Asianet News Telugu

వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకులకు లక్షల కోట్ల నష్టం: ఆర్‌బి‌ఐ

వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకులకు రూ.2 లక్షల కోట్ల నష్టమని అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో ఆర్బీఐ వివరణ ఇచ్చింది. రుణాలపై వడ్డీ వసూళ్లపై విధించిన మారటోరియంపై సుప్రీంకోర్టు స్పందించింది. దీన్ని రద్దు చేయొచ్చా?లేదా? వారంలోగా చెప్పాలని కేంద్రానికి సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. కరోనా కష్టకాలంలో ఈ అదనపు వసూళ్లేమిటని ప్రశ్నించింది. 
 

Supreme Court slams RBI on interest on loans in moratorium
Author
Hyderabad, First Published Jun 5, 2020, 10:06 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: మారటోరియం కాలంలో ఈఎంఐ (రుణాల నెలసరి చెల్లింపులు)లపై వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులకు దాదాపు రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆర్బీఐ తెలిపింది. మారటోరియంలో రుణాలపై వడ్డీ వసూలు తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ విచారణలో భాగంగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) స్పందనను అత్యున్నత న్యాయస్థానం గతంలో కోరిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్ని రకాల రుణాలపై ఆర్బీఐ ఆరు నెలల మారటోరియం అవకాశాన్ని బ్యాంకర్లకు ఇచ్చిన విషయం తెలిసిందే.

అంతేగాక అసలు మారటోరియం వ్యవధిలో వడ్డీని రద్దు చేయవచ్చా?.. లేక తప్పనిసరిగా వసూలు చేయాల్సిందేనా? అన్నది తేల్చిచెప్పాలని కేంద్ర ఆర్థికశాఖను జస్టిస్‌లు అశోక్‌ భూషణ్‌, సంజయ్‌ కిషన్‌ కౌల్‌, ఎంఆర్‌ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఆదేశించింది. 

ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం.. ఆలోగా సమాధానం చెప్పాలని కేంద్రం తరఫున ఈ కేసులో వాదిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహెతాకు సూచించింది. దీంతో ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చించి నివేదిస్తామని తుషార్‌ మెహెతా చెప్పారు. 

ఆర్బీఐ మారటోరియంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ఎన్నడూలేని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనూ లాభనష్టాల గురించి ఆలోచిస్తున్నారా? అని మండిపడింది. ఓ చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కుంటున్నారని విమర్శించింది.

also read  చేనేత వస్త్రాల కోసం ఇ-స్టోర్.. డిజైనర్ దుస్తులు, ఫ్యాషన్ వస్త్రాలు కూడా..

అందుకే ఈ కేసులో రుణాలపై వడ్డీ చెల్లింపులు ఉండరాదని, వడ్డీలపై వడ్డీలు వసూలు చేయరాదన్న రెండు అంశాలు తమ పరిశీలనలో ఉన్నట్లు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

అయితే మారటోరియం వ్యవధిలోనూ వడ్డీ వసూలుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనివల్ల రుణగ్రహీతలకు ఉపశమనం లభించకపోగా మరింత భారం పడుతున్నదని గజేంద్ర శర్మ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ తన ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రసాదించిన జీవించే హక్కును కోల్పోతున్నానని పిటిషన్‌లో ఈ ఆగ్రా వాసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ దత్త పిటిషనర్‌ తరఫున వాదిస్తున్నారు. 

ఈ కేసులో ఆర్బీఐ సమాధానం కోర్టు కంటే ముందుగా మీడియాకు చేరడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ‘మీడియాకు ముందుగా విడుదల చేసి ఆ తర్వాత కోర్టుకు సమర్పించారా?’ అన్ని ప్రశ్నించింది. మీడియాకు లీకులిచ్చి ఈ అంశాన్ని సెన్సేషన్‌ చేయాలని ఆర్బీఐ చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఒకానొక సందర్భంలో ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థికపరమైన అంశాలు ముఖ్యం కాదని స్పష్టం చేసింది.

మారటోరియంలో రుణాలపై వడ్డీ రద్దు సరికాదని సీఐఐ అధ్యక్షుడు, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఉదయ్‌ కొటక్‌ అన్నారు. ఓవైపు రుణాలపై మారటోరియంను కోరుకుంటూ.. మరోవైపు డిపాజిట్లపై అధిక వడ్డీని ఆశిస్తే ఎలా? అన్ని ప్రశ్నించారు. డిపాజిటర్లకు, రుణ గ్రహీతలకు మధ్య బ్యాంకులు వారధిగా ఉంటాయన్న ఆయన ఎవరో ఒకరి పక్షాన అవి ఉండలేవన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios