‘బుల్’ రికార్డుల పరుగు: 37 వేల మార్క్ దాటిన సెన్సెక్స్

Sensex ends at record high of 36,985; hits 37k in intraday
Highlights

స్టాక్స్ ‘బుల్’ రికార్డుల మోత మోగిస్తున్నది. గురువారం అంతర్గత ట్రేడింగ్‌లో  37,006 పాయింట్లను తాకింది. చివరకు 36,985 పాయింట్ల వద్ద సరికొత్త లాభాలతో ముగింపు పలికింది.

ముంబై: దలాల్‌ స్ట్రీట్‌లో వివిధ రంగాల స్టాక్స్ రికార్డులు నెలకొల్పాయి.  బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల అండతో గురువారం కూడా లాభాల జోరు కనబర్చిన సూచీలు.. సరికొత్త శిఖరాలను చేరుకున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా 37వేల మార్క్‌ను తాకింది. నిఫ్టీ కూడా సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేసింది.

అలా 37వేల మార్క్‌ను తాకి..


గురువారం ఉదయం సెన్సెక్స్‌ స్వల్పంగా 40 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. అయితే కాసేపటికే కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో 140 పాయింట్లకు పైగా లాభంతో సూచీ దూసుకెళ్లింది. ఒక దశలో 37వేల మార్క్‌ దాటి 37,006 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అయ్యింది. అయితే ఆ వెంటనే సూచీ దిగొచ్చినా.. రోజంతా లాభాల్లోనే సాగింది. దీనికి తోడు జూలై డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు నేటితో ముగుస్తుండటంతో చివరి గంటల్లో కాస్త ఒడుదొడుకులను ఎదుర్కొన్నా, బ్యాంకింగ్‌ షేర్ల అండతో లాభాలను నిలబెట్టుకుంది.

సరికొత్త రికార్డులతో ముగింపు


గురువారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 126 పాయింట్లు లాభపడి 36,985 వద్ద సరికొత్త రికార్డులో ముగిసింది. అటు నిఫ్టీ కూడా 35 పాయింట్ల లాభంతో 11,167వద్ద సరికొత్త జీవన కాల గరిష్ఠ స్థాయిలో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.65గా కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐషర్ మోటార్స్‌, గ్రాసిమ్‌ షేర్లు లాభపడగా.. యస్‌ బ్యాంక్‌, మారుతి సుజుకీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం షేర్లు నష్టపోయాయి.

ఫేస్‌బుక్‌ సంపద రూ. 8.92 లక్షల కోట్లు హాంఫట్


సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. కేంబ్రిడ్జి అనలిటికా వల్ల జరిగిన సమాచార దుర్వినియోగంతో సంస్థ ఆదాయం భారీగా తగ్గిపోనుందని తాజాగా ఆందోళనలు రేకెత్తాయి. దీంతో కంపెనీ షేర్లు బుధవారం దాదాపు 21 శాతం పతనం అయ్యాయి. డేటా దుర్వినియోగ కుంభకోణం, దానిపై దర్యాప్తుల ప్రభావం నుంచి బయటపడేందుకు ఫేస్‌బుక్‌ ప్రయత్నిస్తుండగా తాజా ఆందోళనలతో మరో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభమైన తర్వాత కొన్ని గంటలకు ఫేస్‌బుక్‌ షేర్లు బాగా పతనం అయ్యాయి. దాదాపు 21శాతం పడిపోయి సుమారు 130 బిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.8.92 లక్షల కోట్లు) సంపద ఆవిరైంది.

అమ్మకాల ఒత్తిడిలో ఫేస్‌బుక్


ఫేస్‌బుక్‌ రెండో త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. ఆదాయం, వినియోగదారుల వృద్ధి అంచనాల కంటే తక్కువగా ఉండడంతో షేర్లు విపరీతంగా పడిపోయాయి. రెండో త్రైమాసికంలో సంస్థ లాభం 31శాతం పెరిగి 5.1బిలియన్‌ డాలర్లుగా, ఆదాయం 42శాతం పెరిగి 13.2బిలియన్‌ డాలర్లుగా ఉంది. కానీ ఇది అంచనాల కంటే తక్కువ. వచ్చే త్రైమాసికంలో బలహీనమైన ఆదాయం ఉంటుందనే అంచనాలను చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ డేవిడ్‌ వెహ్నర్‌ తెలుపడంతో షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.

వ్యక్తిగతంగా జూకర్ బర్గ్‌కు 16.8 బిలియన్ డాలర్ల నష్టం


సంస్థ షేర్లు పడిపోవడంతో సీఈఓ మార్క్‌జూకర్‌బర్గ్‌ 16.8 బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపదను కోల్పోయారు. ఫేస్‌బుక్‌ సమాచార భద్రత, ప్రైవసీపై అధికంగా పెట్టుబడులు పెట్టి దుర్వినియోగం జరగకుండా చూసేందుకు కృషి చేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జూకర్‌బర్గ్‌ చెప్పారు. భద్రతపై పెడుతున్న పెట్టుబడులు మెల్లగా తమ లాభాలపై ప్రభావం చూపుతాయన్నారు. తాము కంపెనీని సుదీర్ఘ ప్రయాణం సాగించేందుకు తప్ప వచ్చే త్రైమాసికం కోసం కాదని అన్నారు. 

loader