Asianet News TeluguAsianet News Telugu

Budget 2020:ఇప్పటి వరకు ఎంత మంది బడ్జెట్ ప్రవేశపెట్టారో తెలుసా...?

సంస్కరణల తర్వాతే ఆర్థిక మంత్రుల బడ్జెట్ ప్రసంగాలకు ప్రాధాన్యం పెరిగింది. తొలి భారత వార్షిక బడ్జెట్.. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ హయాంలో ప్రణాళికాబద్ధంగా రూపుదిద్దుకుంటే 1991-92 బడ్జెట్ తద్భిన్నంగా మార్కెట్లు లక్ష్యంగా తయారైంది. లైసెన్స్ రాజ్ కు తిలోదకాలివ్వడంలో మన్మోహన్ సింగ్ సఫలమయ్యారు.

the history of long and short budget speeches
Author
Hyderabad, First Published Jan 31, 2020, 12:28 PM IST

న్యూఢిల్లీ/ ముంబైః 70 ఏళ్ల గణతంత్ర భారతావనిలో ప్రతియేటా వార్షిక బడ్జెట్లను ప్రవేశ పెట్టడం సంప్రదాయం. ఆయా మంత్రులు తమ వెసులుబాటును బట్టి సుదీర్ఘంగా, అతి స్వల్ప ప్రసంగాలతో ముగించారు. భారతదేశ బడ్జెట్లకు కూడా ఓ హిస్టరీ ఉంది. 1950-51లో తొలి ప్రధాని పండిట్ నెహ్రూ అధ్యక్షుడిగా ప్రణాళికా సంఘం కనుసన్నల్లో తొలి ఆర్థిక మంత్రి జాన్ మథాయి బడ్జెట్ ప్రసంగాన్ని రూపొందించారు.

కానీ 1991-92లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంస్కరణల మాంత్రికుడు మన్మోహన్ సింగ్ ఆ సంప్రదాయానికి చరమగీతం పాడారు. ఆర్థిక మంత్రులంతా విభిన్న వ్యక్తిత్వం కల వారు. 1951 నుంచి ఇప్పటి వరకు 51 బడ్జెట్లను తొమ్మిది మంది ఆర్థిక మంత్రులు ప్రవేశపెట్టారు.

also read Budget 2020:పోఖ్రాన్ ఆంక్షల మధ్య: ఇళ్లు, పరిశ్రమలకు రాయితీలు...

సీడీ దేశ్ముఖ్ 1951-57 మధ్య ఐదు, మొరార్జీ దేశాయ్ (1959-64, 1967-70), వైబీ చవాన్ (1971-75), వీపీ సింగ్ (1985-87), మన్మోహన్ సింగ్ (1991-96), యశ్వంత్ సిన్హా (1998-2004), పీ చిదంబరం (1996-98, 2004-09, 2013-14), ప్రణబ్ ముఖర్జీ (1982-85, 2009-13), అరుణ్ జైట్లీ (2014-19) మధ్య బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 

the history of long and short budget speeches

వీరిలో 1991లో మన్మోహన్ సింగ్ తొలి బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. సుమారు 18,700 పదాలతో మన్మోహన్ సంస్కరణల సమ్మోహన ప్రసంగం సాగితే, తర్వాత సగటున యశ్వంత్ సిన్హా సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. ఆయన ప్రసంగం నిడివి 15,700 పదాలు మాత్రమే. ఇందిరాగాంధీ సగటున అతి తక్కువ పదాలతో ప్రసంగం ముగించేవారు.

మొరార్జీ దేశాయి పది వేల పదాలతో ప్రసంగాన్ని రూపొందించుకుంటే వైబీ చవాన్ 9,300 పదాలతో బడ్జెట్ ప్రసంగం తయారు చేసుకున్నారు. 1991లో దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణల బాట పట్టించిన తర్వాతే బడ్జెట్ ప్రసంగాలకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఆయా బడ్జెట్ ప్రసంగాలు కూడా చతురోక్తులతో సుదీర్ఘంగా సాగాయి.

ప్రస్తుతం విత్తమంత్రిగా నిర్మలా సీతారామన్ తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గతేడాది జూలైలో 11 వేల పదాలతో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. యశ్వంత్ సిన్హా, అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగాలు చాలా సంక్లిష్టంగా ఉండేవి. దేశ్ ముఖ్ (62), దేశాయి (61) బడ్జెట్ ప్రసంగాలు ఇంతకుముందు వాటికంటే సమగ్రంగా ఉండేవి. టైంతోపాటు ఆర్థిక మంత్రులు తమ ప్రసంగాలను మార్చేసుకునేవారంటే అతిశయోక్తి కాదు.

the history of long and short budget speeches

1950వ దశకంలో కరువు నుంచి రికవరీ దిశగా భారత్ అడుగులేస్తున్న సమయంలో దేశ్ముఖ్ బడ్జెట్ ప్రసంగాల్లో ఆహార కొరత, అధిక ధరలు, విదేశీ చెల్లింపులు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేవి. నెహ్రూ హయాంలో ‘ప్రణాళిక` అన్న అంశం ఆధిపత్యం వహించేది. లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యం సాగేది. సరళీకృత విధానాలు అమలులోకి వచ్చాక మార్కెట్ల పెరుగుదల ప్రస్తావనకు వచ్చేది. కానీ ఇటీవలి కాలంలో ‘స్టేట్` అనే పదం తిరిగి వచ్చి చేరింది. 

also read ఈరోజు నుంచి 3 రోజుల పాటు బ్యాంకులు బంద్...

గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ప్రతి బడ్జెట్ ప్రసంగంలోనూ ఎవర్ గ్రీన్ గా ఉండేది. కానీ 2004లో వాజపేయి సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్ విఫలమైన తర్వాత వ్యవసాయ రంగంపైనే ప్రధానంగా ఆర్థిక మంత్రులు బడ్జెట్లను కేంద్రీకరించి రూపొందించేవారు. 1998-2004 మధ్య పట్టణాభివృద్ధి కేంద్రంగా ద్రృష్టిని కేంద్రీకరించి బడ్జెట్లు రూపొందించారన్న విమర్శలు ఉన్నాయి. 

వ్యవసాయరంగంతోపాటు పేదరికం, హ్యూమన్ క్యాపిటల్ (హెల్త్, విద్య, పారిశుద్ధ్యం) పదాలు ప్రణబ్ముఖర్జీ, పీ చిదంబరం, అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగాల్లో ప్రస్తావనకు వచ్చేవి. పర్యావరణం, టెక్నాలజీ, లింగం, పట్టణ అంశాలు 21వ శతాబ్ధి బడ్జెట్ ప్రసంగాల్లో సర్వ సాధారణం అయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios