Asianet News Telugu

బ్లాక్ చెయిన్‌ ప్రమోషన్.. పరిశోధనలకు నిధులు.. పటిష్ట నియంత్రణ


తెలంగాణను బ్లాక్ చెయిన్ క్యాపిటల్‌గా తీర్చి దిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకోసం బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఏర్పాటయ్యే స్టార్టప్‌లు, సంస్థలకు రాయితీ ధరలకు భూములివ్వడంతోపాటు  పరిశోధనలకు నిధులు కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వ బ్లాక్‌చైన్ ముసాయిదా విధానం చెబుతోంది. 

T'gana woos blockchain firms, startups, offers incentives
Author
Hyderabad, First Published May 27, 2019, 1:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: నూతన ఆవిష్కరణలకు, ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలకు ఆది నుంచి అగ్ర తాంబూలం ఇస్తున్నతెలంగాణ సర్కార్.. మరోసారి బ్లాక్‌చైన్ ముసాయిదా విధానంతో పెద్దపీట వేసింది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాలో రాయితీపై తక్కువ ధరలకే భూములు, పరిశోధనలకు నిధులను అందించడం, కట్టుదిట్టమైన నియంత్రణ, విధాన పరమైన సహాయ సహకారం అందిస్తామని పేర్కొంది. 

బ్లాక్‌చెయిన్ ఆధారిత సంస్థలు, స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పాలసీని ప్రభుత్వం రూపొందించింది. ఈ నెల 17న విడుదలైన ఈ డ్రాఫ్ట్ పాలసీ.. రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో బ్లాక్‌చైన్ సంస్థల ఏర్పాటుకు ఔత్సాహికులను ఆకట్టుకునేలా తగిన ప్రోత్సాహకాలతో ముందుకు వచ్చింది. 

భవిష్యత్ అంతా బ్లాక్‌ చెయిన్‌దేనని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. దానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మొదటి మూడేళ్లు సంస్థ కార్యకలాపాల నిమిత్తం ఏటా రూ.5 లక్షల వరకు లీజ్ రెంటల్స్ 25 శాతం రాయితీని ప్రతిపాదించింది. 

స్టార్టప్‌ల కోసం రాష్ట్ర జీఎస్టీలో 100 శాతం రీయింబర్స్‌మెంట్, 10 శాతం వరకు ఆర్‌అండ్‌డీ గ్రాంట్, మూడేళ్లు ఏటా పది బ్లాక్‌చైన్ స్టార్టప్‌లకు ఏకకాల గ్రాంట్‌గా రూ. 10 లక్షలను ఇవ్వనున్నది. అన్ని బ్లాక్‌చైన్ స్టార్టప్‌లకు ఆఫీస్ స్పేస్‌ను కల్పించనున్నది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ సంస్థల సహకారంతో బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నది. 

దేశంలోనే ఇది తొలి బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్ అవనుండగా, హైదరాబాద్ పరిధిలో ఇది కొలువుదీరేలా ముందుకెళ్తున్నది సర్కార్. గతేడాదే దీని ప్రారంభానికి టెక్ మహీంద్రాతో తెలంగాణ సర్కార్ ఒప్పందం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే.

అన్ని ప్రధాన బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ సంస్థల భాగస్వామ్యంతో ఇదో పెద్ద ఇంక్యుబేటర్‌గానే కాక పరిశోధనలు, నూతన ఆవిష్కరణల కోసం ప్రపంచ శ్రేణి సౌకర్యాలను కలిగి ఉండనున్నది. బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీలో పరిశోధనలకూ రాష్ట్ర ప్రభుత్వం నిధులను అందివ్వనున్నది. 

ఎంపిక చేసిన పలు ప్రధాన ఇనిస్టిట్యూట్లలో ఈ పరిశోధనలను నిర్వహించనున్నది. 2025 నాటికి బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ.. గ్లోబల్ జీడీపీలో 10 శాతాన్ని ఆక్రమిస్తుందన్నది అంచనా. 2030 నాటికి ఏటా 3 లక్షల కోట్ల డాలర్ల వ్యాపారాన్ని సృష్టిస్తుందన్నది నిపుణుల మాట.

దేశంలోనే తెలంగాణను బ్లాక్‌చెయిన్ రాజధానిగా నిలబెట్టేందుకు వచ్చిన ఈ పాలసీలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీఎల్) బ్లాక్‌చైన్ సంస్థలకు రాయితీపై భూ కేటాయింపులను జరుపనున్నది. 

బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సంస్థల ప్రోత్సాహానికి ఇప్పటివరకు అమలులో ఉన్న మార్గదర్శకాలనూ సరళతరం చేశారు. వార్షిక ఆదాయం, పెట్టుబడుల హామీలు, ఉద్యోగావకాశాలు వంటి వాటిల్లో రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) సంస్థలకు సూచించిన నిబంధనలను బ్లాక్‌చెయిన్ సంస్థల కోసం తాజా పాలసీలో సవరించారు. 

బ్లాక్‌ చెయిన్ అనేది ఓ కట్టుదిట్టమైన వ్యవస్థ అన్న విషయం తెలిసిందే. కీలక సమాచారం భద్రపరుచడం, ఆ డేటాను నిల్వ చేసి పంపిణీ మాత్రమే అయ్యేలా, మార్పులు లేకుండా కాపీ చేసుకునేందుకు అవకాశాన్నిస్తుంది. టాంపరింగ్‌కు వీల్లేకుండా సాయపడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios