Multibagger stock : కరోనా ప్రపంచాన్ని వణికించింది. అంతేకాదు స్టాక్ మార్కెట్లను కూడా కుదిపేసింది. అయితే మార్కెట్లో ఇన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, టాటా గ్రూపునకు చెందిన ఓ స్టాక్ మాత్రం ఇన్వెస్టర్లకు పది కాదు ఇరవై కాదు ఏకంగా 1000 శాతం లాభాలను అందించింది. దీంతో ఆ స్టాక్ ఏంటా అని ఇన్వెస్టర్ల కన్ను దానిపై పడింది. ఈ స్టాక్ జైత్రయాత్రను ఓ సారి చూద్దాం. 

Multibagger Stock: మల్టీ బ్యాగర్ స్టాక్స్ కోసం ఇన్వెస్టర్లు నిరంతరం అన్వేషిస్తూనే ఉంటారు. చాలా మంది మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటే పెన్నీ స్టాక్స్ లో మాత్రమే ఉంటాయని అనుకుంటారు. కానీ ఒక్కోసారి లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా మల్టీ బ్యాగర్ లాభాలను అందిస్తాయి.

అంతేకాదు మంచి కార్పోరేట్ గవర్నెన్స్, మార్కెట్ డిమాండ్, ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉంటే కార్పోరేట్ దిగ్గజ కంపెనీల స్టాక్స్ కూడా మల్టీ బ్యాగర్లుగా మారుతుంటాయి. అలాంటి స్టాక్ Tata Elxsi, టాటా గ్రూపునకు చెందిన ఈ స్టాక్ ఇన్వెస్టర్ల పాలిట బంగారు బాతుగా నిలిచింది. సరిగ్గా కరోనా కాలంలోనే ఈ స్టాక్ మల్టీ బ్యాగరుగా అవతరించింది.

గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో మాంద్యం ఏర్పడింది. అయినప్పటికీ భారతీయ మార్కెట్ మాత్రం గత రెండేళ్లలో మంచి లాభాలను అందించింది. అంతేకాదు చాలా స్టాక్స్ మల్టీబ్యాగర్ స్టాక్‌లుగా కూడా మారిపోయాయి. మామూలు సమయం కన్నా కూడా ఈ కరోనా కాలంలో మల్టీ బ్యాగర్స్ స్టాక్స్ జాబితా పెద్దగా మారింది. అలాంటి స్టాక్స్ లో దిగ్గజ కార్పోరేట్ గ్రూపు టాటా సన్స్‌కు చెందిన Tata Elxsi షేర్ కూడా ఇన్వెస్టర్లకు మల్టీ బ్యాగర్ లాభాలను అందించింది. గత రెండేళ్లలో ఈ స్టాక్ రూ.639 నుంచి రూ.7045కి పెరిగింది.

గత నెలలో, టాటా అలెక్సీలో (Tata Elxsi Share Price) ధర రూ.7603 నుండి రూ.7045కి తగ్గింది. కానీ గడిచిన 6 నెలల్లో ఈ స్టాక్ (Tata Elxsi) రూ. 5009.30 నుండి 7045 కి చేరుకుంది. ఈ గ్యాప్ లో దాదాపు 40 శాతం పెరిగింది. 2022లో వార్షిక ప్రాతిపదికన, ఈ స్టాక్ 20 శాతం ఎగబాకి, ఒక్కో షేరుకు రూ.5893.65 నుంచి రూ.7045కి చేరుకుంది.

గత ఒక సంవత్సరంలో, టాటా అలెక్సీ (Tata Elxsi) షేరు 2696.95 నుండి 160 శాతం పెరిగి రూ.7045కి చేరుకుంది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 27 మార్చి 2020న, NSEలో రూ. 639.10 స్థాయిలో ఉంది. అక్కడ నుంచి ఈ స్టాక్ 9 మార్చి 2022 నాటికి రూ.7045కి చేరుకుంది. ఈ విధంగా, రెండు సంవత్సరాల వ్యవధిలో, ఈ స్టాక్ తన పెట్టుబడిదారులకు 1000 శాతం రాబడిని ఇచ్చింది.

అంటే ఒక ఇన్వెస్టర్ ఒక నెల క్రితం టాటా అలెక్సీ (Tata Elxsi)షేర్లలో లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి ఉంటే, అది ఇప్పుడు రూ.92,000 అయింది. కానీ ఎవరైనా ఒక ఇన్వెస్టర్ 2 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌ (Tata Elxsi)లో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు దాని విలువ 11 లక్షల రూపాయలుగా మారి ఉండేది.