న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో విధించిన మారటోరియం కాలంలోనూ రుణాలపై వడ్డీ వసూలు చేయడంలో అర్థం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వడ్డీ వసూలును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. మారటోరియం వివాదంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

వడ్డీపై వడ్డీ వసూలు అంశంపై ఎలాంటి పురోగతి కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. రుణాలపై వడ్డీ నిర్ణయాన్ని సమీక్షించాలని కేంద్రం, రిజర్వు బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్బీఐ)కి సూచించింది.

మారటోరియం కాలంలో వడ్డీని నిషేధించేలా నూతన మార్గదర్శకాలు జారీ చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)ను కోరింది. ఈ కేసుపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది.

కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్ని రకాల రుణాల నెలసరి చెల్లింపులను ఆరు నెలలపాటు వాయిదా వేసుకునే అవకాశాన్ని అటు బ్యాంకర్లకు, ఇటు రుణ గ్రహీతలకు రిజర్వ్‌ బ్యాంక్‌ కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరు నెలల వాయిదాలపై అదనంగా వడ్డీ వసూలు చేస్తున్నారని, దీనివల్ల తమపై మరింత భారం పడుతున్నదని ఆగ్రా వాసి గజేంద్ర శర్మ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

also read ‘చైనా’పై వేటు వేటేయాల్సిందే.. 500 వస్తువులకు పైగా బహిష్కరణ...

దీన్ని విచారణకు అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. ఈ విషయంలో కేంద్రం స్పందిస్తున్న తీరుపట్ల జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేదని స్పష్టం చేసింది.

మారటోరియం అవకాశం ఇచ్చినప్పుడే దాన్ని ఎంచుకున్నవారి ప్రయోజనాల గురించి కూడా ఆలోచించాలని సుప్రీంకోర్టు తెలిపింది. కాబట్టి ఈ విషయంలో కేంద్రం తప్పక జోక్యం చేసుకోవాల్సిందేనన్నది. ఇది బ్యాంకులు, రుణ గ్రహీతలకు సంబంధించిన వ్యవహారం అని తప్పించుకోలేరంటూ సుప్రీంకోర్టు పేర్కొన్నది.

రుణ మారటోరియం పథకాన్ని సమీక్షించాలని కేంద్రం, ఆర్బీఐలకు సూచించింది. ఆగస్టు 31తో ఆర్బీఐ మారటోరియం గడువు తీరిపోతున్న సంగతి విదితమే. ఈ కేసులో కేంద్రం, ఆర్బీఐల తరఫున వాదిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహెతా వడ్డీని పూర్తిగా రద్దు చేయలేమని, బ్యాంకులు కూడా డిపాజిటర్లకు వడ్డీని చెల్లించాలన్న విషయాన్ని గుర్తుచేశారు.