Asianet News TeluguAsianet News Telugu

డేటాతో యూజర్లకు చేరువైన ‘జియో’: 5జీకి సన్నాహాలు

సెల్‌లో వీడియో స్పీడ్ కదిలితేనే తమకు ఆదాయం లభిస్తుందని టెలికం సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. దీంతో డేటా వేగం పెంపుపై టెలికాం సంస్థల పోటాపోటీగా ముందుకు వెళుతూ అత్యధికులకు చేరువ కావడంపైనా దృష్టి సారించాయి.
 

State of Indian Telecom: Analysing The Opensignal Report
Author
Mumbai, First Published May 9, 2019, 9:41 AM IST

న్యూఢిల్లీ: స్మార్ట్‌ ఫోన్‌లతో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి యాప్‌ల నుంచి వచ్చే చిత్రాలు, వీడియోలు తిలకించే వారి సంఖ్య ఇటీవల ఎక్కువైంది. వేగంగా డేటా లభిస్తే అదే స్థాయిలో అంతరాయం లేకుండా వీక్షించొచ్చు. కనుక డేటా వేగం కీలకం అవుతోంది.

రిలయన్స్‌ జియో 4జీ డేటా వేగం బాగా ఉండటం, అందుబాటు ధరల వల్లే, రెండున్నరేళ్లలోనే 30 కోట్లకు పైగా చందాదార్లను సాధించింది. వినియోగదారుడి నుంచి లభించే సగటు మొత్తంలోనూ జియో వాటా అధికంగా ఉంటోంది. విపణిలో తమ వాటా నిలుపుకునేందుకు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కూడా 4జీ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో వాటి పరిస్థితీ మెరుగవుతోంది.

మొబైల్‌లో డేటా అంటే 4జీ అన్నంతగా పరిస్థితి మారిపోయింది. 2జీ, 3జీ డేటా కనెక్షన్లు ఉన్నా, స్మార్ట్‌ ఫోన్‌లో వాటిని వినియోగించే వారి సంఖ్య తగ్గిపోతోంది. కేంద్రప్రభుత్వం కనుక స్పెక్ట్రమ్‌ మంజూరు చేస్తే, ప్రైవేటు సంస్థలతో 4జీలోనూ బీఎస్‌ఎన్‌ఎల్‌ పోటీ పడుతుంది.

3జీ సేవలతో పోలిస్తే ప్రస్తుతం 4జీ డేటా వేగం అధికంగానే ఉన్నా, గతంతో పోలిస్తే మాత్రం తగ్గిందన్నది వినియోగదారుల మాట. ముఖ్యంగా వీడియోల డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ వేగాన్ని పరిశీలిస్తే, గతంలోకి, ఇప్పటికి ఈ తేడా మరింత ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో 4జీ నెట్‌వర్క్‌ విస్తరణతోపాటు 5జీ సేవలను ప్రారంభించేందుకు టెలికాం సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఇందుకు అవసరమైన భారీ పెట్టుబడుల సమీకరణకు ప్రయత్నిస్తున్నాయి. 

టెలికం సంస్థలు ఈ ఏడాది రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు పెట్టవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ జెఫ్రీస్‌ పేర్కొంది. రూ.25,000 కోట్ల నిధుల సమీకరణ కోసం వొడాఫోన్‌ ఇండియా రైట్స్‌ ఇష్యూ ముగియగా, ఎయిర్‌టెల్‌ కూడా ఇంతే పరిమాణ ఇష్యూను నిర్వహిస్తోంది.

అంతర్జాతీయంగా మరే దేశంలోనూ లేనంతగా, అత్యధిక జనాభాకు చేరువైన నెట్‌వర్క్‌ రిలయన్స్‌ జియో 4జీనే. అమెరికాలో 90 శాతం మందికి, ఐరోపా-జపాన్‌లలో 95 శాతం మందికి నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చిన సంస్థలు ఉన్నా, 97.5 శాతం మందికి చేరువైన తొలి సంస్థ జియోనే. 

మరింతమందికి చేరువయ్యేందుకు, పోటీ సంస్థల కంటే ముందుగా 5జీ సేవలను దేశంలో ప్రవేశ పెట్టేందుకు రిలయన్స్ జియో సన్నాహాలు చేసుకుంటోంది. వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌ విలీనం ద్వారా 38.7 కోట్ల చందాదార్లతో అతిపెద్ద సంస్థగా ఆవిర్భరించిన వొడాఫోన్‌ ఐడియా దేశంలోని 80 శాతం మందికి చేరువయ్యేలా 4జీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది.

ప్రస్తుతం మాత్రం రెండు సంస్థలు (వొడాఫోన్, ఐడియా) వేర్వేరు బ్రాండ్లపైనే సేవలందిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ కూడా 4జీ నెట్‌వర్క్‌ పటిష్టతపై దృష్టి సారించి, డేటా డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ వేగాలను మెరుగుపరుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ విస్తృతిలో జియో అగ్రస్థానంలోనే ఉంది. సెల్‌ టవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోవడం ద్వారా ఎయిర్‌టెల్‌ పరిస్థితి మెరుగైందని నివేదిక పేర్కొంది. 

డేటా డౌన్‌లోడ్‌ - అప్‌లోడ్‌ వేగంతో పాటు ఏదైనా వెబ్‌సైట్‌ను అత్యంత తక్కువ సమయంలో ఓపెన్‌ చేయగలగడం (లేటెన్సీ ఎక్స్‌పీరియన్స్‌)లో ఎయిర్‌నెట్‌ నెట్‌వర్క్‌ ముందుందని తెలిపింది. 3జీ నెట్‌వర్క్‌ అయినా, బీఎస్‌ఎన్‌ఎల్‌ చందాదార్లు కూడా లేటెన్సీ పరంగా మెరుగ్గానే ఉన్నారు.

జియో ద్వారా 97.2 శాతం, ఎయిర్‌టెల్ నుంచి 82.6 శాతం, ఐడియా నుంచి 78.4 శాతం, వొడాఫోన్‌ ద్వారా 71.0 శాతం మంది వినియోగదారులకు 4జీ నెట్‌వర్క్‌ చేరువైంది. ఇక డేటా డౌన్ లోడ్  (ఎంబీపీఎస్‌) పరంగా ఎయిర్‌టెల్ నుంచి 11.3,  జియో నుంచి 7.3,  వొడాఫోన్‌ ద్వారా 3.6, ఐడియా ద్వారా 3.5, బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 2.8 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ అవుతోంది.

ఇంకా ఎయిర్‌టెల్‌లో అప్ లోడ్ వేగం 3.8 ఎంబీపీఎస్ కాగా, జియోలో 1.6, ఐడియాలో 1.4, వొడాఫోన్‌లో 1.3, బీఎస్‌ఎన్‌ఎల్‌లో 0.9 ఎంబీపీఎస్ గా నమోదైంది. ఎయిర్‌టెల్ ద్వారా 58.5 మిల్లీ సెకన్లలో సమాచారం వెబ్ సైట్లకు చేరుతోంది. అదే జియో నుంచి  64 మిల్లీ సెకన్లు, బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా 87.2, ఐడియా ద్వారా 100.2, వొడాఫోన్‌ ద్వారా 104 మిల్లీ సెకన్లలో వైబ్ సైట్లకు డేటా చేరుతోంది. 

స్మార్ట్‌ఫోన్లలో వీడియోలు చూడటం పెరుగుతున్నందున, తమ చందాదార్లకు ప్రత్యేక కంటెంట్‌ అందించడంపైనా నెట్‌వర్క్‌ సంస్థలు దృష్టి సారించాయి. ఇందువల్ల డేటా వినియోగం, తద్వారా అధిక ఆదాయం పొందవచ్చనేది సంస్థల వ్యూహం.

దేశీయంగా 4జీ సేవలు అందుబాటులోకి తేవడంలో అత్యధికులకు చేరువైన నెట్‌వర్క్‌గా జియో నిలిచిందని లండన్‌ కేంద్రంగా పనిచేసే మొబైల్‌ అనలిటిక్స్‌ అంతర్జాతీయ సంస్థ ఓపెన్‌ సిగ్నల్‌ నివేదించింది. ఈ సంస్థ గత డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు అధ్యయనం నిర్వహించి, నివేదిక రూపొందించింది. 

ఏదైనా వెబ్‌సైట్‌కు వేగంగా చేరగలుగుతున్న నెట్ వర్క్ జియో మాత్రమేనని ఓపెన్ సిగ్నల్ చెబుతోంది. అయితే ఎయిర్ టెల్ నెట్ వర్క్ పరిధిలోనే మెరుగ్గా వీడియో వీక్షించొచ్చు. ఎయిర్ టెల్ లో డౌన్ లోడ్ వేగం పెరుగుతుండగా, ఐడియా నెట్ వర్క్ అప్ లోడ్ లో వేగాన్ని నమోదు చేసింది. 

దేశీయంగా జియో 97.5 శాతం మందికి 4జీ సేవలను అందుబాటులోకి తేగా ఎయిర్‌టెల్ నెట్ వర్క్ పరిధిలో 85.6 శాతం మంది ఆ సేవలు పొందుతున్నారు. ఇంకా ఐడియా 77 శాతం మందికి, వొడాఫోన్ 76.3 శాతం మందికి 4జీ సేవలందిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios