ఈ ఏడాది కేవలం 5 నెలల్లోనే టెక్ ప్రపంచం ఒక్కసారిగా కుదేలైంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు 61,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. 

టెక్ లేఆఫ్స్ 2025 : 2025 ప్రారంభం నుంచీ టెక్ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీల నుంచీ చిన్న సైబర్ సెక్యూరిటీ స్టార్టప్‌ల వరకూ ఉద్యోగాలను తగ్గించుకుంటున్న పరిస్థితి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఐదు నెలల్లోనే సుమారు 130 కంపెనీలు కలిపి 61,300 మందికి పైగా ఉద్యోగులను తీసిపారేశాయి. కానీ ఈ కోతలు మాంద్యం వల్ల కాదు, మార్కెట్ పడిపోవడం వల్ల కూడా కాదు. ఈ మార్పులకు ముగ్గురు అసలైన నాయ‌కులు ఉన్నారు—కోవిడ్ తర్వాత మారిన వాస్తవికత, AI టెక్నాలజీ రాక, ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకులు.

మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇప్పటికే 6,000 మందిని తొలగించింది. ప్రధానంగా మేనేజ్మెంట్ తరహా ఉద్యోగాలను కట్ చేసి, ప్రొడక్ట్ ఇంజినీరింగ్ వంటి కీలక విభాగాలపై దృష్టిపెడుతోంది. గూగుల్ విషయానికి వస్తే, మే నెలలో దాని గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ నుంచి 200 మందిని తొలగించింది. పైకి పెద్దగా బయటకు తెలియకుండానే, పిక్సెల్, ఆండ్రాయిడ్, క్రోమ్, గూగుల్ క్లౌడ్ విభాగాల్లో బలహీనంగా ఉన్న జట్లు కుదిస్తూ, AI ఆధారిత పునర్నిర్మాణానికి సిద్ధమవుతోంది.

అమెజాన్ కూడా విరామం తీసుకోకుండా దాని అభివృద్ధి వ్యూహాన్ని మార్చేసింది. అల్లెక్సా, జూక్స్ వంటి కొన్ని ప్రాజెక్టులను తగ్గిస్తూ, లాజిస్టిక్స్, AWSపై దృష్టిసారించడంతో సుమారు 100 మంది ఉద్యోగాలు కోల్పోయారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో క్రౌడ్‌స్ట్రైక్ 5 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. లాభాలపై దృష్టిసారించడమే ఇందుకు కారణం. అదే సమయంలో, ఐబిఎమ్ HR, అడ్మిన్ విభాగాల్లో వందలాది మందిని తొలగించి, కొత్తగా ప్రోగ్రామర్లు, సేల్స్ నిపుణులను నియమిస్తోంది.

ఈ ఉద్యోగ కోతల వెనక కారణాలు మూడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది, కోవిడ్ సమయంలో డిజిటల్ సేవల డిమాండ్ పెరగడంతో కంపెనీలు భారీగా ఉద్యోగాలను సృష్టించాయి. ఇప్పుడు ఆ వృద్ధి స్థిరంగా మారడంతో, ఆ ఉద్యోగాలను తగ్గించుకుంటున్నాయి. రెండవది, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు—అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు—కంపెనీలను లాభాల దిశగా ఆలోచించేలాచేశాయి. మూడవది, AI టెక్నాలజీ అభివృద్ధి. ChatGPT, Google Bard, Copilot వంటి టూల్స్ వల్ల కస్టమర్ సపోర్ట్ నుండి కోడింగ్ వరకు అనేక పనులు యంత్రాలే చెయ్యగలుగుతున్నాయి.

 కంపెనీలు ఇప్పుడు AI ఆధారంగా కొత్తగా పనిచేసే జట్లు రూపొందిస్తున్నాయి. దీని వల్ల కొత్త నైపుణ్యాలపై డిమాండ్ పెరుగుతోంది. ప్రత్యేకంగా AI, క్లౌడ్, డేటా అనాలిటిక్స్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉండొచ్చు.ఈ నేపథ్యంలో, టెక్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు మారుతున్న పరిణామాలకు తగినట్టు తమ నైపుణ్యాలను నవీకరించుకోవడం అత్యవసరం. AI టెక్నాలజీనే కొత్త ఉద్యోగ భవిష్యత్తుకు దారితీస్తుంది.