న్యూఢిల్లీ: తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌లోఆర్థిక మంత్రిగా రెండోసారి (2020-21 ఆర్థిక సంవత్సరానికి) బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. గతేడాది లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత జూలైలో మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. 

ఈసారి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి ప్రవేశపెట్టనున్నారు. ఉల్లి ధరల నుంచి ఆర్థిక మందగమనం వరకు ఆమెకు సవాళ్లు విసురుతున్నాయి. రెండోసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న తొలి మహిళా ఆర్థిక మంత్రి ఆమే కావడం ఒక రికార్డు. రక్షణ మంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళ కూడా నిర్మలా సీతారామనే.

ప్రస్తుతం మోదీ మంత్రి వర్గంలో మహిళా మంత్రుల్లో అత్యంత సీనియర్‌ కూడా సీతారామనే కావడం విశేషం. గతేడాది ఆమెను ఫోర్బ్స్‌ ప్రపంచంలోనే 34వ అత్యంత శక్తిమంతమైన మహిళగా ప్రకటించింది. అంతకుముందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఆర్థిక మంత్రిగా బడ్జెట్ సమర్పించారు.

also read ఆర్థిక ఉద్దీపనలు కల్పించడం అసాధ్యం: నీతి ఆయోగ్

అయితే బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరిస్తారని భావిస్తున్నారు. బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్మన్‌గా ఉన్న కేవీ కామత్‌ను ఆర్థిక మంత్రిగా తన క్యాబినెట్‌లోకి తీసుకుంటారని భావిస్తున్నారు. కేవీ కామత్ తోపాటు ఆరెస్సెస్‌కు చెందిన స్వపన్ దాస్ గుప్తాను తీసుకుంటారని సమాచారం. ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కూడా మార్చేస్తారని తెలుస్తోంది.

నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక బ్రిటష్‌ రాచరిక సంప్రదాయాలను పక్కనబెట్టారు. తదనుగుణంగా సూట్‌కేస్‌లో బడ్జెట్‌ ప్రసంగ ప్రతులను తెచ్చే విధానానికి స్వస్తి చెప్పారు. ఎరుపురంగు సంచిలో పత్రాలను తీసుకొచ్చారు. పశ్చిమదేశాల బానిసత్వం నుంచి విముక్తికి ఆమె చర్యలు చిహ్నమని చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ సుబ్రమణియన్‌ కూడా చెప్పారు. 

తమిళనాట పుట్టి.. తెలుగింటి కోడలయ్యారు. లండన్‌లో సేల్స్‌ గర్ల్‌ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. తండ్రి రైల్వే ఉద్యోగి అయినా సొంత కాళ్ల మీద నిలబడడానికి ఆమె ఎంతో శ్రమించారు. భర్త ఓ పార్టీ.. ఆమె మరో పార్టీ. అన్ని విషయాల్లో భర్త అడుగు జాడల్లో నడిచిన ఆమె రాజకీయాల విషయంలో మాత్రం భిన్న మార్గంలో పయనించారు. 

అయినా వ్యక్తిగత జీవితాన్ని.. రాజకీయాలతో ముడిపెట్టకుండా ఉన్నత స్థాయిలో నిలబడిన ఆమె ఎందరికో ఆదర్శం. ఆమే ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌. ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళగా రికార్డు సృష్టించారు. (1970 నుంచి 1971 వరకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు). ఇప్పుడు రెండో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తొలి మహిళ కూడా నిర్మలాసీతారామనే కావడం విశేషం.

జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి 1984లో నిర్మలా మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. అక్కడే ఆమె భర్త పరకాల ప్రభాకర్‌తో పరిచయం ఏర్పడింది. 1986లో వీరి పెండ్లి జరిగింది. అనంతరం 2008లో బీజీపీలో చేరారు. 2010 నుంచి 2014 వరకు పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. కార్యకర్తగా, అధికార ప్రతినిధిగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 

2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. ఈమె సేవలను గుర్తించి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈమె కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోదీ తొలి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్‌ పారికర్‌ గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో ఆ పదవి ఈమెను వరించింది. 2017లో రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఇందిరాగాంధీ తర్వాత ఈ శాఖ మంత్రిగా పనిచేసిన మహిళా మంత్రిగా ఘనత సాధించారు.

తండ్రి రైల్వేలో ఉద్యోగి అయినప్పటికీ ఈమె ప్రయాణం నల్లేరు మీద నడక కాలేదు. జవహర్‌లాల్‌ యూనివర్సిటీ (జేఎన్‌యూ) నుంచి పట్టా పుచ్చుకున్నా సేల్స్‌ గర్ల్‌గా పనిచేశారు. లండన్‌లోని రెజెంట్‌ స్ట్రీట్‌లో గృహోపకరణాల స్టోర్‌లో పనిచేశారు. తర్వాత బ్రిటన్‌లో అగ్రికల్చరల్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 

వాజపేయి ప్రభుత్వంలో 2003 నుంచి 2005 వరకు జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగానూ ఉన్నారు. గత ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఈమె ఆర్థిక మంత్రిగా మరెన్ని సంస్కరణలను ముందుకు తెస్తారో చూడాలి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సాధారణంగా సోషల్‌ మీడియాలో చాలా తక్కువగా పోస్టులు పెడుతుంటారు. వ్యక్తిగత విషయాలను చాలా వరకూ బయటకి చెప్పరు. ఇటీవల డాటర్స్‌ డే సందర్భంగా తన కూతురు చిన్ననాటి ఫొటోను ఆమె షేర్‌ చేశారు. ‘కూతుళ్ల గురించి ఎంతైనా చెప్పొచ్చు. డాటర్స్‌ డే సందర్భంగా నా కూతురితో ఆనాటి చిత్రమిది. నా స్నేహితురాలు, ఫిలాసఫర్‌, మార్గదర్శకురాలు ఈమే’ అని పేర్కొంటూ ట్వీటర్‌లో ఫొటోను పంచుకున్నారు. నిర్మల కుమార్తె పేరు పరకాల వాజ్ఞ్మయి. 

also read  Budget 2020:ఇప్పటి వరకు ఎంత మంది బడ్జెట్ ప్రవేశపెట్టారో తెలుసా...?

పోర్బ్స్‌ శక్తిమంతులైన మహిళల జాబితాలో స్థానం పొందిన  కిరణ్‌ మజుందార్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్య కొన్నాళ్ల క్రితం మాటల యుద్ధం జరిగింది. ఈ-సిగరెట్ల నిషేధ నిర్ణయంపై ప్రకటన తర్వాత కిరణ్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు చేశారు. 
‘ఈ-సిగరెట్లను నిషేధించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ ప్రకటన ఆరోగ్యశాఖ నుంచి రాకూడదా? మరి గుట్కాపై నిషేధం ఏమైంది? ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించేలా ఆర్థిక మంత్రి ఎలాంటి ప్రకటనలు చేయలేదేం?’ అని ఆమె ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 

దీనికి నిర్మలా సీతారామన్‌ దీటుగా స్పందిస్తూ.. ‘కిరణ్‌ జీ.. కేబినెట్‌ నిర్ణయాలు ప్రకటించేందుకు ఈ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటుచేశాం. ఓ అంతర్జాతీయ సమావేశం నిమిత్తం ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ విదేశాలకు వెళ్లారు. అందువల్ల మంత్రుల గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ హోదాలో నేను ఆ నిర్ణయాన్ని ప్రకటించాను’ అని తెలిపారు.

‘ఇక ఆర్థికమంత్రిగా ఆర్థికవ్యవస్థ పునురుద్ధరణకు చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ఎప్పటికప్పుడు నేను చర్చలు జరుపుతూనే ఉన్నాను. వాటిపై మాట్లాడుతూనే ఉన్నాను’ అని జవాబిచ్చారు. ఆ తర్వాత కూడా కిరణ్‌ తరచూ ఆర్థిక వ్యవస్థపై.. ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేస్తూ వచ్చారు.