Asianet News TeluguAsianet News Telugu

15 రోజుల్లో మొండి బాకీలు చెల్లించాల్సిందే.. ఆర్బీఐ ఆదేశాల అమలుకు సుప్రీం ఆర్డర్

 మొండి బకాయిల రికవరీ విషయంలో రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జారీ చేసిన దివాలా స్మృతి వర్తించకుండా మధ్యంతర ఉత్వరులు ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన విద్యుత్‌ సంస్థలకు కోర్టులో చుక్కెదురైంది. దివాలా స్మృతి వర్తించకుండా ఆదేశాలు జారీ చేయాలని విద్యుత్‌ కంపెనీలు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాయి. 

Stressed assets: Allahabad HC denies relief to power firms
Author
Allahabad, First Published Aug 28, 2018, 11:06 AM IST

అలహాబాద్/ న్యూఢిల్లీ: మొండి బకాయిల రికవరీ విషయంలో రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జారీ చేసిన దివాలా స్మృతి వర్తించకుండా మధ్యంతర ఉత్వరులు ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన విద్యుత్‌ సంస్థలకు కోర్టులో చుక్కెదురైంది. దివాలా స్మృతి వర్తించకుండా ఆదేశాలు జారీ చేయాలని విద్యుత్‌ కంపెనీలు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాయి. మొండి బకాయిలు చెల్లించని వారిపై ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే ముందుకు సాగాలని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఆర్బీఐ చట్టం సెక్షన్‌7 కింద 15 రోజుల్లో బకాయిలు చెల్లించని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దాదాపు 70 పెద్ద సంస్థలు తీసుకున్న మొండి బాకీల పరిష్కార గడువు సోమవారంతో ముగిసింది. మొండి బాకీలు తీసుకున్న సంస్థల నుంచి రూ.3.8 లక్షల కోట్ల మేర బ్యాంకులకు వసూలు కావాల్సి ఉంది. ప్రణాళిక రూపొందకపోతే, వీటిని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్సీఎల్టీ)కు నివేదించాలి. అందువల్ల సాధ్యమైన మేరకు ఖాతాలకు పరిష్కారం కనుగొనేందుకు బ్యాంకర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

దేశీయ బ్యాంకింగ్ రంగ ఉనికినే మొండి బకాయిలు ప్రశ్నార్థకం చేస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీల విలువ సుమారు రూ.11 లక్షల కోట్లయితే, ఇందులో రూ.8 లక్షల కోట్లకుపైగా మొండి బకాయిలు ప్రభుత్వ రంగ బ్యాంకులవే. అందునా విద్యుత్ సంస్థలే ఎక్కువగా రుణాలు తీసుకున్నాయి. కొన్ని ఈపీసీ, మరికొన్ని టెలికం సంస్థల బకాయిలూ ఉన్నాయి. 

ఈ క్రమంలోనే మొండి బాకీల సమస్యపై దృష్టి సారించిన ఆర్బీఐ.. భారీగా రుణాలు తీసుకుని చెల్లింపులు లేక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఖాతాలకు ఓ డెడ్‌లైన్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 1న ఈ మేరకు ఆర్బీఐ ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఆగస్టు 27తో 180 రోజుల గడువు ముగిసిపోయింది. మొండి బాకీలపై బ్యాంకర్లు నిర్ణయం తీసుకోనున్నా ఈ ఖాతాలు ఎన్సీఎల్టీకి చేరుతాయని తమ సర్క్యులర్‌లో చెబుతున్నది. ఇంకా గట్టిగా చెప్పాలంటే కఠిన నిబంధనల్నే తెచ్చింది. చెల్లింపుల్లో ఒక్కరోజు ఆలస్యమైనా మొండి బకాయిగానే పరిగణించాలని, 180 రోజుల్లోగా మొండి బాకీలపై తీర్మాన ప్రక్రియను ముగించాలని బ్యాంకులకు స్పష్టం చేసింది.

దీంతో బ్యాంకులు సమాలోచనల్లో పడ్డాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అంటేనే బాబోయ్ అంటున్నారు బ్యాంకర్లు. ఇందుకు కారణాలూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఎన్‌సీఎల్‌టీకి దివాలా ప్రక్రియలో భాగంగా వెళ్తే ఆశించిన ప్రయోజనం బ్యాంకులకు దక్కలేదు మరి. తమకు రావాల్సిన బకాయిల్లో భారీ ఎత్తున కోల్పోవాల్సి వస్తున్నది. అలోక్ ఇండస్ట్రీస్ వంటి కేసుల్లో 86 శాతం సొమ్మును బ్యాంకులు వదులుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో ఎన్సీఎల్టీ వెలుపలే సమస్య పరిష్కారానికి బ్యాంకులు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలు, మోసాలు, కుంభకోణాలతో బ్యాంకులు పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. కానీ మొండి బాకీల విషయంలో ఆర్బీఐ కఠిన వైఖరిని అవలంభిస్తుండటం, ఎన్సీఎల్టీకి చేరితే భారీగా నష్టపోవాల్సి వస్తుండటం బ్యాంకులకు గుబులు పుట్టిస్తున్నది. 

రూ.17,000 కోట్ల విలువైన సుమారు 8 విద్యుత్ ప్రాజెక్టులను మొండి బాకీలుగా తీర్మానించాలని బ్యాంకులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు గత వారం ఎస్‌బీఐ ఎండీ అరిజిత్ బసు తెలిపారు. కనీసం 60 ఖాతాలు సెప్టెంబర్ ఆరంభం నుంచి దివాలా ప్రక్రియను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుంజులాయిడ్, రిలయన్స్ డిఫెన్స్, బజాజ్ హిందుస్థాన్, జీటీఎల్ ఇన్‌ఫ్రా, గీతాంజలీ జెమ్స్ తదితర సంస్థలు వీటిలో ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios