ముంబై: మంగళవారం కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కొంత కోలుకున్నట్లు కనిపించినప్పటికీ గురువారం మళ్లీ నష్టాలనే నమోదు చేశాయి.  గురువారం(మే9) ఉదయం నుంచి కూడా  ట్రేడింగ్‌ను దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్లకు పైగా పతనంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 

అంతర్జాతీయ మార్కెట్లు కూడా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయంతో నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా అదేబాటలో కొనసాగుతున్నాయి. 

గురువారం ఉదయం 10గంటల సమయానికి సెన్సెక్స్ 103.43 పాయింట్ల నష్టంతో 37685 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11,328 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హీరో మోటోకార్ప్, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, మారుతి షేర్లు ఎన్ఎస్ఈలో అధిక లాభాల్లో కొనసాగుతున్నాయి. 

ఇక యస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక డాలరు మారకంతో రూపాయి విలువ 14 పైసలు తగ్గి రూ. 69.85 వద్ద కొనసాగుతోంది.