ముంబై : అప్పుల సంక్షోభంలో చిక్కుకున్నందుకు వాటి నుంచి బయటపడేందుకు దివాళా పిటిషన్ దాఖలు చేయాలని అనూహ్యంగా నిర్ణయం తీసుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ ‌(ఆర్‌-కామ్‌) స్టాక్ మార్కెట్లు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చాయి. 

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ద్వారా ఫాస్ట్ ట్రాక్ తీర్మానం కోరనున్నామని కంపెనీ  రెగ్యులేటరీ సమాచారంలో  తెలియజేసింది.  దీంతో సోమవారం మార్కెట్లో  అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) కంపెనీ షేర్లకు భారీ షాక్‌​ తగిలింది. సెంటిమెంట్ దెబ్బ తిని ఇన్వెస్టర్ల అమ్మకాలకు తెగబడటంతో అన్ని షేర్లు భారీగా నష్టపోతున్నాయి.

సుమారు రూ. 40,000 కోట్లమేర రుణ పరిష్కారానికి 40 రుణదాత సంస్థల నుంచి సంపూర్ణ అనుమతి లభించక ఆర్‌కామ్‌ తాజా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత 18 నెలలుగా ఆస్తుల విక్రయం ద్వారా రుణ చెల్లింపులకు ప్రయత్నించినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో రుణ పరిష్కార అంశం ముందుకు సాగలేదని ఆర్‌కామ్‌ తెలిపింది. దీంతో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ) ను ఆశ్రయించనున్నట్లు పేర్కొంది.

దీంతో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇతర గ్రూపు కంపెనీల షేర్లు కూడా పతనం అయ్యాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆం‍దోళనతో నెలకొన్న అమ్మకాలతో ముఖ్యంగా ఆర్‌కామ్‌ షేరు 48 శాతం పతనమైంది.  ఒక దశలో 54.3 శాతం కుప్పకూలి, 5.30 రూపాయల వద్ద  రికార్డు  కనిష్టానికి చేరింది.

అడాగ్‌ గ్రూప్‌లోని  రిలయన్స్‌ కేపిటల్‌ (12.5), రిలయన్స్‌ పవర్ (13 శాతం), రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌,  రిలయన్స్ హోమ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ నావల్  తదితర కౌంటర్లు భారీ నష్టాలు మూటగట్టు కున్నాయి.