న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి-మార్చి త్రైమాసికం నాటికి దేశీయ టెలికాం మార్కెట్‌ మళ్లీ స్థిరత్వం సాధించనుంది. పోటీ హేతుబద్ధ స్థాయికి తగ్గుతుందని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాయ్‌) ఆశాభావం వ్యక్తం చేసింది. 

మొబైల్‌ సేవల కంపెనీలు తీవ్రమైన పోటీ నుంచి ఆదాయం, లాభదాయకత పెంపు కోసం విపణిలో కొత్త అవకాశాల అన్వేషణ వైపు దృష్టి సారించాయని ‘కాయ్’డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ పేర్కొన్నారు.

రాబడిని పెంచుకునేందుకు కస్టమర్లకు కంటెంట్‌, ఈ-కామర్స్‌, ఆర్థిక సేవలందించే ప్రయత్నాల్లో టెలికం సంస్థలు ఉన్నాయని ‘కాయ్’ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ అన్నారు. ‘గత ఐదారు త్రైమాసికాల్లో మొబైల్‌ ఆపరేటర్ల ఆదాయం, లాభదాయకత గణనీయంగా తగ్గింది. అయితే, మున్ముందు ఆదాయ క్షీణతకు అడ్డుకట్ట పడనుంది’ అని చెప్పారు. 
 
టెలికం కంపెనీల మధ్య నెలకొన్న తీవ్ర స్థాయి పోటీ కూడా తగ్గుముఖం పట్టనుందని, వచ్చే ఏడాది జనవరి-మార్చి కల్లా స్థిరత్వం సాధించవచ్చునని ‘కాయ్’ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్‌ అభిప్రాయపడ్డారు. ‘ఇండస్ట్రీ పరంగా, మేం అత్యంత అధమ పరిస్థితులను చవిచూశాం. అయితే నిధుల సేకరణ కంపెనీలకు సవాలుగా మారిన నేపథ్యంలో పోటీ హేతుబద్ధ స్థాయికి తగ్గవచ్చని భావిస్తున్నాం’ అని మాథ్యూస్ పేర్కొన్నారు.

‘గడ్డు పరిస్థితులిక గతం. భవిష్యత్‌పై సానుకూల వైఖరితో ఉన్నాం’అని కాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ అన్నారు. జనవరి-మార్చి త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ రూ.107.2 కోట్ల లాభం, రూ.20,602 కోట్ల రాబడిని నమోదు చేసుకుంది. 

ఇదేకాలానికి రిలయన్స్‌ జియో లాభం 64.7 శాతం వృద్ధి చెంది రూ.840 కోట్లకు చేరుకుంది. నిర్వహణ ఆదాయం సైతం 55.8 శాతం పెరిగి రూ.11,106 కోట్లుగా నమోదైంది. వొడాఫోన్‌ ఐడియా ఈ నెల 13న ఆర్థిక ఫలితాలు విడుదల చేయనుంది.

టెలికం రెవెన్యూలో 10 శాతం పెరుగుదల: ఫిచ్ అంచనా
భారత టెలికం రంగంలో తన స్థానాన్ని తిరిగి మెరుగుపర్చుకునే దిశగా నంబర్ 2 సంస్థ ఎయిర్ టెల్ చివరి త్రైమాసికంలో ప్రకటించిన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెలికం రంగ ఆదాయం 5-10 శాతం పెరుగుతుందని ‘ఫిచ్’ అంచనా వేసింది. ఇది మూడేళ్లలో తొలి పెరుగుదల కానున్నదని తెలిపింది. నెల వారీగా యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ప్రతి టెలికం సంస్థ ఆదాయం పెంపునకు కీలకం కానున్నది. 

అలాగే టారిఫ్‌లు 20 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఫిచ్ డైరెక్టర్ నితిన్ సోనీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నెల వారీగా యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఆర్పు) 10-20 శాతం పెరిగి $1.6-1.7 (రూ.111-118)లకు చేరుతుందని నితిన్ సోనీ అంచనా వేశారు.

మినిమం మొబైల్ టారిఫ్ నెల వారీగా రూ.35 ఖరారు కానున్నది. అక్కడ నుంచి డేటా యూసేజ్‌ను బట్టి టారిఫ్ పెరుగుతుందని ఫిచ్ పేర్కొంది. మూడు అగ్రశ్రేణి టెలికం కంపెనీలు తమ లాభాలను 30-33 శాతం మధ్య స్థిరీకరించుకోవడానికి పోటీ పడతాయని భావిస్తున్నట్లు ఫిచ్ డైరెక్టర్ నితిన్ సోనీ పేర్కొన్నారు.