Women's Day 2022: స్త్రీలు కూడా పురుషులతో భుజం భుజం కలిపి ముందుకు సాగాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. మహిళలకు సంబంధించి మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏంటో తెలుసుకుందాం.

Women's Day 2022: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు మహిళల అభ్యున్నతి కోసం తోడ్పడుతున్నాయి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత కోసం మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటి ద్వారా దేశంలోని మహిళలు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు. స్త్రీలు కూడా పురుషులతో భుజం భుజం కలిపి ముందుకు సాగాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. మహిళలకు సంబంధించి మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏంటో తెలుసుకుందాం.

1. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana)
మహిళల కోసం మోడీ ప్రభుత్వం అత్యంత విజయవంతమైన పథకం ఏదైనా ఉందంటే అది ఉజ్వల పథకం అనే చెప్పాలి. ఈ పథకం 1 మే 2016న ఉత్తరప్రదేశ్‌లోని బలియా నుండి ప్రారంభించారు. ఈ పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన గృహిణులకు ఎల్‌పిజి సిలిండర్లను అందజేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలోని 8.3 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో కనెక్షన్‌పై చమురు కంపెనీలకు రూ.1600 సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీ సిలిండర్ భద్రత, ఫిట్టింగ్ ఛార్జీల కోసం కేటాయించారు. తమ పేర్లపై బిపిఎల్ కార్డులు ఉన్న కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వంట చెరకు, బొగ్గు పొయ్యి పొగ నుంచి మహిళలను విముక్తి చేయడమే ఈ పథకం ప్రాథమిక లక్ష్యం.

2. బేటీ బచావో బేటీ పఢావో పథకం (Beti Bachao Beti Padhao Scheme)
'బేటీ బచావో బేటీ పఢావో' పథకాన్ని 22 జనవరి 2015న హర్యానాలోని పానిపట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం లక్ష్యం ఆడపిల్లల లింగ నిష్పత్తిలో తగ్గుదలని ఆపడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం. ఈ పథకం భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో అమలు చేస్తున్నారు. గృహ హింస లేదా ఎలాంటి హింసకు గురైన మహిళలకు ఈ పథకం సహాయం చేస్తుంది. ఒక మహిళ అటువంటి హింసకు గురైనట్లయితే, ఆమెకు పోలీసు, న్యాయ, వైద్య వంటి సేవలు అందిస్తారు. బాధిత మహిళలు టోల్ ఫ్రీ నంబర్ 181కి కాల్ చేయడం ద్వారా సహాయం పొందవచ్చు.

3. సురక్షిత మాతృత్వ హామీ సుమన్ యోజన (Surakshit Matritva Aashwasan (SUMAN) Yojana)
ఈ పథకం కింద, 100% మహిళల ప్రసవం ఆసుపత్రులు లేదా శిక్షణ పొందిన నర్సుల పర్యవేక్షణలో జరుగుతుంది. తద్వారా ప్రసవ సమయంలో తల్లి, ఆమె బిడ్డ ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. సురక్షిత్ మాతృత్వ అస్యూరెన్స్ సుమన్ యోజన 10 అక్టోబర్ 2019న ప్రారంభించారు. ఈ పథకం కింద గర్భిణులు, నవజాత శిశువుల భద్రత కోసం ప్రభుత్వం ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తోంది. తల్లి, నవజాత శిశువుల మరణాలను నివారించడం ఈ పథకం యొక్క లక్ష్యం.

4. ఉచిత కుట్టు యంత్రం పథకం (PM Free Sewing Machine Scheme)
కుట్టు, ఎంబ్రాయిడరీలో ఆసక్తి ఉన్న మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం ద్వారా ప్రతి రాష్ట్రంలో 50,000 మందికి పైగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందిస్తోంది. 20 నుంచి 40 ఏళ్లలోపు మహిళలు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

5. మహిళా శక్తి కేంద్ర పథకం (Pradhan Mantri Mahila Shakti Kendra)
ఈ పథకాన్ని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2017 సంవత్సరంలో ప్రారంభించింది. మహిళల రక్షణ, సాధికారత కోసం ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద, సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామ-గ్రామాల్లోని మహిళలకు సాధికారత కల్పించడానికి, వారి సామర్థ్యాన్ని గుర్తించడానికి పని జరుగుతుంది. ఈ పథకం జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో పనిచేస్తుంది.

6. సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) 
సుకన్య సమృద్ధి యోజనను మోడీ ప్రభుత్వం 22 జనవరి 2015న ప్రారంభించింది. ఈ పథకం 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలు/బాలికల ఉన్నత విద్య, వివాహం కోసం. అంటే ఆడపిల్లల సురక్షిత భవిష్యత్తు కోసం ఇదో పొదుపు పథకం. మీరు ఏదైనా బ్యాంక్ మరియు పోస్టాఫీసును సందర్శించడం ద్వారా 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మీ కుమార్తె కోసం ఖాతాను తెరవవచ్చు. పథకం పూర్తయిన తర్వాత, మీరు ఎవరి పేరు మీద ఈ ఖాతాను తెరిచి ఉంటారో మొత్తం డబ్బు వారికి ఇస్తారు.