ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ)’ ఖాతాదారులు డిసెంబర్ 31వ తేదీ నాటికి ప్రస్తుతం వినియోగిస్తున్న మాగ్నటిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డుల స్థానంలో చిప్‌ ఆధారిత కార్డులకు మారిపోవాలని సూచించింది. మాగ్నటిక్‌ స్ట్రిప్‌ స్థానంలో ఈఎంవీ(యూరో పే మాస్టర్‌కార్డు వీసా) చిప్‌ ఉన్న కార్డులను పొందాలని సూచించింది. మోసపూరిత లావాదేవీల నుంచి ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించేందుకు చిప్‌ ఆధారంగా పనిచేసే డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఇవ్వాలని అన్ని బ్యాంకులకు ఇంతకుముందే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ తన ఖాతాదారులను చిప్‌ కార్డులకు మారాలని కోరింది.  

మోసాల నివారణకు ‘చిప్’ కార్డ్
ఈఎంవీ చిప్‌ ఆధారంగా పనిచేసే కార్డులను వినియోగించే ఖాతాదారులు స్కిమ్మింగ్‌ వంటి మోసాల నుంచి బయటపడటానికి ఉపకరిస్తుంది. కార్డు దొంగతనానికి గురైనా పోయినా కూడా మోసాలు జరగకుండా అడ్డుకోవచ్చు. ‘ప్రియమైన ఖాతాదారులారా! మీరు మీ కార్డును మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మాగ్నటిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్‌ డెబిట్‌ కార్డుకు వచ్చే డిసెంబర్ నెలాఖరులోగా మీరు మారాల్సి ఉంటుంది. ఈ కార్డు పొందేందుకు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు.’ అని ఎస్బీఐ ట్వీట్‌ చేసింది.

జూన్ నాటికి చిప్ కార్డు పొందిన 28.9 కోట్ల మంది ఖాతాదారులు
ఈఎంవీ కార్డును ఉచితంగా అందజేయనున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ముగిసిన జూన్‌ నాటికి 28.9 కోట్లమంది ఖాతాదారులు చిప్‌ ఆధారంగా పనిచేసే ఎటీఎం కమ్‌ డెబిట్‌ కార్డును పొందారు. ఇప్పటికే పలు బ్యాంకులు సైతం మాగ్నటిక్‌ స్ట్రిప్‌ కార్డుల స్థానంలో ఈఎంవీ కార్డులను ఖాతాదారులకు అందిస్తున్నాయి. ఈఎంవీ కార్డుకు మారాల్సిన ఖాతాదారుల తమ ఖాతా కలిగిన బ్యాంకులో సంప్రదించాలని ఎస్బీఐ తెలిపింది.

బ్యాంకర్ల ‘పొదుపు’ మంత్రం
కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. అందులో భాగంగా ఆయా బ్యాంకులు విదేశాల్లోని తమ శాఖల మూసివేతకు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. ఈ మేరకు విదేశాల్లో సేవలందిస్తున్న దాదాపు 70 శాఖలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే మూసివేయడమో, హేతుబద్ధీకరించడమో చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

బ్యాంకుల 41 విదేశీ శాఖల్లో నష్టం ఇలా
2016-17లో ప్రభుత్వ రంగ బ్యాంకుల 41 విదేశీ శాఖలు నష్టాలు చవిచూశాయి. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐకి చెందిన తొమ్మిది శాఖలు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన 8, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన 7 శాఖలు వాటిలో ఉన్నాయి. విదేశాల్లో ఎస్బీఐకి 52, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 50, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 29 చొప్పున శాఖలు నిర్వహిస్తున్నాయి. యూకేలో గరిష్ఠంగా 32 శాఖలు నిర్వహిస్తుండగా.. హాంకాంగ్‌, యూఏఈలో పదమూడేసి, సింగపూర్‌లో 12 శాఖలు ఆయా బ్యాంకులకు ఉన్నాయి.

ఇలా బ్యాంకుల ‘విదేశీ శాఖల’ హేతుబద్దీకరణ
అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆప్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఇలా విదేశాల్లో శాఖలు నిర్వహిస్తున్న ఆయా బ్యాంకులు తమ శాఖల హేతుబద్ధీకరణకు ఒక పరస్పర అంగీకారంతో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది 35 శాఖలను ఆయా బ్యాంకులు మూసివేశాయి.