న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి తాత్కాలికంగా సేవలు నిలిపేయడంతో జెట్ ఎయిర్‌వేస్ సంస్థలోని దాదాపు 20వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తమను ఆదుకోవాలంటూ కన్నీటిపర్యంతమవుతూ శాంతి ర్యాలీలు చేశారు. ఈ నేపథ్యంలో మరో దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ వారికి భరోసా కల్పించింది.

ఉద్యోగాలు కోల్పోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లు, ఉద్యోగులకు బడ్జెట్ విమానయాన సంస్థ అయిన స్పైస్‌ జెట్‌.. తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా అనేక మంది ఉద్యోగులను నియమించుకుంటామని వెల్లడించింది.

ఉద్యోగాలు కోల్పోయిన జెట్ ఎయిర్‌వేస్‌ సిబ్బందికి నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని స్పైస్‌జెట్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ సింగ్‌ వెల్లడించారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ బుధవారం నుంచి విమానయాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. 

కాగా, ఇప్పటికే 500 మందికి పైగా జెట్ ఎయిర్‌వేస్ సిబ్బందిని తీసుకున్నామని, ఇందులో 100మంది పైలట్లు కూడా ఉన్నారని తెలిపింది. అంతేగాక, త్వరలో మరిన్ని విమానాలు కొనుగోలు చేస్తామని స్పైస్‌జెట్‌ వెల్లడించింది.

కేంద్రం అనుమతిస్తే దేశీయం(ముంబై-ఢిల్లీ మధ్య)గా 24 కొత్త సర్వీసులను నడుపుతామని గురువారం స్పైస్‌జెట్‌ ప్రకటించింది. ఈ ప్రక్రియ సజావుగా పూర్తయితే.. ఏప్రిల్‌ 26 నుంచి మే 2 మధ్య కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 

హాంగ్‌కాంగ్, జెడ్డా, దుబాయ్, కొలంబో, ఢాకా, రియాద్, బ్యాంగ్‌కాక్, ఖాట్మాండ్‌లకు ముంబై నుంచి డైరెక్ట్ విమానాలను నడుపుతామని ఇటీవల స్పైస్ జెట్ ప్రకటించింది. మే చివరి వారం నుంచి ఈ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టి ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని స్పైస్‌జెట్ తెలిపింది.