Swiggy IPO: ఈ ఏడాది మరో మెగా ఐపీవోకు రంగం సిద్ధం అవుతోంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కూడా బిలియన్ డాలర్ల లక్ష్యంగా ఐపీవో కోసం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్లను సైతం నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం చివర్లో కానీ, 2023లో కానీ ఐపీవో సిద్ధం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఈ సంవత్సరం కూడా IPOల సందడితో ప్రైమరీ మార్కెట్ కళకళలాడనుంది. గతేడాది ఐపీవో మార్కెట్ బంపర్ లిస్టింగ్ స్టాక్స్ తో కళకళలాడగా, ఈ ఏడాది కూడా అదానీ విల్మర్ లాంటి బంపర్ లిస్టింగ్ లతో కొనసాగుతోంది. ఓ వైపు LIC లాంటి మెగా ఐపీవోలకు సైతం గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ప్రైమరీ మార్కెట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఐపీవో కూడా సిద్ధం అవుతోంది. అదే Swiggy IPO, ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ అయిన స్విగ్గీ కూడా ఐపీవో ద్వారా నిధుల సేకరణ చేపట్టనంది.

గతేడాది జూలై 2021లో జొమాటో భారతీయ మార్కెట్లో మంచి లిస్టింగ్‌తో ప్రారంభమైంది, అయితే ఇటీవలి కాలంలో స్టాక్ భారీ క్షీణతను చూసింది. ఈ నేపథ్యంలో మరో ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ (Swiggy) తన మెగా IPO ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభించింది. 1 బిలియన్ డాలర్ల IPOగా రానున్న ఈ బృహత్ లిస్టింగ్ కోసం కంపెనీ ఇద్దరు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను నియమించిందనే వార్తలు వస్తున్నాయి. 

సోర్సెస్ ద్వారా అందిన సమాచారం ప్రకారం, Swiggy దాని ప్రతిపాదిత IPO కోసం ICICI సెక్యూరిటీస్, JP మోర్గాన్‌లను ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్లుగా నియమించింది. భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు వ్యాపార మద్దతుదారులుగా నియమించే వీలుంది. ఈ IPO ద్వారా స్విగ్గీ మార్కెట్ నుండి 1 బిలియన్ డాలర్లను సమీకరించే ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపింది. 

జూన్ నాటికి Swiggy తన IPO దరఖాస్తును SEBIకి ఫైల్ చేయవచ్చని, IPO ప్రారంభం 2022 చివరిలో లేదా 2023 ప్రారంభంలో జరగవచ్చని ప్రముఖ వార్తా సంస్థల ద్వారా లీక్స్ బయటకు వస్తున్నాయి. అయితే మార్కెట్ పరిస్థితులను బట్టి IPO ప్రారంభం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జొమాటో స్టాక్ ఇటీవలి కాలంలో భారీ క్షీణతను చూసింది. జొమాటో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొత్త తరం టెక్ ఆధారిత స్టాక్‌లు భారీగా నష్టపోతున్నాయి.

Swiggy కొత్త వ్యాపారంపై దృష్టి పెట్టడం, బలమైన నెట్ వర్క్ ఈ IPOకు కలిసి వచ్చే అంశాలు అని వార్తలు వస్తున్నాయి. ఈ IPO తాజా ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ మిశ్రమంగా ఉంటుందని సోర్సెస్ చెబుతున్నాయి. కంపెనీ తాజా ఇష్యూ నుండి సేకరించిన డబ్బును గ్రోత్ క్యాపిటల్‌గా ఉపయోగించనున్నారు. అదే సమయంలో, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా, కంపెనీ పెట్టుబడిదారులు తమ వాటాను పాక్షికంగా విక్రయించనున్నారు.

ఈ వార్తల నిర్ధారణ కోసం వార్తా సంస్థలు స్విగ్గీని సంప్రదించగా, ఇంకా ఎలాంటి ప్రతిస్పందన రాలేదు, అయితే ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి ICICI సెక్యూరిటీ నిరాకరించింది. JP మోర్గాన్ కూడా ఇంకా స్పందించలేదు.