చేయడానికి బ్యాంకులను కూడా RBI అనుమతించింది.ఇది అంతర్జాతీయ రూపాయి హోదాను మరింత బలోపేతం చేస్తుందని నివేదికలో పేర్కొన్నారు.
కరెన్సీ అంతర్జాతీయంగా మారితే, ఆ దేశ ఎగుమతిదారులు, దిగుమతిదారులకు విదేశీ మారకపు హెచ్చుతగ్గుల ప్రమాదం బాగా తగ్గుతుంది. డాలర్ పై ఆధారపడటం ద్వారా దాని హెచ్చుతగ్గులు జరిగినప్పుడు వ్యాపారులు నష్టపోతున్నారు.
విదేశీ మారకపు ఒడిదుడుకుల ప్రమాదాన్ని తగ్గించడం, విదేశీ మారక నిల్వల అవసరం తగ్గడం వంటి ప్రయోజనాలు కరెన్సీ అంతర్జాతీయీకరణ లభిస్తాయని నివేదిక పేర్కొంది.
విదేశాల్లోని ప్రవాసుల కోసం రూపాయి బ్యాంకు ఖాతాలను తెరవడాన్ని ప్రోత్సహించాలి. మొత్తం ఐదు పనిదినాల్లో రోజుకు 24 గంటలు పనిచేసే భారతీయ రూపాయి మార్కెట్‌ను ప్రోత్సహించడం ద్వారా లావాదేవీలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లను బలోపేతం చేయడం కోసం ఇతర దేశాలతో భారతీయ చెల్లింపు వ్యవస్థలను ఏకీకృతం చేయాలని కమిటీ సూచించింది.
మసాలా బాండ్లపై (విదేశాల్లో జారీ చేయబడిన రూపాయి డినామినేటెడ్ బాండ్లు) 5 శాతం విత్‌హోల్డింగ్ పన్నును రెండు నుండి ఐదు సంవత్సరాలలో మధ్యకాలిక వ్యూహంగా తొలగించాలని కమిటీ సిఫార్సు చేసింది. అలాగే, సరిహద్దు వ్యాపార లావాదేవీల కోసం RTGS వినియోగాన్ని పెంచాలని సూచించింది.
