రష్యాపై అమెరికా విధిస్తున్న ఆంక్షల ప్రభావం భారత్‌పై ఎంత వరకూ ఉంటుంది. CAATSA చట్టం కింద అమెరికా ఆంక్షలు విధిస్తే,  భారత్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతోంది. S-400 missile defence system కొనుగోలుపై ఆంక్షలు ప్రభావం చూపుతాయా...

ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో జరిగిన ఓటింగ్‌లో భారత్ హాజరుకాలేదు. ఈ చర్య అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. రష్యా నుంచి S-400 ట్రయంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థను (S-400 missile defence system) కొనుగోలు చేసినందుకు భారత్‌పై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. అమెరికా వ్యతిరేకులపై ఆంక్షల చట్టం Countering America’s Adversaries Through Sanctions Act (CAATSA) కింద US ఈ నిషేధాన్ని విధించే వీలుంది. అమెరికా సీనియర్ దౌత్యవేత్త డొనాల్డ్ లూ బుధవారం సెనేట్ ఫారిన్ రిలేషన్స్ సబ్‌కమిటీ సభ్యులకు ఈ సమాచారాన్ని అందించారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడిందని విమర్శించేందుకు మార్చి 3న జరిగిన ఓటింగ్‌లో భారత్ పాల్గొనలేదు. ఓటింగ్‌కు దూరంగా ఉన్న 35 దేశాల్లో భారత్‌ కూడా ఉంది. దీంతో రిపబ్లికన్, డెమొక్రాట్లు ఇద్దరూ భారత్‌పై విమర్శలు గుప్పించారు.

అయితే CAATSA కింద భారత్‌పై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదని అమెరికా దౌత్యవేత్త తెలిపారు. "వాస్తవానికి భారత్ అమెరికా భద్రతా విషయాల్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ భాగస్వామ్యానికి మేం విలువ ఇస్తాం. రష్యా తీరుపై భారత్ పునరాలోచన చేస్తుందని, రష్యాను భారత్ మరింత దూరం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆశిస్తున్నాం" అని ఆయన అన్నారు.

మార్చి 3న ఐరాస భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్‌లో భారత్ తన తటస్థ వైఖరిని కొనసాగించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత వారం రోజుల వ్యవధిలో భారత్ మూడోసారి ఓటింగ్‌లో పాల్గొనలేదు. అయితే, భారతదేశం తటస్థంగా ఉన్నప్పటికీ, UN జనరల్ అసెంబ్లీ రష్యాకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. మరోవైపు భారత్‌కు చిరకాల ప్రత్యర్థి చైనా కూడా రష్యాకు మద్దతిస్తోంది.

అమెరికా ఆంక్షల చట్టం Countering America’s Adversaries Through Sanctions Act (CAATSA) అనేది US చట్టం. ఇందులోభాగంగా ఇరాన్, ఉత్తర కొరియా, రష్యాలపై అమెరికా ఆంక్షలు విధించింది. జూలై 27, 2017న సెనేట్ బిల్లును ఆమోదించింది.

భారతదేశంపై CAATSA ప్రభావం ఎంత వరకూ ఉంటుంది...
ఇటీవలి సంవత్సరాలలో భారత్‌తో అమెరికా తన సంబంధాలను బలోపేతం చేసుకుంది. ఆసియాలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు భారత్‌తో ఉన్న సంబంధాలకు అమెరికా ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే రష్యాతో రక్షణ ఒప్పందాలు ఉన్నప్పటికీ భారత్‌పై ఆంక్షలు విధించేందుకు అమెరికా జాప్యం చేస్తోంది. 

రష్యా నుంచి అత్యంత శక్తివంతమైన రష్యన్ ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను( S-400 missile defence system) భారత్ కొనుగోలు చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పరిగణిస్తున్నారు. అమెరికా వ్యవస్థకు బదులు రష్యా వ్యవస్థను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించడానికి ఇదే కారణం.

షెడ్యూల్‌ ప్రకారం భారత్‌కు S-400 ట్రయంఫ్ క్షిపణి ( S-400 missile defence system) విక్రయం కొనసాగుతుందని అమెరికాలోని భారత మాజీ రాయబారి అశోక్ సజన్‌హర్ ఇటీవల ఓ వార్తా సంస్థతో చెప్పారు. రష్యా నుంచి ఐదు ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం భారత్ 5.5 బిలియన్ డాలర్లు చెల్లించింది. ఒప్పందం 2018 అక్టోబర్‌లో ఖరారు అయ్యింది. 

CAATSA కింద అమెరికా భారత్‌పై ఆంక్షలు విధిస్తే?
ఇదే జరిగితే అమెరికా ఆంక్షలు విధించిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరిపోతుంది. చైనా తప్ప, ప్రపంచంలోని చాలా దేశాలు, ఈ దేశాలతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడానికి వెనకడుగు వేస్తాయి.