Asianet News TeluguAsianet News Telugu

వరుసగా రెండో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో స్టాక్ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. వరుసగా రెండో రోజు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

Stocks in the news: Bharti Airtel, YES Bank, Infosys, Reliance Infra and Allahabad Bank
Author
Hyderabad, First Published Jan 10, 2020, 12:30 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ముంబై: ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశం అమెరికా.. చమురు ఉత్పత్తి పరంగా బలమైన ఇరాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తేలికపడడం వరుసగా రెండో రోజు సూచీలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 77 పాయింట్ల లాభంతో 41,530 వద్ద బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 12,237 పాయింట్ల వద్ద సాగుతున్నాయి. 

ఇన్ఫోసిస్, భారతీ ఇన్ ప్రా టెల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ నష్టాలను నమోదు చేస్తున్నాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ శుక్రవారం మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నది. సైరస్ మిస్త్రీని చైర్మన్ గా పున: నియమించాలంటూ ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టాటా సన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించనున్నది. 

also read  ఎస్‌బి‌ఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.... ఇంటి నిర్మాణం.. పేరుతో కొత్త పథకం

ట్రంప్ శాంతి ప్రకటన చేయడంతో ప్రపంచవ్యాప్తంగా గురువారం ఈక్విటీ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. గత వారం ఇరాక్‌లో ఇరాన్‌ సైనిక కమాండర్‌ సులేమానీని అమెరికా దళాలు చంపేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆ నష్టాల్లో అధిక శాతం మేర గడిచిన రెండు రోజుల్లో మన ఈక్విటీ మార్కెట్లు తిరిగి పూడ్చుకున్నాయి.

ప్రతీకార చర్య కింద ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు చేసినా కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా తీసుకోకపోవడం, తాము శాంతినే కోరుకుంటున్నామని చెప్పడం పరిస్థితిని కుదుటపరిచింది. ఫలితంగా గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 635 పాయింట్ల లాభాన్ని (1.55 శాతం) నమోదు చేసుకుంది. 41,482 పాయింట్ల గరిష్టస్థాయిని తాకి... చివరకు 41,452 వద్ద క్లోజయింది. 

అటు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 191 పాయింట్లు పెరిగి (1.58 శాతం) 12,216 వద్ద క్లోజయింది. ట్రంప్‌ ప్రకటనతో బుధవారం క్రితం రాత్రి యూఎస్‌ మార్కెట్లు కూడా లాభాలను నమోదు చేశాయి. తమ ఉపాధ్యక్షుడు లీ వచ్చే వారం వాషింగ్టన్‌ను సందర్శిస్తారని, అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తారంటూ చైనా చేసిన ప్రకటన కూడా ఇన్వెస్టర్లను రిస్క్‌ తీసుకునే దిశగా ప్రోత్సహించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

Stocks in the news: Bharti Airtel, YES Bank, Infosys, Reliance Infra and Allahabad Bank

అధికంగా లాభపడిన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంకు ముందు వరుసలో ఉండగా, తర్వాత ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌బ్యాంకు, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉన్నాయి. కాగా టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్, ఎన్‌టీపీసీ, సన్‌ ఫార్మా షేర్లు నష్టపోయాయి

బీఎస్‌ఈలో రియల్టీ, ఆటో, బ్యాంకెక్స్, ఇండస్ట్రియల్స్, ఫైనాన్స్, ఎనర్జీ సూచీలు లాభపడ్డాయి. ఐటీ సూచీ నష్టపోయింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1.55 శాతం వరకు పెరిగాయి. మరోవైపు షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్‌ 2.31 శాతం వరకు గరిష్టంగా లాభ పడ్డాయి. యూరోప్‌ మార్కెట్లు కూడా సానుకూలంగా ట్రేడింగ్‌ ఆరంభించాయి.

గురువారం నాటి మార్కెట్‌ ర్యాలీ పుణ్యమా అని ఒక్కరోజే ఇన్వెస్టర్ల వాటాల విలువ రూ.2.25 లక్షల కోట్ల మేర వృద్ధి చెందింది. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ బుధవారం ముగింపుతో పోలిస్తే.. రూ.2,25,554 కోట్లు పెరిగి మొత్తం రూ.1,57,06,155 కోట్లకు చేరుకుంది.

Stocks in the news: Bharti Airtel, YES Bank, Infosys, Reliance Infra and Allahabad Bank

‘‘వృద్ధిని పైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బడ్జెట్లో చర్యలను ప్రకటిస్తుందన్న అంచనాలు, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు చల్లారడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించే విధానపరమైన చర్యలు, నిర్ణయాలు దీర్ఘకాలంలో ఈక్విటీలకు ప్రయోజనం కలిగిస్తాయి. అయితే, స్వల్పకాలానికి మాత్రం మార్కెట్లను మూడో త్రైమాసికం ఫలితాలు నిర్ణయిస్తాయి. తక్కువ బేస్‌(క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న గణాంకాలతో పోలిస్తే) కారణంగా డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాల్లో కొంత పురోగతి ఉండొచ్చు’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ విభాగం అధిపతి వినోద్‌ నాయర్‌ తెలిపారు. 

‘‘ఈక్విటీ మార్కెట్లకు అసాధారణ రోజు. ఒకటిన్నర శాతానికి పైగా లాభపడ్డాయి. చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడడం మరింత ఉత్సాహాన్నిచ్చింది’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు.   

తాము యుద్ధాన్ని కాంక్షించడంలేదంటూ అమెరికా–ఇరాన్‌ నుంచి వెలువడుతున్న సంకేతాలతో తిరిగి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను  బంగారం, క్రూడ్‌ల నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు కనబడుతోంది. దీంతో అంతర్జాతీయంగా పసిడి, క్రూడ్‌ ధరలు గురువారమూ తగ్గాయి. ఈ ధోరణి భారత్‌ రూపాయి బలోపేతం కావడానికీ దోహదపడింది.  

also read ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం... ఇండియాని భయపెడుతున్న చమురు ధరలు

బంగారం  ఔన్స్‌ (31.1గ్రా) ధర అంతర్జాతీయ మార్కెట్‌ నైమెక్స్‌లో గురువారం  రాత్రి 10.30 గంటల సమయానికి క్రితం ముగింపుతో పోల్చిచూస్తే, 10 డాలర్ల నష్టంలో 1,550 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. బుధవారం గరిష్టంతో పోల్చితే ఇది 62 డాలర్లు తక్కువ. ట్రేడింగ్‌ ఒక దశలో ఈ ధర 1,541 డాలర్ల కనిష్టాన్నీ తాకింది.  

నైమెక్స్‌ క్రూడ్‌ పావు శాతం తగ్గుదలతో 59.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.డాలర్‌తో రూపాయి మారకం విలువ 48 పైసలు లాభపడి 71.21 వద్ద ముగిసింది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో 10 గ్రాముల పసిడి ధర రూ.377 నష్టంతో రూ.39,733 వద్ద ట్రేడవుతోంది.

‘‘యూఎస్‌–ఇరాన్‌ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు  ఒక్కసారిగా కనుమరుగయ్యాయి. దీంతో స్టాక్‌ మార్కెట్లు బలం చూపిస్తున్నాయి. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్‌ బలంగా ముగియడం ఆసియాలోనూ కొనుగోళ్లకు దారితీసింది. ఇప్పుడు యూరోప్‌లోనూ బుల్లిష్‌ సెంటిమెంట్‌ కనిపిస్తోంది. యూఎస్, ఇరాన్‌ ఇప్పటికీ ఒకరిపట్ల మరొకరు విభేదంగా ఉన్నా, వివాదం ముదరకపోతే మంచి వాతావరణం కొనసాగే అవకాశమే ఉంటుంది’’ అని బ్రిటన్‌కు చెందిన సీఎంసీ మార్కెట్స్‌ అనలిస్ట్‌ డేవిడ్‌ మాడెన్‌ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios