హైదరాబాద్‌: వ్యాపార విస్తరణలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని కొనుగోలుదార్లను ఆకర్షించేందుకు ఇ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ సిద్ధమవుతోంది. ఆ ప్రాంతాల నుంచి విక్రేతల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నామని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కార్పొరేట్‌ ఎఫైర్స్‌) రజ్నీశ్‌ వాహి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 50వేల మంది కొత్త విక్రేతలు తమ వద్ద నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 లక్షల మంది విక్రేతలు తమ వద్ద వస్తువులను విక్రయిస్తున్నట్లు తెలిపారు. 

తృతీయ శ్రేణి పట్టణాలపై స్నాప్‌డీల్‌ దృష్టి
స్థానికుల అభిరుచులకు అనుగుణంగా తమ వ్యాపార వ్యూహాం అమలు చేయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు స్నాప్ డీల్ కార్పొరేట్‌ ఎఫైర్స్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రజ్నీశ్‌ వాహి చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ వస్తువుల కొనుగోలుకు వెచ్చిస్తున్న మొత్తం 80000 కోట్ల డాలర్ల మేరకు ఉందనీ, 2025 నాటికి 2లక్షల కోట్లకు చేరుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. 

ఏపీ, తెలంగాణ మార్కెట్లు కీలకం అన్న స్నాప్ డీల్
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్లు తమకు ఎంతో కీలకంగా ఉన్నాయనీ..ఇక్కడ నుంచి 25,000 మంది విక్రేతలు తమ వద్ద నమోదైనట్లు స్నాప్ డీల్ కార్పొరేట్‌ ఎఫైర్స్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రజ్నీశ్‌ వాహి చెప్పారు. కడప నుంచి వ్యాపారులు బీపీ మెషిన్లు, థర్మామీటర్లను ఎక్కువగా అమ్ముతుండగా, కర్నూలు నుంచి స్మార్ట్‌వాచీలు, బ్లూటూత్‌ పరికరాలు, కేబుల్‌ ఛార్జీలు, స్పీకర్లలాంటివి, హైదరాబాద్‌ నుంచి నమోదైన విక్రేతలు కంప్యూటర్లు, వాటి ఉపకరణాలను అధికంగా విక్రయిస్తున్నారని వివరించారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా స్నాప్ డీల్ సేవలు
చిన్న ఫ్యాన్లు, సౌందర్య సాధనాలు, చెప్పులు, వంట సామాగ్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కొంటున్నారని స్నాప్ డీల్ కార్పొరేట్‌ ఎఫైర్స్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రజ్నీశ్‌ వాహి పేర్కొన్నారు. దాదాపు 600 విభాగాలు తమ వద్ద లభిస్తున్నాయనీ, నెలకు 7.7కోట్ల మంది తమ వెబ్‌సైటును సందర్శిస్తున్నారని చెప్పారు.