Asianet News TeluguAsianet News Telugu

యెస్ బ్యాంకులో భారీగా ప్రైవేట్ బ్యాంకుల పెట్టుబడులు: కొత్త సీఈఓగా ప్రశాంత్ కుమార్‌ ?

ప్రైవేట్ బ్యాంక్ ‘యెస్’ బ్యాంకులో సంక్షోభం తొలగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఎస్బీఐతోపాటు ఏడుగురు ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఎస్బీఐ రూ.7500 కోట్ల పెట్టుబడులకు అంగీకరించింది. మొత్తం ఇన్వెస్టర్ల వాటా 49 శాతానికి పైగా ఉంటుందని తెలియవచ్చింది. ఇక తదుపరి యెస్ బ్యాంక్ సీఈఓగా ప్రశాంత్ కుమార్‌ను నియమించాలని ఆర్బీఐకి ఎస్బీఐ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.
 

Seven investors join SBI to put over Rs 12,000 cr into Yes Bank; Prashant Kumar proposed as new CEO
Author
Hyderabad, First Published Mar 13, 2020, 3:14 PM IST

ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంకును గట్టున పడేయడానికి ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐతోపాటు ప్రైవేట్ బ్యాంకర్లు ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్రా బ్యాంకులు, రాధాక్రుష్ణన్ దమానీ, రాకేశ్ ఝున్ ఝున్ వాలా, అజీం ప్రేమ్ జీ రూ.12 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని సమాచారం.

ఈ ఇన్వెస్టర్లు 49 శాతానికి పైగా వాటా కలిగి ఉంటారని తెలుస్తోంది. ఎస్బీఐ వాటా మాత్రం 45 శాతంగా ఉండొచ్చు. ఇక ఎస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ గా నియమితులైన ప్రశాంత్ కుమార్ తదుపరి సీఈఓగా అపాయింట్ చేయాలని ఎస్బీఐ రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది. 

ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్ బ్యాంకులోకి రూ.30 వేల బల్క్ డిపాజిట్లు తీసుకొస్తారని ఎస్బీఐ చేసిన ప్రతిపాదన ప్రకారం తెలిసింది. ఇప్పటికైతే తుది ఇన్వెస్టర్లు ఎవ్వరన్న సంగతి తెలియ రాలేదు. ఇదిలా ఉంటే ‘యెస్‌’బ్యాంకు నుంచి దాదాపు రూ.7250 కోట్ల విలువ గల షేర్ల కొనుగోలుకు భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్బీఐ) అంగీకరించింది. 

రూ.10 షేర్ విలువ కలిగిన 725 కోట్ల యెస్‌బ్యాంకు షేర్లను కొనేందుకు ‘ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ ఆఫ్ సెంట్రల్‌ బోర్డు’ ఆమోదముద్ర వేసిందని ఎస్బీఐ ప్రకటించింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.

also read షాపింగ్ చేస్తున్నారా జాగ్రత్త ! కరోనావైరస్ నెక్స్ట్ టార్గెట్ మీరే...

మొదట్లో కేవలం రూ.2450కోట్ల పెట్టుబడికే మొగ్గుచూపిన ఎస్‌బీఐ బోర్డు తాజాగా రూ.7250 కోట్లకు ఆమోదించడం విశేషం. దీంతో యెస్‌ బ్యాంకులో ఎస్‌బీఐ కంపెనీ వాటా 49శాతం ఉండనుంది. ఆర్‌బీఐ ప్రకటించిన ‘యెస్‌ బ్యాంకు లిమిటెడ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ స్కీమ్‌, 2020’ ముసాయిదా ప్రకారం ఈ వాటా సొంతం చేసుకోనుంది. దీనిప్రకారం, వచ్చే మూడేళ్లలో 26శాతం వాటా తగ్గకుండా యెస్‌ బ్యాంకులో ఈ పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది. 

సంక్షోభంలో ఉన్న యెస్‌ బ్యాంకుపై ఆర్బీఐ 30రోజుల మారటోరియం గడువు విధించిన విషయం తెలిసిందే. యెస్‌ బ్యాంక్‌ బోర్డును తాత్కాలికంగా రద్దు చేసిన ఆర్బీఐ.. ఎస్‌బీఐ మాజీ సీఎఫ్‌ఓని పాలనాధికారిగా నియమించింది.

ఈ మారటోరియం కాలంలో ఖాతాదారులు కేవలం రూ. 50వేలు మాత్రమే ఉపసంహరించుకునేలా ఆంక్షలు విధించింది. అయితే, తాజా పరిస్థితుల్లో ఈవారం చివరిలోగా మారటోరియాన్ని ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు ఎస్‌బీఐ చైర్మన్‌ రజినీష్‌ కుమార్‌ వెల్లడించారు.

మరోవైపు యస్‌ బ్యాంకులో ఇన్వెస్ట్‌ చేసేందుకు దేశీ సంపన్నులు (హెచ్‌ఎన్‌ఐ), ప్రముఖ ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు  విశ్లేషకులు తెలిపారు. షేరు ధర రూ. 26 స్థాయికి చేరి, వాస్తవ విలువ వెల్లడించడంతో ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నట్లు ఐఐఎఫ్‌ల్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. 

పెట్టుబడుల కోసం పలువురు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నామని యస్‌ బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రశాంత్‌ కుమార్‌ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ శనివారం వెల్లడి కానున్న యస్‌ బ్యాంక్‌ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై అందరి దృష్టి ఉంది.

అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో యెస్ బ్యాంకు సుమారు రూ. 1,000 కోట్ల నష్టాన్ని నమోదు చేయొచ్చని ఒక అనలిస్టు అంచనా వేశారు. మరోవైపు, అడాగ్‌ ఎన్‌బీఎఫ్‌సీతో పాటు కొన్ని రియల్‌ ఎస్టేట్‌ ఖాతాలు భారీ మొండిబాకీలుగా మారడం, నిరర్థక ఆస్థులకు మరింతగా ప్రొవిజనింగ్‌ చేయాల్సి రానుండటం వంటి అంశాలతో డిసెంబర్‌ త్రైమాసికంలో యస్‌ బ్యాంక్‌ సుమారు రూ. 778 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తెలిపింది. 

also read కుప్పకూలిన పర్యాటక రంగం...దేశంలో వారికి వీసాల రద్దు...

ఎస్‌బీఐ యాంకర్‌ ఇన్వెస్టరుగా ఉండటం వల్ల తదుపరి మరింతగా పెట్టుబడులు సమీకరించేందుకు కూడా సులభం కావొచ్చని వివరించింది. అలాగే ఎస్‌బీఐకి వాటాలు ఉండటం సైతం డిపాజిటర్లకు కాస్త ఊరటనిస్తుందని తెలిపింది.

ఇదిలా ఉంటే ప్రైవేట్‌ రంగ బ్యాంకుల నుంచి డిపాజిట్లను వెనక్కి తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ కోరింది. యెస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ మారటోరియం విధించడం, ఆ తదుపరి పరిణామాల నేపథ్యంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లోని డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ చేయాలని ప్రభుత్వ సంస్థలకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలిచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఆర్‌బీఐ ఓ లేఖ రాసింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకుల నుంచి ఒక్కసారిగా డిపాజిట్లు వెనక్కి తీసుకుంటే బ్యాంకింగ్‌, ఆర్థిక రంగంలో వైపరీత్యాలకు దారితీస్తుందని భావిస్తున్నామని పేర్కొంది. ఆ రంగాల స్థిరత్వంపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందని తెలిపింది.

అందువల్ల ఇప్పటికే ఆ విధమైన నిర్ణయమేదైనా తీసుకుని ఉంటే, దానిపై పునరాలోచించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్బీఐ కోరింది. ‘ప్రైవేట్‌ రంగ బ్యాంకుల నియంత్రణ, పర్యవేక్షణకు తగినన్ని అధికారాలు ఆర్బీఐకి ఉన్నాయి. ఈ అధికారాలను ఉపయోగించి డిపాజిటుదార్ల డబ్బుకు ఏమీ కాకుండా చూస్తామనే హామీ ఇస్తున్నామ’ని లేఖలో వెల్లడించింది. 

‘ప్రైవేట్‌ రంగ బ్యాంకులపై నమ్మకాన్ని కాపాడేందుకు, నష్టాన్ని నివారించేందుకు మారటోరియం విధించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా యెస్‌బ్యాంక్‌కు పునరుద్ధరణ ప్రణాళికను ప్రకటించాం. ఆ ప్రణాళికకు తుది రూపు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం’  అని ఆర్బీఐ వివరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios